సుందరం ఇదంతా చూసి ఎందుకో దడుచుకున్నాడు. దొడ్డి ఈ విధంగా ఉండటానికీ, తన తండ్రి చచ్చి పోవటానికీ ఏదో సంబంధం ఉందనుకున్నాడు. "ఈ ఇంటో మళ్ళీ వచ్చి ఎట్లా ఉంటాం?" అనుకున్నాడు వాడు.
కాని మరి పది పదిహేనురోజుల అనంతరం ఇంటికి పుణ్యాహవాచనం చేసి మళ్ళీ ప్రవేశించేనానికి దొడ్డి ఎప్పటిలాగే శుభ్రంగా ఉంది. ఎప్పుడు ఎవరువచ్చి దొడ్డి బాగుచేసిందీ సుందరం ఎరగకపోవటంచేత వాడికి తానుచూసిన కీకారణ్యంలాంటి దొడ్డి ఒక కలగా జ్ఞాపకం ఉండిపోయింది.
అయినా సుందరానికి ఈ సారి జీవితం కొత్తగానే ఉన్నది. ఈసారి సీతమ్మగారు తన ఇద్దరి పిల్లలతో చిన్న భాగంలో ప్రవేశించింది.
తరువాత కొద్దిరోజులకే ఆదినారాయణ అనే ఆయన తన భార్యతోనూ, అత్తగారితోనూ, ఇద్దరు కుమాళ్ళతోనూ వచ్చి పెద్దబాగంలో ప్రవేశించారు. వాళ్ళు చాలా మర్యాదస్తులు. బాగా ఉన్నవాళ్ళు. ఆదినారాయణగారికి ఉద్యోగమేమీలేదు. ఆయన కేవలం పిల్లల చదువుకోసం బస్తీచేరాడు. అయన కిద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. అయినా తరచూ పుట్టింటికి వచ్చి నెలల తరబడి ఉండిపోతారు.
ఆదినారాయణ భార్య పేరు భ్రమరాంబ. ఆ పేరు సుందరం చెవికి చాలా అందంగా వినపడింది. ఆవిడ నల్లనిదైనా మొహాన కళ ఉన్నదని తల్లి అనగా సుందరం విన్నాడు. సుబ్బమ్మ లాగా భ్రమరాంబగారు కబుర్లు చెప్పటానికి వచ్చేదికాదు. దాన్ని బట్టి సుందరానికి సుబ్బమ్మ మీదలేని గౌరవం భ్రమరాంబగారి మీద ఏర్పడింది. అయితే వాడికి ఒక్కందుకు కోపం వచ్చేది. భ్రమరాంబ తన తల్లిని "అక్కగారూ" అని పిలిచేది.
"అమ్మా, నువు పిన్నిగారికన్న పెద్దదానివా?" అని అడిగాడు సుందరం.
సీతమ్మ నవ్వి, "కాదు , ఏం?" అన్నది.
"నిన్ను అక్కగారని పిలుస్తుందేం?"
"చెల్లెలు గారని పిలవమన్నావా?" అన్నది తల్లి. ఈ మాటకు సుందరానిక్కూడా నవ్వొచ్చింది.
భ్రమరాంబ కొడుకులు ఒకడు రామూర్తీ, ఇంకోడు క్రిష్ణమూర్తీనీ, ఇద్దరూ ముచ్చటముళ్ళు వేసుకుని "పొట్లెం" గా ఉండేవాళ్ళు. అంత సుకుమారి పిల్లల్ని__ అందులోనూ మగపిల్లల్ని__ సుందరం ఎన్నడూ చూడలేదు. వాళ్ళు ఎప్పుడూ సిల్కు చొక్కాలు, చలవచేసినవి, తొడుక్కుని ఎక్కడ చూసిపోతామో అన్నట్లుండేవాళ్ళు. వాళ్ళు ఏ ఆటలకూ వచ్చేవాళ్ళు కారు. కృష్ణమూర్తిని సుందరం, "గోలీలాడడాం వస్తావుటోయ్?" అంటే, "బట్టలు మస్తాయోయ్!" అన్నాడు. సుందరం ఎప్పుడోతప్ప ఇంటో ఉతికినబట్టలు వేసుకునేవాడు. కృష్ణమూర్తి రాత్రిపూట పడుకోబోయేటప్పుడు తప్ప ఇస్రీబట్టలే వేసుకునేవాడు.
"అమ్మా, పిన్నిగారబ్బాయిలు ఎప్పుడూ ఇస్రీబట్టలేసుకుంటారే, నాకు వెయ్యవేం?" అని సుందరం తల్లి నడిగాడు.
"వాళ్ళు నాలుగురోజులూ అయిదురోజులూ అదేబట్టలు వేసుకుంటారు. అవి మాయకుండా ఉండటానికి ఉత్సవిగ్రహలల్లే కుర్చీ లెక్కి కూచుంటారు. అదేం నయంరా? నువ్వు రోజూ ఉతికిన బట్టలు వేసుకుంటున్నావు. అది శుభ్రంగా ఉండదూ?" అన్నది తల్లి. సుందరం పూర్తిగా ఈ వాదాన్ని ఒప్పుకోలేదుగాని, పైకేమీ అనలేదు.
రామ్మూర్తి స్కూలు తెరవగానే ఫస్టుఫారంలో చేరబోతున్నాడు. క్రిష్ణమూర్తి సుందరంలాగే మూడోక్లాసులో చేరబోతున్నాడు. అందుచేత సుందరం వాడితో మంచి స్నేహం చెయ్యటానికి ప్రయత్నించాడు. అయితే కృష్ణమూర్తి ఇంకొకరికి మన సిచ్చి స్నేహం చెయ్యటం చాతనయినవాడు కాడు. ఇంకొకరి మనస్సు తీసుకోనూలేడు.
కాని కృష్ణమూర్తికి పెద్దవాళ్ళు కొన్ని మర్యాదలూ అవీ నేర్పారు. అందుచేత మొదట చూడగానే ఎటువంటి వాళ్ళకికూడా "ఆహా, ఎంత బుద్ధిమంతుడు!" అనిపించేది. వాడు బుద్దిమంతుడు కాదని కాదు. కాని ఆ బుద్దిమంతనంలో ఏ విశిష్టతా లేదు. వాడు అమిత పిరికివాడు. ఎక్కడ నలిగిపోతాడో అన్నట్టు పెంచటంవల్ల సుకుమారం జాస్తయి బొత్తిగా జిడ్డుమనిషిగా తయారైనాడు. చలికాలం వస్తే తెల్లారిజాము పొద్దెక్కేదాకా ఫ్లానల్ చొక్కాతొడుక్కుని, నెత్తికి పూలుకుళాయి పెట్టుకుని, దాన్ని చెవుల మీదకి లాక్కుని, కుర్చీలో కూర్చుని, ఉండచుట్టుకుని వణుకుతూ ఉండేవాడు. వానలుకురిస్తే అరికాలికి చుక్క తడి తగల నిచ్చేవాడు కాడు. ఇటువంటి సంగతులన్నీ సుందరం కృష్ణమూర్తి నోటా,భ్రమరాంబ నోటా,ఆదినారాయణ నోటా, రామ్ముర్తి నోటా, విన్నాడు. కాని వాడికిదంతా నచ్చలేదు. సుందరం అనుభవంలో చలికి వణుకుతుంటే సరదాగాఉంటుంది. ధనుర్మాసంలో సీతమ్మగారు తెల్లవారుజామునే లేచి లాంతరు దగ్గిరపెట్టుకుని ఇంటి ముందు పెద్దపెద్ద ముగ్గులువేస్తుంటే సుందరం చలికి కొంత గజగజలాడుతూ, కావాలని మరింతగా పళ్ళు టకటక లాడించేవాడు. తల్లి ఎంతచెప్పినా లోపలికి వెళ్ళేవాడు కాడు. పోనీ శాలుపన్నా తెచ్చికప్పుకునేవాడుకాడు. ముగ్గు సాంతం అయిన తరువాత వీధిలోకివెళ్ళి నాయుళ్ళింటిముందు భోగిమంట దగ్గర కూర్చుని చలి కాచుకునేవాడు. కృష్ణమూర్తికి ఇది తలవటానిక్కూడా వీల్లేని కార్యక్రమం. వాడెన్నడూ సూర్యోదయానికి ముందు లేచి ఎరగడు.
"అమ్మా, వాళ్ళ కృష్ణమూర్తి మంచివాడంటావే, వాడు రోజూ పొద్దెక్కి లేస్తాడు. పక్కలో ఉచ్చబోస్తాడు. ఎవరన్నా తోడురాందే రాత్రిపూట వెన్నెలగా ఉన్నా బయటకి రాలేడు" అన్నాడు సుందరం తల్లితో.
"బాగుందే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది. పెద్దవాళ్ళు కాస్త గారాబంగాచూస్తే పిల్లలు అట్లాగే అవుతారు. అయినా కృష్ణమూర్తి బుద్దిమంతుడే. ఒక పొరుపూ పొచ్చెమూ అక్కర్లేనివాడు. చీకట్లో బయటకి పోగలనుగదా అని గర్వపడడు. నీకన్న కొన్ని విషయాల్లో కృష్ణ మూర్తి చాలా మంచివాడు" అన్నది సీతమ్మగారు.
