శంకరం సీతతో పరిచయం పెంచుకున్నాడు. ఏదో ఒకటి వంక పెట్టుకుని వచ్చి సీతని విసుగిస్తూ వుండేవాడు.
"చూడండి, శంకరంగారు ఏమనుకోకండి గాని, మీరిలా అస్తమాను రావడం అంత బాగుండదు! ఎవరైనా చూస్తే నానారకాలుగా అంటారు. పుస్తకాలు కావలిస్తే నేను కొనుక్కుంటానులెండి...." అంటూ నిక్కచ్చిగా ఓరోజు చెప్పింది సీత. శంకరం తెల్లబోయాడు.
"యిందులో బాగులేక పోవడానికి ఏముంది! ఎవరేమనుకుంటారు!" ఎదురుప్రశ్న వేశాడు.
సీత తలపట్టుకుంది. భగవంతుడా వీడికెలా చెప్పడం! పోనీ ఓ నాలుగైదు రూపాయలు ఖర్చయితే అయింది. ఆ పుస్తకాలేవో తనుకొంటే వదుల్తాడేమో అనుకుంది. అది చూసిన శంకరం 'ఓ, మీరూ యీ పుస్తకాలు కొన్నారా? అయితే నేను యివి కాకుండా వేరే కొంటాను, మీవి నేను, నావి మీరు చదవచ్చు' అన్నాడు.
సీతకి క్రమేపి మనోవ్యధ లాంటిది పట్టుకుంది. శంకరాన్నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బాధ పడేది!
ఉన్నట్లుండి యింకో వింత పరిణామం సీత మనశ్శాంతిని హరించింది, ఓ సెలవు రోజు మధ్యాహ్నం ఇంటావిడ యెంతో ఆప్యాయత ఒలకబోస్తూ లోపలికి వచ్చింది. మర్యాదగా కుర్చీ యిచ్చి పలకరించింది సీత.
"అయితే సీతమ్మా. నాకు తెలియక అడుగుతా! ఇంకెప్పుడు పెళ్ళి చేసుకుంటావు. ఆడపిల్లవు. ఇలా వంటరిగా వుండడం మంచిది కాదమ్మా! శంకరం కూడా నిన్న అదే మాటన్నాడు. వాడికి నువ్వంటే యెంత అభిమానం అనుకున్నావు! నీకు పుస్తకాలు అవి తెచ్చిస్తున్నాడు కదూ! అసలు సాధారణంగా ఏ ఆడపిల్లని చూసినా ఏదో వంకలు పెడ్తాడు. చదువుకుని ఉద్యోగాలు చేసే ఆడపిల్లంటే అసలే పడదు. అలాంటిది, నువ్వు చదువుకున్న అమాయకురాలివని, ఎలాంటి మిడిసిపాటు పడవని ఎంత పొగుడ్తాడో అస్తమానం! అసలు నువ్వీ యింట్లో అడుగుపెట్టిన దగ్గరనించి పూర్తిగా మారిపోయాడు."
ఈ ఉపోద్ఘాతం అంతా యెక్కడికి దారితీయబోతూందో గ్రహించిన సీత వళ్ళు భయంతో జలదరించింది.
"నీకేం తక్కువయింది? కాస్త ఓ చాయ తక్కువే అనుకో. కాని నీ మొహంలో మంచి కళవుంది సీతా! చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు నీకేం లోటు? శంకరానికి పెద్ద చదువు లేకపోయినా తెలివితేటలున్నవాడు. నా సంసారం యీ మాత్రంగా గడిచిపోతూందంటే అంతా వాడి చలవే. ఉద్యోగం అవసరంలేదు వాడికి. ఏభై ఏళ్ళు కూర్చుని దర్జాగా తిన్నా తరగని ఆస్థి ఇచ్చిపోయారు నాన్నగారు. చిన్నప్పుడు ఏదో కాస్త అల్లరిచిల్లరగా వుండేవాడు గాని, యిప్పుడు వాడిమాట, నడక చూస్తే యెంత పెద్దమనిషయ్యాడోనని నాకే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వూ చూస్తున్నావుగా?"
"ఆ! చూడకేం" మనసులోనే కసిగా అనుకుంది సీత.
"ఏదో వాడికి బుద్ధితెలియని వయస్సులో మా నాయనమ్మ మనవడి పెళ్ళిచూసి కళ్ళు మూయాలని, ఓ బొడ్డూడని పిల్లని తెచ్చి వాడికంటగట్టింది. పెళ్ళంటే అయింది కాని వాడేం సుఖపడి ఏడ్చాడు? ఒక్క ఏడాదన్నా సుఖంగా కాపురం చెయ్యలేదు. దానికేదో మాయదారి రోగంవచ్చి పోయింది. ఆరోజునించి ఎన్ని సంబంధాలు వచ్చినా నచ్చలేదని తిరగ్గొట్టేసాడు.
"శంకరం గారికి పెళ్ళి అయిందా?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
"ఆ పేరుకి ఎప్పుడో అయిందిలే, అప్పటినించి పోరుతున్నా ఇష్టపడని వాడు యిప్పుడు వాడంతట వాడే నిన్ను చూడగానే ఇష్టపడుతున్నాడు. చక్కగా యిద్దరికీ యీడు జోడు కుదిరింది. అదృష్టవంతురాలివి సీతా! కాస్త ఆలస్యమైనా మంచి సంబంధమే కుదిరిందిలే నీకు. యీ కబురు మీ వాళ్ళకి రాస్తే యెంత సంతోషిస్తారో! మీ నాన్నగారి అడ్రసు యీయమ్మా! యీ శుభవార్త పెద్దదాన్ని నేనే వాళ్ళకి చేరేస్తా. యింక నెల రోజులలో మంచి ముహూర్తం వుందిట. శుభస్య శీఘ్రం అని కానిచ్చేద్దాం. అంతేలే! యెప్పుడు ఎక్కడ యెవరికి రాసి పెట్టుందో యెవరు చెప్పగలరు? అసలు నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నీవు నా మరదలివైతే బాగుండునని! ఏదమ్మా మీ వాళ్ళ అడ్రసు ఓ కాగితం ముక్క మీద వ్రాసి ఇవ్వు!" అంతా నిశ్చయమైనట్లు, అసలు శంకరం ఆమెని పెళ్ళి చేసుకుంటాననడమే మహాభాగ్యమన్నట్లు మాట్లాడసాగింది.
సీత వళ్ళు వుడికిపోయింది. ఆమె అంటే వున్న సదభిప్రాయం దిగజారిపోయింది.
"నాకు పెళ్ళిచేసుకోవాలన్న ఉద్దేశం లేదండీ, అందుకే చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను!" అతి ప్రయత్నం మీద ఆమాటలు చెప్పగలిగింది సీత.
"అదేమిటమ్మా! పెళ్ళి పెటాకులు లేకుండా ఆడపిల్లవి యెన్నాళ్ళుంటావు!" యెగిరి గంతేసి పెళ్ళికి సిద్ధపడుతుందనుకున్న సీత జవాబు ఇంటామెకి ఆశ్చర్యం కలిగించింది.
"మరేం ఫరవాలేదు. యిప్పుడు ఆడవాళ్ళు పెళ్ళి చేసుకుంటేనేగాని బ్రతక లేరన్న వాదంలో పసలేదు. రోజులు మారిపోయాయి" సాధ్యమైనంత సౌమ్యంగా నవ్వుతూ అంది సీత. మాటల కోసం తడుముకుంటూ నిస్సహాయంగా సీత వైపు చూసింది యింటామె.
"సీతా, పెద్దదాన్ని నీ మంచికే చెపుతున్నాను విను. యెవరో యేదో అంటారు! అయినింటి పిల్లవి, మంచి మర్యాదగల కుటుంబములోంచి వచ్చావు, అలా పెళ్లి వద్దనకూడదు. చక్కగా నేను చెప్పినట్లు శంకరాన్ని
"క్షమించండి పిన్నిగారూ! పెద్దవారు మీ మాట కాదన్నందుకు యేం అనుకోకండి. నేను పెళ్ళిచేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. నా నిశ్చయం మారదు!" స్థిరంగా అంది.
"బాగానేవుంది సంబరం! పిలిచి పిల్లనిస్తామంటే కులం తక్కువన్నాట్ట! అలావుంది నీ వరస. ఏదో వాడు నీవంటే అభిమానపడ్తున్నాడని అడిగాను కాని, వాడికేం నీ పాటి అందగత్తెలు దొరకరనా! కో అంటే కోటిమంది వచ్చి వాడి కాళ్ళమీద పడతారు!" మూతి మూడు వంకర్లు త్రిప్పుకుని సణుక్కుంటూ వెళ్ళిపోతున్న ఆవిడని చూస్తుంటే సీతకి ద్రాక్ష పళ్ళ సామెత గుర్తు కొచ్చింది. ఎలాగో వదిలింది గొడవ!.... ఆవిడకి కోపంవస్తే వచ్చింది! తన్నేం చేయగలదు! మహా అయితే ఇంట్లోంచి పొమ్మంటుంది. అంతేగా!.... హు.... పెళ్ళి లేకపోయినా ఫరవాలేదుగాని చేసుకుని.... చేసుకుని శంకరాన్నా చేసుకోడం!....
ఆ రోజునించి సీతకి కష్టకాలం ప్రారంభమయింది. అంతవరకు సీత అభిమానం కోసం ప్రాకులాడిన శంకరం సీత తిరస్కరించిన దగ్గిరనించి కక్షసాధించడం మొదలుపెట్టాడు. యిదివరకు సీత నీళ్ళు పట్టుకోడానికి రాగానే లేచి నీళ్ళు పట్టుకోమనే శంకరం యిప్పుడు అటు చూడనట్లు వెకిలి పాటలు పాడుతూ గంటలకొద్ది కొళాయి వదలడు. ఈలలు వెయ్యడం, కన్నుగీటడం, సందర్భాను సారంగా సినిమా డైలాగులు వల్లించడం మొదలుపెట్టాడు_ ఇంట్లో స్నానం చెయ్యడం, వంటకి నీళ్ళు పట్టుకోడం అంటే అసాధ్యమైన పని అయిపోయింది. సీతకి ఓ పది పదిహేను రోజులు పోయాక, సహనం నశించి, ఓరోజు ఇంటామెతో చెప్పక తప్పలేదు.
"బావుందమ్మా! యింక నీవు యింట్లో వున్నావని వాడు స్నానం చెయ్యడా! నీకోసం వాడు గదిలో తలుపులు బిగించి కూర్చోవాలా! ఆడపిల్లలే బరితెగించి రోడ్లమీద పడుతుంటే మగవాడికేం ఖర్మ యింట్లో మూల కూర్చోడానికి! అంటూ నిరసనగా మాట్లాడింది. అంతవరకు సీత పట్ల యెంతో అభిమానం కనపరచిన ఆమె యీ మధ్య సీత పట్ల ముభావంగా వుండసాగింది. సీతని చూడగానే మొహం చిట్లించుకొని యెలక మీద పిల్లి మీద పెట్టి దెప్పడం సాగించింది.
