ఒక యంత్రాన్ని చూస్తే...ఆ యంత్రాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరేమిటి? ఆ పేరులోని మొదటి అక్షరం ఏమిటి?"
"....."
"ఇప్పుడు చెయ్యలేరా? అయితే షేమ్ అన్నమాట. టైమిస్తున్నాను. ఒక్క రోజులో చెప్పాలి ...చెప్పకపోతే టిఫిన్ చేయించాలి. సరేనా" అని ఫోన్ పెట్టేశాడు బాబీ.
భార్గవ ఆశ్చర్యం నించి తేరుకుంటూనే "ఆయన నీకెలా తెల్సురా" అన్నాడు.
"మొన్ననే పరిచయమయ్యారుగాని....అడ్వాన్స్ గా ఒక టిఫిన్ సంపాదించి వుంచాను. ఎలా వుంది మన అయిడియా" అన్నాడు బాబీ నవ్వుతూ.
4
సరిగ్గా పదకొండు గంటల తర్వాత_
భార్గవ సుగాత్రి ఇండస్ట్రీస్ లోని మూడో అంతస్థులోని మేనేజింగ్ డైరెక్టర్ రూంలోకి అడుగు పెట్టాడు. అతి విశాలమైన గదికి వాల్ పెయింట్స్ శోభనిస్తున్నాయి. గ్లాస్ విండోల్లోంచి క్రింది రోడ్డు మీది జనం, వాహనాలు కుక్కపిల్లల్లా కదులుతున్నాయి. శరత్ స్ప్రింగ్ చైర్ లో వాలి ఫైల్స్ తిరగేస్తున్నాడు. అతని ముందున్న రౌండ్ టేబిల్ మీద....పొడవాటి సబ్బుపెట్టెల్లాంటి నాలుగు రకాల ఫోన్ లు, కొన్ని ఫైల్స్, అందమైన టేబిల్ వెయిట్స్, చైనా పెన్నులున్నాయి.
స్ప్రింగ్ డోర్ దగ్గర చప్పుడు విని "హలో భార్గవా....కమాన్" అన్నాడు. ఊదారంగు సూటులో హుందాగా వున్నాడు శరత్.
"నమస్తే" అంటూ కరచాలనం చేసి ముందు సీట్లో కూచున్నాడు భార్గవ.
"విజయవాడ విశేషాలేమిటి?" చేతిలోని ఫైల్స్ టేబిల్ మీదుంచుతూ అడిగాడు శరత్.
"ప్రత్యేకంగా ఏమీ లేవుసార్."
"ఏం తీసుకుంటారు? లిమ్కా....గోల్డ్ స్పాట్...థమ్సప్"
"థమ్సప్"
కొద్దిసేపటి తర్వాత కూల్ డ్రింక్ వచ్చింది. భార్గవ సిప్ చేస్తూ...."ఇప్పుడైనా చెప్తారా?" అన్నాడు నవ్వుతూ.
"తప్పకుండా" అన్నాడు శరత్ టేబుల్ వెయిట ర్ ను త్రిప్పుతూ. కొన్ని క్షణాలు దొర్లిపోయింతర్వాత ....శరత్ చైర్ లోంచి లేచాడు.
"మిస్టర్ భార్గవా....!" గంబీరమైన అతని కంఠం విండోగ్లాస్ లకు తగిలి మరింత గంభీరంగా ప్రతిధ్వనించింది.
"కొందరి జీవితాల్లో అన్నీ వున్నా ఏమీ లేనట్లే నిస్సారంగా సాగిపోతాయి ఆస్థి, అంతస్థు, పరువూ, ప్రతిష్ట అన్నీవున్నా నిర్వీర్యంలా తయారైంది మా ఫామిలీ కూడా. నిన్ను మా పర్సనల్ సమస్యకు ఉపయోగించుకుంటుంన్నందుకు సారీ..."
భార్గవ మౌనంగా డ్రింక్ సిప్ చేస్తూనే ఉన్నాడు. శరత్ మోహంలో వేదన నిండి వుంది. ఓసారి ఆరాధనాపూర్వాకంగా భార్గవవైపు చూసి మళ్ళీ మొదలుపెట్టాడు.
"ఇద్దరి దంపతుల మధ్య జీవితం నిస్సారమయిందంటే...అవగాహన లోపించి కాదు. ఎవరి గుండెల్లో వారు అరణ్యరోదనతో అణగారిపోవటమే! సమస్యేదయినా సరే జీవితంలో నిర్లిప్తత తోడుకొంటే నిశ్చలత్వమే కాపురం చేస్తుంది. ఆ నైరాశ్యపు నిశీధిలో తోడు నీడగా వున్నప్పటికిని, మధ్యలో తెలీని అగాధమేదో రోజురోజుకీ పెరుగుతుంది. అలాంటి అగాధమే నాకూ, నా భార్యకూ మధ్య అట్టుడుకు లోతుల్తో అధికమౌతోంది. మా మధ్య అనురాగానికి కరువులేదు. ఆప్యాయతకూ కరువులేదు కాని..."ఆపాదమస్తకంలోంచి వస్తున్న ధ్వని తరంగాలకు ఊపిర్లు అందనట్లు అతను ఆగాడు.
భార్గవ శరత్ ను నిశితంగా చూస్తూ సిప్ చేస్తున్నాడు. అతను రూంలో పచార్లు చేస్తూనే చెప్పుకు పోతున్నాడు.
"ఆ అగాధాన్ని పూడ్చటానికే ఈ చివరి దశలో ప్రయత్నిద్దామని భార్గవా! నువ్వొక రచయితవి. నీకున్న సునిశిత దృష్టితో నా అంతరంగాన్ని అర్ధం చేసుకుంటావనే నిన్నిక్కడికి పిలిపించింది. అంతేకాదు భార్గవా! మా మధ్య నిలిచిన అగాధాన్ని పూడ్చటానికే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇది భార్యాభర్తల సమస్య అయినా, మా మధ్య నిలిచిన అగాధాన్ని పూడ్చటానికి నిన్ను ఎన్నుకోవటంలో నేనేమీ పొరబడటం లేదనుకుంటున్నాను. నేను ఫోన్ లో చెప్పాను గుర్తుందా? ఇంతవరకూ ఎవరినీ, ఎవరూ కోరని కోరికని! రచయితగా ఆ కోరికేదో నువ్వూహించుకోగలవేమో కాని, నీ అంచనాలకు కూడా అందని కోరికది! ఏ మగాడు మరే మగాన్ని ఈ కోర్కె కోరలేదు....కోరడు...కోరకూడదు..."
ఎన్నోఏళ్ళ బాధల సుడిగుండాలు గొంతులో సుళ్ళు తిరిగితే, ఆ రాపిడికి కంఠనరాలు అరిగి, అరిగి...జీరబోయినట్లు అతని మాటలు గాద్గదమై వస్తున్నాయి. ఆ వేదనను భార్గవ గుర్తించాడు. ఒకవైపు చల్లగా థమ్సప్ జారుతున్నా అతడి మెదడు వేడిగానే ఆలోచిస్తోంది.
"డబ్బున్న వారికి ఎలాంటి సమస్యలూ వుండవనుకుంటారు చాలామంది. కాని ఒక పదిపైసల బిళ్ళ చుట్టూ వున్న ఎనిమిది పంపులూ ఎనిమిది రకాల సమస్యల సృష్టి వలయాలే! అలాంటిది కోట్ల డబ్బున్న నాకూ ఎన్ని సమస్యల వలయాలుంటాయో వూహించు! అవి వృత్తిరీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు..."
"అయినా ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిదేమిటన్నా వుంటే, ఆడదాని అనురాగమే! ఆ అనురాగమే ఆవేదనల అగాధాల్లో పూడుకుపోతుంటే, నా భార్య నాకు పంచివ్వలేకపోతుంది. ఇదంతా నీకు వేరే చెప్పాలా? రచయితన్న వాడికి ఎంతోకొంత ఎదుటివాడి కష్టాన్ని, అవసరాన్ని అవగాహన చేసుకునే సామర్ధ్యం వుంటుంది. దానికి స్పందించినప్పుడే కదా! మీరు రచనలు చేసేది. ఇట్సాల్ రైట్! ఎన్నో రాత్రులు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చే మిమ్మల్ని సంప్రదిస్తున్నాను."
