శరత్ అసలు విషయంలోకి దిగుతూ__
భార్గవా! నీ మూడ్ ఇప్పుడు బాగానే వుందికదా! నాకు పిల్లలు లేరు భార్గవా! పిల్లలకోసం మేం తిరగని డాక్టర్లూ లేడు, మొక్కని దేవుడూ లేడు. వయసు పైబడుతున్న కొద్దీ నా భార్య సుగాత్రి మానసికంగా క్రుంగిపోతుంది పిల్లలులేని లోటు అది లేనివారికే బాగా తెలుసు. మా ఆస్థికి, అంతస్థుకూ కాకపోయినప్పటికి మా వంశం నిలవటానికైనా ఒక వారసుడు లేకపోతే...." ఆర్ద్రత, ఆవేదన మిళితమై వస్తున్నాయతని మాటలు.
"ఏమిటీయన? పిల్లలు కలగనంత మాత్రాన....తనను కోరవల్సిందేమిటి? బాబిగాడిని గాని దత్తత కోరుకుంటున్నాడా?....లేక...ఛ....ఏమిటీ ఆలోచనలు" భార్గవ తల విదిలించాడు.
ఆ గదిలో వాళ్ళిద్దరూ కాసేపు నిశ్శబ్దాన్ని పంచుకున్నాక__
సబ్బుబిళ్ళలాంటి ఫోను కుక్కపిల్లలా కుయ్....కుయ్...మని మోగింది.
శరత్ ఫోనెత్తాడు.
"హలో....భార్గవగారా? ఇక్కడే వున్నారు" అంటూ మీకే ఫోన్ అని అందించాడు.
అతను ముందు ఆశ్చర్యపోయి తర్వాత అందుకున్నాడు.
"తనిక్కడున్నట్టు ఎవరికీ తెలుసు? ఇక్కడికి ఫోన్ చేయాల్సినంతటి అర్జంట్ పనా?" అనుకుంటూ "హలో...రైటర్ భార్గవా__" అన్నాడు.
"ముగింపు రాసావా భార్గవా?" ఒక తీయని కంఠం వినిపించింది అవతలనుంచి. ఎక్కడో విన్న కంఠం, లేదు తనే పొరబడుతున్నాడు!
"రాస్తాను. ఎవరూ ఊహించనంతటి థ్రిల్లింగ్ గా, మంచి మలుపుతో ఎండ్ చేస్తాను"
"అయితే మౌనికను చంపుతావన్నమాట" అవతలి ఆడ కంఠంలో ఏదో ఉత్సుకత.
"అవును! ఇంతకీ మీరెవరు?" హెచ్చరిక ఉత్తరం గుర్తొచ్చి భార్గవ కంఠనరాలు వణికాయి.
అతని ప్రశ్నకు జవాబుగా తెరలు తెరలుగా నవ్వు. తియ్యటి కంఠములో అంతకన్నా తీపైన ఆ నవ్వులో ఏవో భయంకర ధ్వని ప్రకంపనాలు. ఫోన్ క్రెడిల్స్ బ్రద్దలవుతాయా అన్నంతగా, కర్ణభేరిని ప్రేల్చి మెదడు నరాల్ని పీక్కుతిన్నట్టు నవ్వు.
"షటప్" అరిచాడు భార్గవ. పడిపడి నవ్వుతున్న ఆ నవ్వు ఆగలేదు.
అప్పటివరకూ చర్మరంధ్రాలలో దాగిన చల్లదనం ఆవిరయి. స్వేదబిందువులను పరిచింది అతని నొసటిపైన. క్రెడిల్ ను పట్టుకున్న చేయి సన్నగా వణికింది.
ఆ నవ్వు అతనిలో ఏదోతెలీని భయాన్ని ఇంజక్టు చేస్తుంటే, తనను తాను నిలదొక్కుకుంటూ "డోంట్ లాఫ్__ఎవరు నువ్వు?" అన్నాడు మరింత గట్టిగా.
కొండరాల్లమీంచి, బండరాళ్ల మీంచి, దూకి దూకి అలసి సొలసి పోయి, జలపాతపు లోతుల్లోకి నెమ్మదిగా జారిపోతున్న సెలయేటిలా....అవతలి వ్యక్తి బలవంతంగా నవ్వుకుంటూ__
"ఎవరా? ఉత్తరం అందలేదా? నేను మౌనికని" అంది. ఆ కంఠములో కత్తులు కర్కశంగా దూకినట్టు, గళం నిండా నింపుకున్న గరళాన్ని ఫోన్ తీగెలద్వారా చెవిలో స్ప్రేచేసినట్టు. ఆ మాటతో క్షణంపాటు స్పందనలేనట్లు నిటారు అయ్యాడు. అవతలివైపు లైను కట్టవడంతో అతనిలో నీరసం ఆవరించింది. మెల్లిగా సోఫా చైర్లో జారగిలబడినట్లు కూచున్నాడు.
శరత్ కు ఆశ్చర్యంగా వుంది.
"ఏమిటి భార్గవా? ఒక్కసారి అలా అయిపోయారేమిటి?" శరత్ ముఖంలో ఆందోళన.
"ఏమీ లేదు. సీరియల్ విషయంలో కొన్ని హెచ్చరికలొస్తున్నాయి. ఇప్పుడొచ్చిన కాల్ అలాంటిదే"
"పోలీస్ కంప్లయింట్ ఇద్దామా?" అన్నాడు శరత్ ఆత్రుతగా.
"రైటర్ కివి మామూలే! కాని ఈ హెచ్చరిక చాలా విచిత్రంగా వుంది శరత్ గారూ. అందులో కంఠాన్నిబట్టి చూస్తూంటే__ఓ ఆడపిల్ల చేస్తున్న హెచ్చరిక" చెప్పాడు భార్గవ నుదురు రాసుకుంటూ.
"ఆడపిల్లయితే....జోక్ గ్గాని చేస్తున్నారంటారా?"
"ఎలా అనుకోవడానికీ వీల్లేదిప్పుడు! ఒక పాత్రను మలిచేవిషయంలో నాకు స్వేచ్ఛ లేదనే ఉద్దేశంతో, ఆ పాత్రే తానై బెదిరిస్తోంది."
విస్మయంగా చూశాడు శరత్. "మీ నవల్లోని పాత్రలు మిమ్మల్నే హతమార్చటానికి బెదిరించటం...ఇట్స్ ఇంపాజిబుల్" చెప్పాడు శరత్.
"నేనూ అదే అనుకుని తేలిగ్గా తీసుకున్నాను ఒక ఉత్తరం వస్తే కాని ఆ పిల్ల కంఠంలోని తీవ్రతనుబట్టి చూస్తే, ఏదో కసి కనిపిస్తోంది" చెప్పాడు భార్గవ సాలోచనగా.
"ఏది ఏమైనా భార్గవగారూ! డోంట్ టేకిట్ ఈజీ! మీరు పోలీస్ సాయం కోరడం మంచిది. ఆపివాళ్ళు చేసే హత్యలే చాలా కూల్ గా వుంటాయి" చెప్పాడు శరత్.
భార్గవ పరిస్థితిని చూసి, అతని మొహంలో తారాడిన భయాన్ని స్పష్టంగా చూసి తిరిగి శరత్ అన్నాడు- "సారీ భార్గవా...మిమ్మల్నిక్కడికి రప్పించి మీ మూడ్ పాడుచేసానేమో వెరీ సారీ" నొచ్చుకుంటూ అన్నాడు.
"నో-నో! పర్లేదు మీరు చెప్పాలనుకున్నదేదో..." అంటూ ఆర్దోక్తిలో ఆగిపోయాడు భార్గవ.
"మీ మూడ్ బాగా లేనప్పుడు నేనెంతమాత్రం చెప్పలేను. ఇప్పుడూ అంతే! మరెప్పుడైనా చెప్తాను. అంతవరకూ..." అతని మాటల్లోని అభ్యర్ధనకు భార్గవ మౌనం వహించాడు.
"సరే...మీ ఇష్టం."
"ఇలాంటి హెచ్చరికల్ని మీరు ముందే పసిగట్టి....టెలిఫోన్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేసి మీ ఫోన్ ను అబ్జర్వేషన్ లో వుంచటం మంచిది. మీరిప్పుడు ఇక్కడ వున్నట్లు తెలిసే చేసారంటే....మిమ్మల్నెవరో ఫాలో అవుతున్నారన్న మాట."
