"హలో రామ్మూర్తీ పెన్నుందా?"
"లేదు" అన్నాడు రామ్మూర్తి.
"పెన్ను లేకుండా వర్కెట్లా చేస్తున్నావ్?"
"వూఁ, ఆఁ, పెన్నా__"
"పెన్నా కాదు తుంగభద్రా కాదు. పెన్. ఫౌంటెన్ పెన్ ఆర్ బాల పెన్."
"యిదుగో తీసుకో__"
ఆ వొచ్చినతను పెన్ను తీసుకువెళ్ళాడు__వొక గంట తరవాత యిస్తానంటూ.
రామ్మూర్తి ప్యాంటు బిగించుకున్నాడు. శ్రీపతి గదికి వెళ్ళాడు.
రెండు దినపత్రికలు, వొక పక్షపత్రిక. తెరిచివుంచిన రెండు పుస్తకాలు.
పక్షపత్రికలో మైపాడ్ కేసులో కాంట్రాక్టరుకీ సబిన్స్ పెక్టర్ కీ శిక్ష పడిందంటూ, ఆ యిద్దరు అక్కా చెల్లెళ్ళ వివరాలు.
వున్నవాళ్ళ చుక్కని కూతుళ్ళు విలాసంగా సముద్రతీరానికి విహాయాత్రకి వెడితే__యెందుకు వాళ్ళు పాల్పడినట్లు_యేదైనా కక్షవలనా వొళ్ళు కొవ్వినందునా__ఆ వివరాలేం లేవు సరిగా అనుకున్నాడు శ్రీపతి చదివి.
"యేవిఁటి సంగతులు క్రిష్ట్న దేవదాసు సినిమాకొస్తావా?" అన్నాడు రామ్మూర్తి.
"దేశమేవో సినిమాలా వుంది. ప్రణయాలు కలహాలు అపోహలు అపార్థాలు, వ్యభిచారాలు, చెరచటాలు, దొంగతనాలు దోపిడీలు లాంటి మామూలు విషాలు కాక దేశం__దేశమాత అని వుపమించేట్లయితే. దాని కొంగుకి నిప్పంటుకుందనే చెప్పాలి. యింకా_కిందికి దక్షిణాదికి పాకలేదు గానీ అటు వుత్తరాన తెప్పతిరనాళ్ళగా వుంది ఇందిరమ్మ పని. జే.పీ. వూపి పారేస్తున్నాడు బీహార్ బీహారంతా కదిలింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్_బెంగాల్ ఇందిరమ్మది కాదనుకో_బెంగాల్ బెంగాలీ వాళ్ళదే__తమిళనాడు తమిళనాడు వాళ్ళది లాగా_ప్రజా జీవితం స్థంభించి పోతోంది.
ప్రభుత్వ యంత్రాంగం సాఫీగా పని కొనసాగించటం సాధ్యం కాకపోవచ్చు__"
రామ్మూర్తి జారుకున్నాడు అతని మూడ్ కి రుచించక.
__నాలుగైదు నెలలుగా వేడి తగ్గకుండా కొనసాగుతూ మరింత ఉధృతం అవుతొందంటే తక్కువగా అంచనా వెయ్యరాదు__
ప్రత్యేకం అనుకోకుండా బయల్దేరి బస్టాపుకి వొచ్చాడు శ్రీపతి. బస్సెక్కాడు.
....రైళ్ళు సరిగా నడవటం లేదు. ఫ్యాక్టరీలు సరిగా పని చెయ్యటం లేదు....
బస్సు దిగి నడుస్తూ_
చోర్ చోర్ _ లీనా చ దావార్కర్ సినిమా చూశాడు. నడుస్తున్నాడు రోడ్డెంట_
_ పాలకులూ స్వార్థానికే పాలిస్తున్నారు. ప్రతిఘటిస్తున్నవాళ్ళూ స్వార్థానికే ప్రతిఘటిస్తున్నారు. లేకపోతే దేశం యింతకాలంగా పాతికేళ్ళొచ్చీ బుద్ధిలేకుండా....
బదాయి_లీనీ చందావార్కర్ సినిమా చూశాడు. వొంటిగంట.
నడుస్తున్నాడు సిటీ నుంచి యూనివర్సిటీ వైపుకి. నడుస్తూ....
....అరగంట అంది గడిచిన సంవత్సరం గడిచి_క్లబ్బుల్లో వెర్రికేక లేస్తూ.... రాజకీయ కుష్టువ్యాధి కంటే.... సుఖ రోగం _రోగ భోగ భోగ రోగ రాజకీయ సుఖసంభోగ_రోగ దారిద్ర్య భోగ పాతికేళ్ళ వ్యర్థ భారతి....
73
పెళ్ళయ్యాక మొదటి పండుగ, సంక్రాంతి. రవిని గంగోలీ పండుగ మూడు రోజులూ వొచ్చి యింట్లోనే వుండాలన్నారు, కొమరయ్య, పోశవ్వ, రాములు.
వుదయం వెళ్ళి రాత్రి వరకూ అక్కడే వుండి రాత్రికి వొచ్చేస్తున్నారు, రవీ గంగీ_ అక్కడ యిల్లు యిరుకు అని.
పాకలోకి వొచ్చి, రవిని నాలికతో వెక్కిరించింది గంగి.
"రానోవే యెక్కువ యెర్రగ పండింది" అంది, తాంబూలం నములుతూ.
"అవును మరి నువ్వు యెరుపు కదా!" అన్నాడు.
"యిప్పటికైన నీకు చూపు వొచ్చినట్లున్నదే!" అని నవ్వింది.
"యేమన్నావ్!" అని జబ్బ పట్టుకుని నొక్కబోయాడు రవి. రెండో చెయ్యి అతని వీపు చుట్టూ తిప్పి మంచం మీదకి లాగింది బలంగా. వొరిగి పడ్డాడు పరువు మీదకి. అతని మీదకి పడినట్లు తనూ వొరిగింది.
అతని పెదాలు ముద్దెట్టుకుంటోంది.
ఆమెలో కోర్కె పురివిప్పితే; నెమలి నాట్యంలా కాక, శివతాండవంలా వుంటుంది.
కోణార్క దేవాలయంలోని శిల్పం అమాంతం వూపిరి పోసుకుని హిమగిరి మీది కెగిరి శివతాండవం ప్రారంభించినట్లుగా వుంటుంది.
రవికి....కన్యాకుమారి దగ్గిరి సముద్ర తరంగం ఆ యెత్తుకి యెగసి సమస్తాన్నీ ముంచెత్తినట్లుగా అనిపిస్తుంది.
"రోజూనా?" అన్నాడు.
"యాడ? నిన్న మొన్ననేగా! నువ్వు యింట్ల వుంటేనా అసలు! మంది పనులకే టైం చాలదు నీకు....జరంత మిగిల్తె పుస్తకాలు. నేను నీకు గుర్తే రాను. నువ్వు గూడ నీకు గుర్తురావు." అని ప్రేమగా ఆప్యాయంగా అతని నుదుటిమీద పెదాలు అద్దింది సుతారంగా.
గంగి వంక తృప్తిగా చూసి కనురెప్పలు వాల్చాడు. భుక్తాయాసం, నిద్రగా వుంది రవికి.
అతని వీపు చుట్టూ చెయ్యేసి దగ్గిరికి లాక్కుంటోంది.
"యివ్వాళ కూడానా?" అన్నాడు.
"నీకు అస్సలు ఆసక్తే లేదేమి?" అని మరింత దగ్గిరికి లాక్కుంది.
"అలిసిపోయాను."
"అవ్ పగలంత ఫ్యాక్టరీల పనిచేసొస్తివి కాదు!"
రోజంతా తీరిగ్గా రాములు వాళ్ళింట్లో కబుర్లు చెప్పుకుంటూ గడిపారు కులాసాగా.
"యింత రంథేం నీకు?"
"పెండ్లి దేనికి?" అంది.
"కేవలం యిందుకేనా?"
"కేవలం యిందుకు కాదుగాని, యిందుకు కాకుంటే లోకంల యెన్ని పెండ్లిండ్లవుతవో ఆలోచన చెయ్యి."
"వూఁ...." అని విసుక్కుని ఆమె మీదకి జరిగాడు.
ఆ మరుసటి రోజు, పండగ మూడో రోజు.
రాత్రి యింటికొచ్చాక పక్కమీద రవిని ముద్దెట్టుకుంటోంది. ముద్దుతో ఆగదని రవికి తెలుసు.
"నువ్వు కామ పిశాచానివి." అన్నాడు.
"దినంకి వొకపాలి....లేకుంటె రెండు దినాల కొకపాలి అంతెగదా! వయసులో వున్నోళ్ళు.... అందరైతే దినాన్కి...."
"ఛీ వాగకు" అన్నాడు అసహ్యించుకుంటున్నట్లుగా.
"యేం, అట్ల అసహ్యించుకుంటవ్? యిదేం తప్పుపనా!" అంది.
"చిత్తకార్తి కుక్కల్లా...."
"ధూత్" అని ఈసడించుకుంది.
చెయ్యెత్తాడు కొట్టటానికి. అంతలోనే యేదో మహోధృతమైన మహాబలమైన అలా ఉవ్వెత్తున లేచి తనని ముంచెత్తినట్లుగా తగ్గిపోయాడు.
యిలా కొనసాగుతోంది వాళ్ళ వైవాహిక జీవితం. ఒక్కోసారి ఆమె మనసు రవి మీదనుంచి లోకం మీదకి ప్రసరిస్తుంది. లోకం అంటే_ లోకం....లోకంలో మనుషులు_డబ్బు_కార్లు_సౌధాలు_సౌఖ్యాలు.
