Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 11


    "ఊ."
    "గతానికి వెళదాం. నీవు నా మీద వలవిసిరావు. నేను నీ వలలో పడలేదు. నీవు నన్ను రకరకాలుగా ఆకర్షించి నీ వలలో చిక్కుకునేలా నీ వడిలో వచ్చి వాలేలా చేసుకున్నావ్. ప్రేమించాను అన్నావ్. నన్ను తప్ప ఏ యువతి మొహం చూడలేదన్నావ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను చేసుకుంటానన్నావ్. అదన్నావ్, ఇదన్నావ్, పెళ్ళిచేసుకుని ప్రేమించుఅన్నాను నేను. నామీద నమ్మకం లేదా అని దేవుడిమీదకూడా ప్రమాణం చేశావ్. నిన్ను పూర్తిగా నమ్మి లొంగిపోయాను. నేను పెళ్ళి మాట ఎప్పుడు ఎత్తినా రోజులు దాటేస్తూ వచ్చావ్. ఓ రోజు...కడుపు వచ్చింది అని చెప్పాను.
    కామినీ మాటలకి అడ్డుతగిలి "ఆ కడుపు ఏమైంది?" ఆతృతగా అడిగాడు కిరణ్.
    "కడుపు ఎక్కడికి పోతుంది. కడుపులోనే వుంటుంది." విలాసంగా నవ్వుతూ చెప్పింది కామిని. తరువాత మళ్ళీ "అఫ్ కోర్స్ నువ్వు చేయించుకోమన్నావ్. కానీ నేను చేయించుకుంటానని చెప్పలేదు కదా నీవు ఆ మాట అనంగానే నేను ఏం చేశాను? నీకు గుర్తుండి వుండదు. మూడు నెలల క్రిందటి సంఘటన. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఇందాక నువ్వు ఏడ్చావ్ చూడు అలా భోరున ఏడ్చాను." అంది కామిని.
    కిరణ్ తప్పు చేసిన వాడిలాగా తల దించుకున్నాడు.
    "కిరణ్ గతం నాస్తి ఇప్పుడు నేనొకటి చెబుతాను. నీవలా చేస్తే గుట్టు చప్పుడు కాకుండా పనిపూర్తవుతుంది. ఇద్దరం ఆనందంగా వుండొచ్చు."
    "ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు కిరణ్.
    "నీకు సహకరించి, నీవు చేసిన హత్యని సోదిలోకి రాకుండా మటుమాయం చేస్తాను. అయితే నీవు నాకొక మాట ఇవ్వాలి. నీవు చెప్పినట్లు ఎబార్షన్ చేయించుకోలేను. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు. నీవు నన్ను గ్రాండ్ గా పదిమంది ఎదుట పెళ్ళి చేసుకోనక్కరలేదు. వెంటనే సింపుల్ గా నన్ను మారేజ్ చేసుకుని మీ యింటికి తీసుకువెళ్ళి మీ యింట్లో అందరికీ, లోకానికి నన్ను నీ భార్యగా పరిచయం చేయాలి. అలా అయితేనే..."
    "అది జరగని పని" వెంటనే అన్నాడు కిరణ్.
    "అయితే ఇదికూడా అంతే" అంది కామిని.
    "అంతే అంటే?"
    "అంతే అంటే ఏమీలేదు. నీ త్రోవ నీది, నా త్రోవ నాది. కాకపోతే, నీవు చేసిన హత్య నా చేతిలో ఆయుధంగా మారుతుంది. అయాచితంగా నా చేతికి చిక్కిన ఈ ఆయుధంతో నిన్ను ఎన్ని రకాలుగా బాధించవచ్చో, అనుక్షణం చిత్రవధచేస్తూ చూపిస్తాను."
    "బెదిరింపా?" కిరణ్ అన్నాడు.
    "ఛీ, ఛీ ఏ భార్యా భర్తను బెదిరించదు. నా మాట లోని గూడార్దాన్ని నీవు గ్రహించ గలిగితే, మన ఇరువురికి ఏ సమస్యా వుండదు. నేను లోకం దృష్టిలో పెళ్ళికాని తల్లిని కానక్కరలేదు. నీవు హంతకుడివి కానక్కరలేదు ఆలోచించి చూడు."
    "అంత అవసరంలేదు. ఒక్క విషయానికి సమాధానం చెప్పు. అనితను నేనే చంపానని ఏమిటి? నేను కాదు అని బుకాయించవచ్చు కదా! నీ మాటలు విని ఇప్పటికిప్పుడు ఎవరైనా నన్ను హంతకుడు అన్నా, మా డాడీ కున్న పరపతితో డబ్బుతో నేను నిక్షేపంగా బయట పడగలను." కిరణ్ ఆలోచించి మాటలు వదిలాడు.
    కామినీదేవి పడీ, పడీ నవ్వింది.
    "భేష్! మగాడికి ఆ మాత్రం ధైర్యం వుండాలి. నిన్ను నీవు రక్షించుకోవటం చాలా తేలిక, ఆ విషయం నాకు తెలుసు కాకపోతే రికార్డయిన నీ మాటలు, అనిత నీవు కలసి పెనుగులాడు తున్నపుడు తీసిన ఫోటోలు ఉన్నాయే! ఆ సాక్ష్యాల్ని నాశనం చేయకపోతే ఎప్పటి కయినా నీకు ప్రమాదమే కదా! చ్చొ చ్చొ చ్చో.....చాలా కష్టంవచ్చి పడింది, పాపం!"
    "ఫోటోలా! మాటలు రికార్డు కావటమేమిటి!" అయోమయంగా అడిగాడు కిరణ్.
    "నీవు నన్ను పెళ్ళి చేసుకోవు, నీవు చేసిన తప్పేది అయినా, నేను రికార్డు చేసి కెమెరాలో బంధించ కలిగితే అది చూసి నిన్ను బెదిరించి నిన్ను నా భర్తగా పొందాలనుకున్నాను. నువ్వు కాస్త లోతుగా ఆలోచిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో, నిన్నే తప్ప మరెవరిని పెళ్ళాడకూడదనుకుంటున్నాను. నా ఈ బలీయమైన కోరిక తీర్చుకోటానికి తగిన సమయం కోసం అనుక్షణం నిన్ను నీడలా వెంటాడాను. తగిన సమయం వచ్చింది. నీ భార్యనయ్యే అదృష్టానికి చాలా చేరువలో వున్నాను. మాజీ ప్రియురాలిని అనుకొని మొహం తిప్పేసు కుంటావో నీ యిష్టం ఒకటి మాత్రం నిజం. నీ భార్యనయిన మరుక్షణం పాత తప్పుల్ని ఎత్తను, పాత గాయాలను రేపను, నిన్ను నా కంటిరెప్పలాగా కాపాడుకుంటాను. ఇందులో లేకమాత్రం కూడా అబద్దంలేదు. ఆపై నీ యిష్టం కిరణ్." కామినీదేవి తన నిర్ణయం దృఢంగా చెప్పింది.
    కిరణ్ ఆలోచనలో పడ్డాడు.
    "కామిని నిజంగానే ఏదో చేసింది. కాకపోతే ఇంత నిర్భయంగా, ధైర్యంగా మాట్లాడదు. తనని నీడలా అనుసరిస్తున్నది కాబట్టే సరైన సమయంలో తన రూమ్ లోకి వచ్చి మెత్త మెత్తగా బెదిరించ కలిగింది. ఇప్పుడు చాలా త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలి. డబ్బు, పలుకుబడి కూడా ఒక్కొక్కసారి పనిచేయవు. దీనికన్నా ప్రస్తుతం కామినీ చెప్పినట్లు విని తరువాత ఈ పిశాచాన్ని తెలివిగా వదుల్చుకోవాలి. అలా అయితే తను హత్యానేరం నుంచి బయట పడవచ్చు. ఆఫ్టరాల్ బజారు ఆడది అయిన కామిని తనను బెదిరించడమా! సమయం చూసి తిరిగి పైకి లేవకుండా జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా, చేయాలి చేసి తీరుతాను. అలా చేయనినాడు నాపేరు కిరణ్ కాదు. కిరణ్ మనస్సులో గట్టిగా అనుకున్నాడు.
    "ప్రతి చిన్న విషయానికి గంటలు తరబడి ఆలోచిస్తున్నావేమిటి?" కామిని అడిగింది.
    "నేను ఆలోచించడం లేదు. గట్టి నిర్ణయానికి వచ్చాను.
    "గట్టి నిర్ణయానికి రావడమనేది ఎప్పుడూ మంచిదికాకపోతే నీ నిర్ణయమే నాకు వినిపించలేదు."
    "ఈ క్షణం నుంచి నీవు నా భార్యవి."    
    కామిని చటుక్కున పైకి లేచింది." ఓ....కిరణ్.....వివేకంతో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? ఇదిగో ఇంత మంచి నిర్ణయం" అంటూ అతని మీద వాలి గట్టిగా ముద్దు పెట్టుకుంది.
    అదే మరోసారి అయితే అంతకంతా బదులు తీర్చుకునే వాడే కిరణ్. కాని ఇప్పుడు అతనున్న పరిస్థితిలొ రాయిలా నిలబడటం జరిగింది.
    "తిరిగి బదులు చెప్పాలని అనిపించలేదా?" కామిని చిరుకోపంతో అడిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS