Previous Page Next Page 
చదువు పేజి 11

    

    శ్రీమన్నారాయణ చెప్పిన అన్ని మాటలకన్నా, ఇంటికి మేస్టర్ని పిలిపిస్తే ఎక్కువ ఖర్చన్నమాటా, ఇంటికొచ్చే మేస్టరు ఎక్కువసేపు చదువు చెప్పడన్నమాటా ఆవిడకు బాగానచ్చాయి.

    తరువాత కొద్దిరోజులకే సుందరం సుబ్రహ్మణ్యం బళ్ళో చేరాడు.

    ఇది వీధిబడి, కోమట్ల అరుగుమీద పొద్దునా, సాయంత్రమూ నడిచేది. అందులో దాదాపు ఇరవైమంది పిల్లలుండే వాళ్ళు. వీళ్ళంతా నెలజీతాలు, పావలా, అర్దా ఇచ్చి చదువుకునే వాళ్ళు. నిజానికి సుందరానికి వీళ్ళతో సంబంధం లేదు. సుందరం చదువు వేరు. సుబ్రహ్మణ్యం శ్రీమన్నారాయణ దగ్గర ఇరవై రూపాయలు తీసుకుని ఈ ఏడాదల్లా సుందరానికి తెలుగూ, ఇంగ్లీషూ, లెక్కలూ చెప్పి వేసవి శలవల అవతల వాణ్ణి హోస్కూల్లో మూడో క్లాసులో ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్నాడు.
 
    సుందరానికి మొదటివాచమూ, ఎక్కాల పుస్తకమూ, సుమతీ శతకమూ కొనిపెట్టారు. వాడు వాచక పుస్తకంలోంచి రోజూ "చూచివ్రాత" రాయాలి. రోజుకొక ఎక్కం వప్పగించాలి, సుమతీ శతకంలో పద్యం ఒకటి కంఠతా పట్టాలి. ఇంతే వాడి చదువు. మిగిలిన పిల్లలు క్లాసుల వారీగా అక్షరాల గుణింతాలు అందరూ కలసి చదవటమూ, ఎక్కాలు చదవటమూ పంతులు చెప్పేమాటలు "డిక్టేషను" రాయటమూ చేసేవాళ్ళు ఆ తరువాత అల్లరి చెయ్యకుండా ఉండటంతప్ప వాళ్ళకేమీ పని వుండేదికాదు.

    సుబ్రహ్మణ్యం పంతులు పిల్లల్ని కొట్టేవాడేగాని కొట్టటం పనిగా పెట్టుకునేవాడుకాదు. ఆయన ఎప్పుడూ నవ్వేవాడుకాడు, అమితంగా మాట్లాడేవాడు కాడు. అందుచేత ఆయనంటే పిల్లలకు భయంగా ఉండేది. అంతేకాక ఆయన పిల్లలకు చదువు చెప్పేవాడు. ఎవరికి ఎంత చదువు అంటుతున్నదీ కనిపెట్టేవాడు.

    ఈ బళ్ళో పిల్లలు సుందరాన్ని కాస్త ఎక్కువగా చూసేవాళ్ళు. దానికి కారణమేమిటంటే వాడు వచ్చేఏడు హైస్కూల్లో చేరబోతున్నాడని అందరికి తెలిసింది. బళ్ళోచేరిన కొద్ది రోజుల్లోనే సుందరం ఇద్దరు ముగ్గురు స్నేహితులను సంపాదించాడు. అందులో ఒకడు వెంకటప్పయ్య ని గొల్లవాళ్ళ కుర్రాడు. పిల్లలందరిలోకీ వాడే పెద్ద. పంతులు లేనప్పుడు పిల్లలను కనిపెట్టి ఉండేవాడు. వాడు మూడేళ్ళనుంచీ ఈ బళ్ళోనే చదువుతూ, ఇప్పుడు మూడో క్లాసులో ఉన్నాడు. కాని ఇంగ్లీషు నేర్చుకోవటంలేదు.
 
    వెంకటప్పయ్య సాధారణంగా నోరు తెరిచి మాట్లాడేవాడు కాడు. పంతులు వాణ్ణి బజారుకు పంపించి ఎమన్నా తెప్పించేవాడు. అంగడి సామాను దగ్గర్నుంచి ప్రతిదీ చక్కగా బేరం చేసి, మంచి సరుకుగా తెచ్చేవాడు వెంకటప్పయ్య. వాడికన్న మంచివాడూ, తెలివిగలవాడూ, అనుభవంగలవాడూ ప్రపంచంలో లేడని సుందరం నమ్మాడు.

    లక్ష్మయ్య అని కుమ్మరివాళ్ళ కుర్రాడొక డుండేవాడు. వీడు బీదవాడని చూస్తేనే తెలిసిపొయ్యేది. నీరకావిరంగు ముతక చొక్కా వేసుకునేవాడు, దానికి గుండీలుండేవికావు, వాడికి లాగుండేదికాదు,  గోచీపెట్టుకునేవాడు. జుట్టుకు ఏ జన్మానా నూనె ఉండేదికాదు.లక్ష్మయ్య పగిలిపోయిన పలకముక్కతో బడికి వచ్చేవాడు, వాడు జేబులో పచ్చిమిరపకాయలు గుప్పెడు వేసుకొచ్చి ఒకనాడు, ఎవరైనా బలపంముక్క ఇస్తే పచ్చిమిరపకాయ తింటా' నన్నాడు. ఎవరో ఒక బలపంముక్క  ఇచ్చారు. లక్షయ్య అమాంతం పచ్చిమిరపకాయ కరకరా నమిలేసిమింగేశాడు. రోజలేదు. రొప్పలేదు. దాహం తాగలేదు.

    ఇంకొకరెవరో ఇంకో బలపంముక్క ఇస్తాం ఇంకో మిరపకాయ తినమన్నారు. లక్ష్యయ్య తినబోతుండగా సుందరం, "వద్దు వద్దు. తినకు. కావలిస్తే నా బలపం ఊరికే తీసుకో!" అన్నాడు. లక్ష్యయ్య ఒక్కసారిగా రెండు మిరపకాయలు తీసి రెంటినీ నమిలి రెండు బలపంముక్కలూ పుచ్చుకున్నాడు.

    సుబ్బులు అని మరో కుర్రవాడుండేవాడు. వీడు బ్రాహ్మడు. "పొట్టిగిత్తా" అని పంతులు వాణ్ణి పిలిచేవాడు. ఉన్న పిల్లలందరిలోకీ వాడే పొట్టి. వాడు నడిచినా మాట్లాడినా రైళ్ళు పరుగెత్తుతున్నట్టుండేది. అసలే పొట్టేమో, అందరి దృష్టి ఆకర్షించటానికి గట్టిగా అరచి మాట్లాడేవాడు. వాడి మొహాన కనుబొమ్మల మధ్య కాల్చిన మచ్చచూసి  సుందరం వాణ్ణి అదేమిటని అడిగాడు.

    "చిన్నప్పుడు కాల్చారు" అన్నాడు సుబ్బులునిర్లక్ష్యంగా.

    "ఎవరు కాల్చారు? ఎందుకు కాల్చారు? నువేం అల్లరి చేశావ్?" అన్నాడు సుందరం ఆదుర్దాగా.

    "ఓరి వెర్రిమొగమా, అల్లరి చెయ్యటమేమిటి? చిన్న బిడ్డగుణం వస్తే కాలుస్తారు.కాల్చకపోతే అప్పుడే హరాహరా అయిపొయ్యేవాణ్ణి, ఏమనుకున్నావో!"

    "చిన్నబిడ్డ గుణమంటే?"

    "అది కొంతమంది కొస్తుంది... ఇదిగో చూసుకో," అంటూ సుబ్బులు పొట్టమీద వాతలు చూపించాడు. "ఒకసారా? నాలుగుసార్లు. నాసామిరంగా, నలుగుసార్లూ  చచ్చేవాణ్ణే వాతలు వెయ్యకపోతే!"

    అందుకు సుబ్బులు ఏమని గర్వపడుతున్నాడో సుందరానికి అర్దంకాలేదు.

    "ఏంపెట్టి కాలుస్తారోయ్?" అన్నాడు సుందరం, సుబ్బులుదగ్గిర తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించి.

    "ఈ పొట్టమీది వాతలు సూది కాల్చివేశారు. మొహాన చుట్టకాల్చి వేశారు."

    సుందరం నిర్ఘాంత పోయినాడు. మనుష్యుల్ని ఇట్లా కాల్చటం ఏమిటో వాడికి అర్ధంకాలేదు. చచ్చిపోవటం ఎక్కువ బాధా, వాతలు వేయించుకోవటం ఎక్కువ బాధా? అని వాడు ఆలోచించసాగాడు.
   
                                                         *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS