Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 3

   
    శ్రీదేవి తల్లికి అనారోగ్యంగా వుందని తెలిసినప్పుడు అతను ఆ  ఊరి దేవత గంగమ్మకు పదహారు కొబ్బరికాయలు కొట్టాడు. ఇలాంటివి చాలానే చెప్పచ్చు.

    అతను ఒంటినిండా శ్రీదేవి పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

    అంతపిచ్చి అతనికి శ్రీదేవంటే

    శ్రీదేవినుంచి టాపిక్ సినిమాలమీదకు మళ్ళింది. వాళ్ళు ఆ టాపిక్ లోనే వుండగానే కంబళిపురుగు కదులుతున్నట్టు చీకట్లు లోకంమీద వాలుతున్నాయి. ఇక అందరూ ఇళ్ళకువెళ్ళే టైమ్ అయింది. సినిమాలమీద అంత ఘాటుగా చర్చ జరుగుతున్నా ఒక్కమాట కూడా మాట్లాడంది రమణే.

    రమణ మౌనంగా వుండడాన్ని మొదట పసిగట్టింది యోగీంద్ర. "ఏమిట్రా రమణా! వచ్చినప్పట్నుంచీ ఒక్క మాట మాట్లాడలేదు. ఒళ్ళేమైనా బాగాలేదా?"

    "ఒళ్ళు నిక్షేపంలా వుంది ఏమైనా జబ్బు చేసుంటే ముఖంలో అది కనిపించదా. మనసే బాగా లేనట్టుంది మనవాడికి" సుబ్రమణ్యం ఎగతాళిగా అన్నాడు.

    మరి కాబోయే పెళ్ళికొడుకు. మనసంతా కాబోయే పెళ్ళాం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టుంది" రంగడు కవ్వింపుగా అన్నాడు.

    "పెళ్ళికొడుకు ఎంత హుషారుగా వుండాలి. కదిలిస్తే ఆనందం పొడిగా రాలుతుందేమో అన్నట్టు వుండాలి."
 
    "పెళ్ళంటే దిగులు పడతావేమిట్రా చిట్టితండ్రి. పెళ్ళయితే కొన్ని కష్టాలు తప్పుతాయి. అర్ధరాత్రి అపరాత్రి గోడదూకే సాహసాలు చేయక్కర్లేదు. ఏ పెద్దపులో వచ్చేస్తుందని బెదిరిపోతూ నీళ్ళుతాగే జింకపిల్ల లా చీకట్లో ఏ గడ్డివాము చాటులోనో గింజుకుపోవడంలాంటి బాధలుండవు"

    "నిజమేగానీ! నాదీ కొత్త బాధరా" రమణ మొదటిసారి నోరు విప్పాడు.

    "ఏమిట్రా?" మిత్రులంతా కలిసి అడిగారు.

    "ఏం చెప్పనురా. చెప్పాలంటే సిగ్గుగా వుంది"

    "ఫరవాలేదు. అందరం చీకట్లో వున్నాం ఒకరి ముఖాలు ఒకరికి సరిగ్గా తెలియడంలేదు. ఇక్కడ ఎవరూ లేరనుకుని చెప్పేయరా"
    "పెళ్ళంటే భయంగా వుందిరా"

    "భయమెందుకురా బడుద్దాయ్."

    "ఎందుకంటే ఇంతవరకు ఏ ఆడపిల్లను టచ్ చేయలేదురా నేను. మరి మొదటిరాత్రి ఎలా వుండాలో, ఏం చేయాలో, ఎలా ప్రొసీడ్ కావాలో తెలియడంలేదు. అది తలుచుకుంటూ వుంటేనే చెమటలు పట్టేస్తున్నాయిరా" అన్నాడు రమణ దిగులుగా.

    "ఎక్స్ పీరియన్స్ లేదని నువ్వు స్పెషల్ గా చెప్పాలా. ఆడపిల్ల ను చూస్తూనే బెదిరిపోయి ఆమడదూరం పారిపోయే నువ్వు ఇంతవరకు ఆ అనుభవానికి నోచుకోలేదు. దీనికి అనుబవం పెద్ద అవసరంలేదులే" సర్దిచెప్పారు యోగీంద్ర.

    "ఎలారా? ఎద్దుల్లో ఏది వలపటో, ఏది దాపటో తెలియకపోతే బండి సజావుగా తోలగలమా? కొండ్ర చక్కగా వేయను తెలియకపోతే మడక సరిగా దున్నగలమా? ఏదైనా ముందు నేర్చుకోవాలి గదా.

    హ్యాండిల్ పట్టుకోవడానికి రాకపోతే సైకిల్ తొక్కగలమా? మరి పడకటింట్లో ఏమీ తెలియకపోతే పెళ్ళాన్ని సుఖపెట్టగలమా?" తన సందేహాలనంతా అలా వెళ్ళగక్కారు రమణ.

    "నువ్వు చెప్పింది నిజమేననుకో. మరిప్పుడు ఏమిటి చేయడం?" అన్నాడు యోగీంద్ర.

    "అదే నా బాధ కూడా."

    "దీనికి ఒక్కటే మార్గముంది" యోగీంద్ర అలా చెప్పడంతో అందరూ అటెన్షన్ లోకి వచ్చారు అదేమిటో వినాలన్న కుతూహలంతో.

    "సైకిల్ నేర్పించేందుకు ఓ గురువు కావాలి. అక్షరాలు దిద్దించడానికి ఓ అయ్యవారు కావాలి. కొండలు ఎలా ఎక్కాలో చెప్పేందుకు ఓ ట్రైనర్ కావాలి. అలానే పడకటింట్లో ఏం చేయాలో చెప్పించేందుకు ఓ ఆంటీ కావాలి" అన్నాడు.

    "నాకూ అలా ముందే నేర్చుకోవాలనుంది అప్పుడిక పెళ్ళాం దగ్గర పరువుపోయే ప్రశ్నే వుండదు" రమణకి అప్పుడొచ్చింది. ఉత్సాహం.

    "మరిక దేనికి ఆలస్యం? వెళ్ళి చంద్రత్తను అడిగెయ్" సుబ్రమణ్యం సలహా ఇచ్చాడు.

    "చంద్రరేఖనా!" రమణ ఆమె పూర్తిపేరు చెప్పి సందేహంగా అడిగాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS