Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 19


    "వెల్!" అన్నాడు చక్రపాణి.
    మరికొద్దిసేపు వాళ్ళమధ్య దీర్ఘమైన చర్చలు జరిగాయి.
    చివరికి
    ఈ కేసుని
    అనుపమా సర్కార్ కి అప్పగించటం జరిగింది.
    "నాకొక అసిస్టెంటూ, కొన్ని పరికరాలు కావాలి. అవిచాలు" అంది అనుపమా సర్కార్.
    "ఓ.కె" అన్నాడు చక్రపాణి.
    ఆర్.కె. అధికారి చక్రపాణి మిగతా అందరూ సమావేశం చాలించి లేచారు.
    
                           10
    
    ఆర్ష కోపంతో మండిపోతున్నాడు.
    ఆ గదిలో ఉన్న ఐదుగురూ పెదవి కదిపితే ప్రాణం మీదికి వస్తుందేమో అని, ఎవరికి వారు మౌనంగా ఉండిపోయారు.
    అక్కడ ఉన్న వాళ్ళల్లో, లంబా మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
    పైకి మాత్రం మొఖం గాంభీర్యంగా పెట్టుకుని అందరిలాగానే తలవంచుకుని కూర్చున్నాడు.
    చేతులు వెనక్కి పెట్టుకుని కోపంతో పచార్లు చేస్తున్న ఆర్ష చటుక్కున ఆగి "నేను చాలా తెలివి తక్కువ పని చేశాను" ఈ మాట పైకే అని మరలా పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు.
    "అవును బాస్! మీరు తెలివి తక్కువ పనే చేశారు. ఈ మాట అనే ధైర్యం అక్కడ ఎవరికీలేదు.
    అలా అని,
    "బాస్! మీరు తెలివి తక్కువపని ఎప్పుడూ చెయ్యరు" అని ఈ మాట కూడా అనే ధైర్యం అక్కడ ఎవరికీలేదు.
    లంబాకి మాత్రం ఆర్షతో ఏదో వకటి మాట్లాడాలని మహా ఉబలాటంగా వుంది. కానీ ఆర్షముందు ఉబలాటాలూ బులపాటాలూ పని చెయ్యవు. అణుమాత్రం మాటతేడావచ్చినా ఆర్ష చేతిలో హరీ అనటం ఖాయం. అందుకని లంబా పెదవి కదపలేకపోతున్నాడు.
    ఆర్ష నుంచి సాధనకి కబురు వెళ్ళింది.
    ఇప్పుడో ఇంకాసేపటికో సాధనా వస్తుంది.
    ఆ తరువాత,
    ఆర్ష ఏమడుగుతాడు? సాధన ఏం జవాబు చెబుతుంది? చెప్పిం తరువాత ఏం జరుగుతుంది? అన్నది ఎవరి వూహకి అందని విషయం.
    అలాంటివాళ్ళ వూహకి అందే విషయం ఒకటే "ఈ రోజుతో సాధనపని సమాప్తం" అని మాత్రమే పచార్లు చేస్తున్న ఆర్ష మళ్ళీ ఆగాడు, "క్షమించను, ఎంత మాత్రం క్షమించను" ఈ మాట పైకే అని మళ్ళీ పచార్లు మొదలుపెట్టాడు.
    పావుగంట గడిచిపోయింది.
    అలారం బెల్ మ్రోగింది. ఆ వెంటనే రెడ్ లైట్ వెలిగింది.
    అదిచూసి, చేస్తున్న పచార్లు ఆపి ఆర్ష టేబుల్ వెనుక ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
    అక్కడ ఉన్న ఎవరికీ తెలియకుండా ఆర్ష్ చెయ్యి స్విచ్ నొక్కింది.
    వెంటనే మినీ స్క్రీన్ మీద సాధనరూపం ప్రత్యక్షమయింది.
    ఆర్ష్ కోపాన్ని నిగ్రహించుకుని "ఆనంద్ ఎవరొచ్చారో వెళ్ళి తీసుకురా" అన్నాడు చిరునవ్వుతో.
    మరో నిమిషంలో ఆనంద్, ఆనంద్ వెనుకనే సాధనా లోపలికి వచ్చారు.
    బాస్ కి చిరునవ్వుతో విష్ చేసింది సాధన.
    ఆర్ష తలపంకించి వూరుకున్నాడు.
    ఆర్ష తల పంకించటాన్ని బట్టే ఆయన చాలా కోపంగా ఉన్నాడనీ సాధన గ్రహించింది, ఆమె పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది.
    ఓరకంటితో లంబాను చూసింది.
    సాధనానే కన్నార్పకుండా చూస్తున్న లంబా చటుక్కున ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
    ఆర్ష మాట్లాడినదానా సాధన మాట్లాడటానికి లేదు.
    అందుకని సాధన మౌనంగా ఉండిపోయింది.
    భారంగా ఐదు నిముషాలు గడిచిపోయాయి.
    ఈ ఐదు నిముషాలు ఎవరిని ఎవరూ చూడలేదు, ఎవరి పెదవుల మీదా చిరునవ్వు చిందులాడలేదు.
    మౌనంగా గాంభీర్యంగా ఎవరికివారే ఉండిపోయారు.
    ఆర్ష సాధనాని పరికించి చూశాడు.
    చెక్కుచెదరని చిరునవ్వు మొక్కబోని ఆత్మవిశ్వాసంతో వినయంగా నిలబడివుంది సాధన.
    "సాధనా!" అన్నాడు ఆర్ష చాలా గాంభీర్యంగా.
    "యస్ బాస్!" అంది సాధన.
    "నీ కప్పగించిన పని ఎంతవరకూ అయ్యింది?
    "ఒక్క అడుగు కూడా పడకుండా ప్రధమ పాదంలో నిలిచివుంది ఏ మాత్రం తొణక్కుండా సమాధానమిచ్చింది సాధన.
    "అదేమిటి?" ఆర్ష అడిగాడు.
    "మీరు నాకు ఈ పనిని అప్పగిస్తూ సరీగా రెండు నెలల టైమ్ ఇచ్చారు. నేను రంగంలోకి దిగి ఇంకా వారంరోజులు కూడా పూర్తికాలేదు తొందరపడితే ఎప్పుడూ పనులుకావు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను సాధన నిదానంగా చెప్పింది.
    సాధన తనముందు ఏమాత్రం భయపడకుండా చిరునవ్వు చిందిస్తూ అలా నిదానంగా చెబుతూంటే ఆర్షకి వళ్ళుమండింది.
    తన కోపాన్ని దాచుకోలేక పైకే వ్రెళ్ళగక్కాడు.
    "ఆడవాళ్ళ పనులు అధ్వాన్నంగా వుంటాయంటారు. ఏదో అద్ధానం పనిచేసి అదేదో అద్భుతం చేశాననుకుంటూ గొప్ప తెలివి పోతున్నావు కదా సాధనా!" సూటిగా సాధన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆర్ష.
    "నేను అలా అనుకోవటంలేదు బాస్! అద్ధానం పనులు చెయ్యలేదు సరికదా, ఇంకా ఏ అద్బుతాలు కూడా చెయ్యలేదు. ఏదయినా నన్ను క్షుణ్ణంగా పరిశీలించి చూసుకునిగాని రంగంలోకి అడుగుపెట్టను. దిగిన తరువాత సాధించి తీరుతాను" మొక్కవోని ఆత్మవిశ్వాసంతో స్థిరంగా పలికింది సాధన.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS