"సీతమ్మతల్లీ, పిల్ల అన్నం అఘోరిస్తున్నది. దానికి ఏం కావాలో కాస్తకనుక్కోమ్మా" అని సుబ్బమ్మగారు అవతలి నుంచి కేకపెట్టింది.
"నేలగామాలు" అన్నది సీతమ్మ.
ఆ సమయానికే సుందరం కూడా అన్నంతింటున్నాడు. తల్లి లేవటం చూచి "ఎక్కడికమ్మా?" అన్నాడు.
"లక్ష్మి అన్నంతింటున్నది. దానికేం కావాలో కనుక్కొస్తా. సుబ్బమ్మగారు ముట్టయిందట" అన్నది సీతమ్మ.
ఆవిడ మళ్ళా తిరిగొచ్చేలోపుగా సుందరం ప్రశ్న సిద్దంచేసి అట్టేపెట్టాడు.
"అమ్మా, నువు ముట్టు కావటం లేదేం?"
సీతమ్మ నవ్వి, "వెధవకు అన్ని ఆరాలూ కావాలి.... నా పొట్టలో తమ్ముడున్నాడు. అందుకని ముట్టుకావటంలా" అన్నది.
ఈమాట విని సుందరం చాలా సంతోషించాడు.
"నిజంగానా అమ్మా? తమ్ముడెప్పుడు బయటికొస్తాడూ?"
"నువ్వు ఇస్కూల్లో చేరేలోపల వస్తాడులే."
ఆ రోజు చాలా ఉత్సాహంతో బడికి వెళ్ళాడు సుందరం. సుబ్బులు రాగానే వాడితో రహస్యంగా "ఒరే, నాకు తమ్ముడు పుడతాడు" అన్నాడు.
ఏం? మీ అమ్మ కడుపుతో ఉందా?"
ఆమాట సుందరం చెవులకు ఎబ్బెట్టుగా తోచింది.
"కడుపుతో వుండట మేమిటి? మా అమ్మ పొట్టలో తమ్ముడున్నాడు" అన్నాడు సుందరం.
"అదేరా వెర్రినాయనా, కడుపుతో ఉండటమంటే. ఈ ఆడవాళ్ళకేం పనిలేదు. ఎప్పుడూ కడుపుతో ఉంటారు"అన్నాడు సుబ్బులు. తన తండ్రి తరుచు అనేమాట వల్లెవేస్తూ, "మీ అమ్మ కడుపులో మగపిల్లవాడున్నాడని నువేమన్నా చూశావా? ఆడ పిల్ల వుండకూడదూ ?"
"మా అమ్మ చెబితేనే!"
"పుట్టేదాకా ఎవరికీ తెలీదులే."
మళ్ళీ ఎవరితోనూ చెప్పనని సుందరంచేత 'పరమప్రమాణపూర్తిగా'ఒట్టు వేయించుకుని సుబ్బులు ఆడవాళ్ళ కు కడుపు ఎట్లా అవుతుందో చెప్పాడు___ తనకు ఇతరత్రా తెలిసినమటుకు, చెప్పటం చాతనయినమటుకు.
సుబ్బులు చెప్పింది ఒక్క ముక్కకూడా నమ్మలేకపోయినాడు. ఎవరో "అసహ్యమైన" మనుషులు చేసేపని అందరూ చేస్తారా అని__ ముఖ్యంగా తన తల్లీ తండ్రీ చేస్తారా అని__ సుందరానికి అనుమానం కలిగింది. కాని సుబ్బులు మాటల్లో కొంత నమ్మకమూ కుదిరింది.
ఈ కొద్దిపాటి విజ్ఞానం సుందరం ఆత్మని ఎంతో సంక్షోభ పెట్టింది. అయితే సుబ్బులు మాటల సందర్భంలో ఇంకో విషయంచెప్పాడు. దాంతో సుందరం మనస్సు పిల్లలు పుట్టడం మీద నుంచిమరోవైపుకు పూర్తిగా మళ్లింది.
ఇంగ్లీషువాళ్ళూ, జర్మనీవాళ్ళూ యుద్దం చేస్తున్న సంగతి సుబ్బులు చూసినట్టుగా చెప్పాడు. రాములవారు ఎప్పుడో రావణాసురుడితో యుద్ధం చేసినట్టుమాత్రం సుందరానికి తెలుసు. ఇప్పుడుకూడా యుద్దాలు జరుగుతాయని సుందరానికి తట్టలేదు.
"జర్మనీవాళ్ళు భలే ముండాకొడుకుల్లే. ఇంగ్లీషువాళ్ళ దగ్గర ఒక బంగారంకొండ వుంది__" అన్నాడు సుబ్బులు.
"కొండంతా బంగారమే!" అన్నాడు సుందరం.
"ఆ. అందులోనించి రాళ్ళు తెచ్చి మనం మురుగులు చేసుకోవచ్చు... ఆ కొండ ఎట్లాగైనా సంపాదించుదామని జర్మనీవాడు! ఇద్దరూ యుద్ధంచేస్తున్నారు. ఎవళ్ళు గెలిస్తే బంగారంకొండ వాళ్ళకు వస్తుంది. ఇంగ్లీషువాళ్ళు ఓడిపోతే మనకు పీడ వదుల్తుందని మా నాన్న చెప్పాడు" అన్నాడు సుబ్బులు, వాళ్ళ నాన్న చెప్పినదానికి తభావంతుండటానికి వీలులేనట్టు.
"ఇంగ్లీషువాళ్ళు ఓడిపోతారా?" అన్నాడు సుందరం.
"ఓడిపోక ఏం చేస్తార్రా? జర్మనీవాడేంచేశాడో తెలుసా? ఒక కోడిని తయారుచేశాడు. అది ఎట్లా ఉంటుందీ? అచ్చగా నిజమైన కోడిలాగే ఉంటుంది. నిజమైన కోడిలాగే, కొక్కొరొకో, అంటుంది. ఆ కోడిని ఇంగ్లీషువాళ్ళదగ్గరికి పంపించాడు. అది నిజంగా కోడే అనుకుని ఇంగ్లీషువాళ్ళు దాన్ని పట్టుకునేటప్పటికి అదికాస్తా ఢాం మని బద్దలై ఇంగ్లీషువాళ్ళంతా చచ్చారు" అన్నాడు సుబ్బులు చేతులు తిప్పుతూ, అభినయిస్తూ.
"ఇంగ్లీషువాళ్ళు ఓడిపోయినారా?"
"అప్పుడేనా? ఓడిపోతే యుద్ధం అయిపొయ్యేదేగా?" అన్నాడు సుబ్బులు.
"ఇదంతా, చక్కగా, నీ కెవరు చెబుతార్రా?" అన్నాడు సుందరం అసూయగా.
"మా నాన్న అప్పుడప్పుడూ పత్రిక చూస్తాడుగా!" అన్నాడు సుబ్బులు నిర్లక్ష్యంగా. ఇంతలో ఇతర పిల్లలుకూడా వచ్చారు. ఇంకేవో విషయాలు మాట్లాడటం మొదలుపెట్టారు.
* * * *
సుబ్రహ్మణ్యం బడిలో హింసపడకపోయినా వీధిబడినరకం కళ్లారా చూడటానికి సుందరానికి మంచి అవకాశం లభించింది. ఎందుచేతనంటే సుబ్రమణ్యం బడికి కొంచెం ఎగువన, వీధి అవతలి పక్కగా, మరోఇంటి అరుగుమీద మార్కేండేయులు పంతులు బడి ఉండేది. అందులో ముప్ఫై, నలబై మంది పిల్లలుండేవాళ్ళు. ఆ వీధిలో ఉన్న అసలు వీధిబడి అదే. ఎవరన్నా "వీధిబడి ఎక్కడ?" అని అడిగితే, వీధిలో వాళ్ళు మార్కండేయులు పంతులుబడే చూపించేవాళ్ళు.
మార్కండేయులు అచ్చగా యమకింకరుడే. పిల్లల్ని హత్యచెయ్యటం మినహాగా మిగిలినదంతా చేసేవాడు. ప్రతి మనిషికీ అంతో ఇంతో కల్పనాశక్తి వుంటుంది. తనకు భగవంతుడిచ్చిన కల్పనాశక్తి యవత్తూ మార్కేండేయులు పిల్లల్ని హింసించటంలో కొత్త పద్దతులు సృష్టించటానికి వినియోగించేవాడు.
మార్కేండేయులుకు చాలాపేరు వుండేది. సుబ్రహ్మణ్యం పంతులుబళ్ళో చదువుకునే పిల్లల్లో కూడా కొంతమంది మార్కండేయులు చాలా గొప్పగా చదువు చెబుతాడని నమ్మేవాళ్ళు . అయితే మార్కేండేయులు చదువు చెప్పేవాడుకాడు . ఆయన బళ్ళో పిల్లలు పొద్దునా సాయంత్రమూ నెలలతరబడి "కా, కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కి, కీకు పొల్లిస్తే కీ, కాకు కొమ్మిస్తే కూ..." అనీ, "రెండేళ్ళుపద్నాలుగూ....." అని కేకలుపెడుతూ ఉండేవాళ్ళు.
