అపస్వరం
శర్వాణి

చామరాజపేట వీధిలో జట్కా బండి మెల్లగా పోతోంది బండికి కట్టిన గుర్రం ఎముకలు కనిపించేలా వుంది. బండిని తోలుతున్న సాఎబు హాయిగా ఈలవేస్తూ గుర్రాన్ని తోలుతున్నాడు.
"త్వరగా పోనివ్వు, సాయేబూ, రైలు దాటి పోయేను"
లోపలి నుండి హెచ్చరించింది, ఓ మగ గొంతు.
"హాయిగా కూకోండయ్యా. టేమ్ కు కరెట్టుగా టేసను కాడ దించేత్తా. ఇరవై ఏళ్లుగా కడతున్నానయ్యా బండి. నాకు తెల్దా టేము?" అంటూ సాయేబు, "హెవే, చల్రే బేటా" అని గుర్రాన్ని అదలించాడు. గుర్రం జోరుగా పరిగెత్తసాగింది.
"కాస్త ముందుకు జరగంచె బాబయ్యా"
"ఇంకా ఎంత ముందుకు రమ్మంటావయ్యా. ఇక రమ్మంటే వచ్చి గుర్రం మీద కూర్చోవాల్సిందే" అని గొణుక్కుంటూ ముందుకు జరిగారు, కృష్ణయ్యగారు.
కృష్ణయ్యగారికి సుమారు నలభై అయిదేళ్ళుంటాయి. కరుణా, గాంభీర్యం ఉట్టి పడుతున్నాయి, ఆయన ముఖంలో ఆయన వేసుకున్న గుడ్డలు, ఆయన మధ్యతరగతి చెందిన వాడన్న విషయాన్ని తెలుపుతున్నాయి. బాదామి రంగు చిన్న చిన్న గళ్ళకోటు తొడుక్కున్నారు. బాదామి రంగు చిన్న చిన్న గళ్ళకోటు తొడుక్కున్నారు. తెల్లటి ధోవతి గూడ కట్టుకట్టారు. తల మీద నల్ల టోపీ ఉంది. కళ్ళకు అద్ధాలు పెట్టుకున్నారు.
"ఏ వూరు పోతన్నారు. బాబయ్యా?"
"మైసూరు"
"ఎగ్జిబిసను చూత్తానికా బాబయ్యా?"
"కాదయ్యా, మా వూరే మైసూరు. ఏదో పని మీద బెంగుళూరు వచ్చానంతే." అంటూ జేబులో నుండి నల్లటి పొడుండబ్బీ తీసి, ఒక్క పట్టు వశ్యం వేసుకొని, జేబురుమాలుతో ముక్కు తుడుచుకున్నారు. బండిలో ఒక వారగా మ్డుడుచుకొని కూర్చొని, మోకాళ్ళ మీద తలదాచుకొని వెక్కుతున్న పిల్లవేపు తిరిగి.
"మీరా, ఇలా చూడమ్మా, ఈ డబ్బీ మీద ఎంత నుంచి బొమ్ముందో" అన్నారు, పొడుండబ్బీ చూపుతూ మీరా వెక్కుతూనే తల పైకెత్తి చూసింది. మొహమంతా కన్నీళ్ళతో తడిసిపోయింది. చెదరన వెంట్రుకలు ముఖం మీద పడి, చెంపలకు అంటుకు పోయాయి. కళ్ళు రెండూ ఎర్రగా ఉన్నాయి.
మీర, డబ్బి మీదున్న, రధానికి కట్టిన జోడు గుర్రాల బొమ్మవేపే చూస్తూ ఉంది.
"బాగుంది కదూ?"
మీర బదులు చెప్పకుండా, చేతులతో మొహాన్ని కప్పుకొని ఏడవ సాగింది. కృష్ణయ్యగారు విసుగ్గా
"ఏడవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాలి. ఇక ఏడ్చానంటే నిన్నిక్కడే వదలేసి, నే నొక్కన్నే మైసూరు వెళ్ళిపోతానంతే!" అన్నారు.
మీరు భయం భయంగా ఆయన వేపుచూస్తూ వచ్చే ఏడుపును బలవంతాన ఆపుకుంది. ఇదంతా గమనిస్తున్న జటకా సాయేబు
"ఎందుకయ్యా,చిన్నమ్మ ఏడుత్తది?" అన్నాడు.
"ఏమిటో తెలీదు" అంటూ కృష్ణయ్యగారు మౌనంగా కూర్చున్నారు. బండి స్టేషను చేరేదాకా మీరా ఏడుస్తూనే ఉంది. కృష్ణయ్యగారు బండి దిగి, మీరను ఎత్తుకుని క్రిందికి దింపారు. బండి వాడికి కిరాయి ఇచ్చి పంపేసి టికెట్టు తేవడానికి వెళ్లారు. మీరు కూడా ఆయన వెనకనే బయలుదేరింది. అది చూసి కృష్ణయ్యగారు.
"నాతో రాకు. సామాను చూస్తూ అక్కడే నుంచో" అని చెప్పి వెళ్ళి టికెట్ కోసం క్యూలో నుంచున్నారు. అంతా సందడిగా ఉంది. అది చూసి మీర తన ఏడుపు కూడా ఆపింది. చుట్టూ ఉన్న మనుష్యుల వేపు భయంగా చూస్తూ పెదనాన్నవేపు చూస్తోంది. ఆయన భయపడ వద్దని కనుసన్నలతో సమాధానం చెపుతున్నారు. మీరు చుట్టూ ఒక గోనినిండా గిన్నెలు, పడక చుట్టి, రెండు ట్రంకు పెట్టెలు, ఓ బుట్ట ఉన్నాయి. కృష్ణయ్య గారు టికెట్టు తీసుకొనివచ్చి "కూలి కావాలా, కూలి" అంటూ మీరని బెదిరిస్తున్న కూలి వాళ్ళను పంపేసి, ఓ కూలివాడికి సామాను అప్పగించారు.
సామాను రైల్లో పెట్టి, మీరను కూర్చోవడానికి చోటుచేసి ఆ పిల్లను కూర్చోపెట్టి.
"ఆకలిగా ఉందా అమ్మా" అన్నారు కృష్ణయ్య గారు.
"ఊ చాలా ఆకలిగా ఉంది"
"సరైతే ఇక్కడే కూర్చో భయపడకు. నేను వెళ్ళి కాఫీ, టిఫిన్ తెస్తాను." అంటూ దిగి వెళ్ళారు. మీరు ఆయన్ వెళ్ళిన వేపే చూస్తూ కూర్చుంది. పావు గంట దాటాక రెండు ఇడ్డెన్లు, ఒక గ్లాసు కాఫీ తెచ్చి.
"తినమ్మా" అన్నారు. మీరు గబగబా తినసాగింది.
ఎదురు సీటులో కూర్చున్న ముసిలాయన, తను కప్పుకున్న పచ్చ శాలువాను, మరింత గట్టిగా లాక్కొంటూ.
"మీ అమ్మాయేనాండి?" అని అడిగాడు.
"కాదండి. మీ తమ్ముడి కూతురు"
"పిల్ల భలే చురుగ్గా ఉంది మోహంలో కళ ఉంది" అన్నాడాయన.
ఆయన మాటల్లో ఉత్ప్రేక్ష ఏమీ లేదు. మీరు ముతగ్గా ఉన్న పసుపురంగు చుక్కల జాకెట్టు వేసుకొని, అక్కడక్కడ టక్కు కుట్టు వూడిన గీతల పరికిణీ కట్టుకుంది. అసలే ఉంగరాల జుత్తేమో, తల దువ్వుకోక పోవటం వల్ల గాబోలు జుత్తంతా చిందర వందరగా, భుజాల మీద, మెడ మీద పడి ఉంది. చేతుల్లో ఒక జత వెండి గాజులు మెడలో యెర్రపూసల దండ ఉన్నాయి. ఇలాంటి దుస్తులు వేసుకున్నా, ఆ పిల్ల మొహంలోని కళ చెరగలేదు. తీర్చి దిద్దినట్టున్న ముక్కు, కోమల మైన కపోలాలు, కాస్త లావనిపించే పెదవులు, అన్నిటికన్నా మిన్నగా, చిలిపితనం స్వాభిమానాలను వెదజల్లే కళ్ళు, ఆ పిల్ల నిస్సందేహంగా అందమైన పిల్లే అని చాటుతున్నాయి. అప్సరసల కోవకు చెందక పోయిన ఒక విధమైన సుప లావణ్యం చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది.
ఇక రైలు బయల్దేరుతుందనగా, బూడిద రంగు కోటు తొడుక్కొని, చేతి సంచితో ఒకాయన గబగబావచ్చి పెట్టెలో ఎక్కారు. కృష్ణయ్య గారిని చూసి,
"ఓహో నమస్కారం. ఎక్కడి దాకా వెడుతున్నారు?" అని అడిగారు.
"మైసూరికి, వాపస్ పోతున్నాను."
"అంతా విన్నానండి. పాపం, మీ తమ్ముడు పోయారట. ఏమైందేమిటి?"
"నిమోనియా వచ్చి పోయాడు."
"ఎన్ని రోజులయింది?"
"అప్పుడే పదిహేను రోజులయిందండి"
"పాపం, చాలా ఘోరం జరిగిందండి. ఇంకా చిన్న వయస్సు" అంటూ దగ్గరగా వచ్చి, "కాస్త చోటిద్దురూ, ఇక్కడే మద్దూరులో దిగిపోతాను" అన్నారు.
కృష్ణయ్యగారు కొద్దిగా జరిగి చోటిచ్చారు. ఆయన, అక్కడ కూర్చుని సానుభూతిగా.
"పాపం పెళ్ళాం పిల్ల్లలగతి ఏమిటండి ఇహ" అన్నారు.
"పెళ్ళాం పుణ్యం చేసుకుంది నరసింహయ్య గారు. ఆమె కళ్ళు మూసి ఆర్నెల్లవుతోంది. ఇక ఈ ఒక్క పిల్లే ఉంది వాళ్ళింటిపేరు నిలపడానికి"
"అయితే ఈ అమ్మాయి బాధ్యతంతా మీదేనన్నమాట.
"అవును మరి ఇక ఎవరున్నారు చెప్పండి"
"అంతేలేండి మీకు నలుగురూ కొడుకులే గదా వాళ్ళ మధ్య కూతురిగా పెరుగుతుంది" అని తమ మాటలనే వింటూ మౌనంగా కూర్చున్న మీరవేపు తిరిగి.
"నీ పేరేమిటమ్మా" అని అడిగారు.
"మీర"
