Previous Page Next Page 
అష్టపది పేజి 18


    
    పెళ్ళికూతుళ్ళ వేషాలు వేసిన వాళ్ళ ముఖానికి తగిలించిన పూల కిరీటాలు తొలగించబడ్డాయి. అలాగే అబ్బాయిలకి కూడా. వాళ్ళలో పెళ్ళి కొడుకు నయన్ బాబు వున్నాడు. పెళ్ళికూతురు శీతల్ మాత్రం లేదు.
    
    "బాత్ రూమ్ కెళతానంటే శీతల్ ని గోవా నుంచి వచ్చిన ఆంటీ బాత్ రూమ్ వేపు తీసుకెళ్ళింది" అందులో ఒకమ్మాయి చెప్పింది.
    
    బాత్ రూమ్ నుంచి రాబోయే శీతల్ కోసం ఎదురు చూస్తూ వుండిపోయారు అంతా. ఎందుకంటే ఆచారం ప్రకారం పెళ్ళి కూతురు శీతల్ మాత్రమే చీట్లు విప్పి వాటి మీద రాసి వున్న తమాషా వాక్యాలు పైకి చదివి వివరించాలి కాబట్టి.
    
    వింత వింత మాటలు చెప్పటానికి చీట్లు తయారుచేసే ముందు ఆడవాళ్ళంతా ఓ చోట కూడి అల్లరిగా అరుస్తూ అల్లరి మాటలు పేర్చి కూర్చి చాలా కష్టపడ్డారు.
    
    "నన్ను చూడంగానే బాదం హల్వా గుర్తొచ్చిందా, ఆమె మెడలో ఎందుకు తాళి కట్టారు. హల్వాప్లేటుకి కట్టాల్సింది"
    
    "రాత్రి కావటానికి ఇంకెన్ని గంటలు వుంది అని ఎన్నిసార్లు అడుగుతున్నారు. ఏంటి రాత్రికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు?"
    
    "ఛీ....ఛీ...ఎవరూ చూడలేదు కదా అని...అబ్బ మీకు సిగ్గేస్తుంది ఈ మాట పైకి ఎలా చెప్పను?"
    
    "ఆడపిల్లలా సిగ్గుపడతారేంటి? ఇప్పుడు ఏమన్నానని...!"

 

    ఇలాంటి అల్లరి మాటలు ముత్యాల వరాల్లా కాగితాల మీద రాశారు. కొందరు ఆడవాళ్ళు, అబ్బాయిలు కలిసి స్వయంగా, పెళ్లి కూతురు ఈ మాటలు పైకి చదివితే అందరూ పడి పడి నవ్వొచ్చు అని.

 

    పది నిముషాలు అయింది.

 

    శీతల్ రాలేదు. శీతల్ ని బాత్ రూమ్ కి తీసుకెళ్ళిన గోవా ఆంటీ కూడా రాలేదు.
    
    "సి.బి.ఐ వాళ్ళు కనిపించటం లేదేమిటి? ఇవతలికి రాలేదేమిటి? శీతల్ ని హంతకురాలిలా పట్టుకొని ప్రశ్నిస్తున్నారా! అదెక్కడ జరుగుతుంది అని ఆలోచించి సురేంద్రనాథ్ కూర్చున్న చోటునుంచి వాళ్ళని వెతకటానికి అవతలికి వెళ్ళాడు.
    
    మరో పదినిమిషాలు గడిచిపోయింది.
    
    శీతల్ కనపడలేదు. అంతేకాదు వచ్చిన అతిథులు ముగ్గురు కనపడలేదు. అంతే విడిదిలో గోల బయలుదేరింది.
    
    "వచ్చిన మీ చుట్టాలు మీతో యేమన్నా వెళ్ళారా?" గోవర్ధనరావు అడిగాడు.
    
    "పావుగంటక్రితం సరదా ఆట చూస్తూ వాళ్ళు మీతో ఉన్నారు కదా మీరూ చూశారు" సురేంద్రనాథ్ అన్నాడు.
    
    "నేను చూడటంకాదు వాళ్ళేమయ్యారని అడుగుతున్నాను" గోవర్ధనరావు చిరాకు దాచుకుంటూ అడిగారు.
    
    "వాళ్ళ సంగతి యిప్పుడు ముఖ్యం కాదుకదా, పెళ్ళి కూతురు ముఖ్యం" నాన్చుతూ అన్నాడు సురేంద్రనాథ్.
    
    వళ్ళుమండింది గోవర్ధనరావుకి. కొత్తగా వచ్చిన అతిథుల్లోని ఆమె శీతల్ ని బాత్ రూమ్ కి తీసుకెళ్ళిందని పెళ్ళి కూతుళ్ళ వేషాలు ధరించిన అమ్మాయిలలో ఓ అమ్మాయి చెపుతూనే వుంది. ఆ విషయం వదిలేసి పెళ్ళికి పెళ్ళి కూతురు ముఖ్యం అంటున్నాడు ఈ పెద్దమనిషి ఆ విషయం కాదన్నది ఎవరు? శీతల్ విషయం వీళ్లెవరికీ తెలియదు. ఒక తప్పుకి రెండు తప్పులన్నట్లు ఇక్కడ నుంచి పారిపోలేదు కదా! శీతల్ తెలివితక్కువగా అగాధంవేపు సాగుతుంటే క్షేమంగా వడ్డుకి చేర్చే ప్రయత్నంలో తను ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు! అవన్నీ ఈ క్షణాన....ఓహ్, ఇప్పుడు శీతల్ బతుకు...    

 

    గోవర్ధనరావు ఆలోచిస్తూనే వేగంగా అవతలికి వెళ్ళి పోయాడు. నౌకరులో బాగా నమ్మదగ్గ వాళ్ళని నలుగురిని పిలిచి కొని, పనులు పురమాయించి అవతలికి పంపించాడు. ఎక్కడెక్కడికో ఫోను చేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు.
    
    అటు చుట్టాలకి, ఇటు చుట్టాలకి ఏమీ అర్ధంకాకపోయినా రెండు మాత్రం అర్ధమయ్యాయి. పెళ్ళికూతురు శీతల్ మాయం అయింది. తెర వెనుక ఏదో చాలా పెద్ద కథ జరిగి వుంటుంది.
    
    బంధుమిత్రులంతా ఒకేచోట చేరారు. కొందరు పైకి ఏదో ఒకటి అడిగితే మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళందరికి ఇదేదో పెద్ద మిష్టరీలాగా వుంది.
    
    కూతురు కనపడకుండా పోయినందుకు ఇందిరా రాణి కంట నీరు పెట్టుకుంటూ కూర్చుంది.    

 

    సురేంద్రనాథ్ ఏదో దాస్తున్నాడని గోవర్ధనరావు పెద్ద అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. 

   

    "గోవానుంచి వచ్చిన నా స్నేహితుల గురించి మీ కెందుకు! మీ అమ్మాయి ఏమయిందో ముందు ఆ విషయం చూడండి. పెళ్ళికి ముందు తతంగమే గంటపైన పడుతుంది బింకంగా అన్నాడు సురేంద్రనాథ్.

   
    "మా శీతల్ ని మీ చుట్టం బాత్ రూమ్ కి తీసుకెళ్ళింది. బాత్ రూమ్ కి తీసుకెళ్ళిందో, బైటికే తీసుకెళ్ళింది కనుక్కుందాం ముందు ఆమెని పిలవండి" గట్టిగా చెప్పాడు గోవర్ధనరావు.
    
    వాళ్ళు నా స్నేహితులు కాదు, బంధువులు కాదు. సి.బి.ఐ. వాళ్ళు అని నిజం చెపుదామా అనుకుంటే వాళ్ళు కనపడక పోయె. నిజంగా సి.బి.ఐ. వాళ్ళు కాదేమో సరదా ఆచారం ఆట ఆడమంది వాళ్ళే. వాళ్ళు  చెప్పినట్టు తను ఆడటం జరిగింది. శీతల్ హంతకురాలయితే ఆ విషయం చెప్పొచ్చు కదా! పోనీ శీతల్ హంతకురాలు కాదు అయినా చెప్పి తగలడొచ్చు కదా! ఏదీ చేయకపోగా పెద్ద కూతురుతో సహా మాయం అయారు. తను అసలు విషయం చెప్పొచ్చు సి.బి.ఐ. వాళ్ళు కనపడలేదు కాబట్టి ఇప్పుడు జరిగింది చెపితే వాళ్ళేరి? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఇంతకీ వాళ్ళు...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS