Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 8


    శాంత చీర మార్చుకోబోతూ, "కాస్త గదిలోకి వెళ్ళండి. చీర కట్టుకోవాలి" అంటే, "నేనుంటే చీర కట్టుకోటానికేం. పావడా వుందిగా!" అంటాడు.
    అలా అని అతను వుండగానే చీర మార్చుకుంటూంటే, "మరీ అంత సాని వేషాలేఁవిఁటి_ యెదురుగా విప్పి కట్టుకోకపోతే_ చెప్తే ఆ గదిలోకి వెళ్తాగా" అంటాడు లోలోన యెక్కడో తెలియకుండా వేదవతి మెదిలి.
    రాత్రుళ్ళు_నిద్రపోకుండా మధనపడుతుంటాడు.
    ఇలా జరుగుతూండగా_
    వాళ్ళ ఏజెంటు లీవులో వెళితే నెలరోజులు లీవు వేకెన్సీలో చెయ్యటానికి ఒక కుర్ర ఆఫీసరొచ్చాడు.
    అతనిది నెల్లూరు. నరహరి వాళ్ళు తెలుసు. మాటల సందర్భంలో సుబ్రహ్మణ్యం అత్తవారి వూరు నెల్లూరని తెలిసి వివరాలు అడిగితే, "లాయర్ వేదాంతం నరహరిగారు మా మామగారు." అని అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "అట్లాగా! ఆయన చాలా యోగ్యుడు. ఆయన భార్య పిల్లలు అంతా ఎంతో మంచివాళ్ళు. చక్కగా వొద్దికగా వుంటారు. ఆ తల్లిదండ్రుల పెంపకమే వేరు. పిల్లలంతా యెంతో పద్ధతిగా సాంప్రదాయకంగా వుంటారు. కాకపోతే రెండో కూతురే వాళ్ళ పరువు తీసింది" అన్నాడు.
    శాంత రెండో కూతురనీ, పెద్దకూతురు గూడూరులో ఓ హైస్కూలు హెడ్మాస్టరు భార్య అనీ తెలిసిన సుబ్రహ్మణ్యం అయోమయంగా, బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు.
    "కావాలని మంగళగిరి ప్రాంతం అతను వొకడు చేసుకున్నాడు. ఆ పిల్ల పేరు తార అనుకుంటాను. మొదటి నుండీ ఆ తీరే వేరు. చుక్కల్లో చూస్తున్నట్లుగా వుండేది. ఐతే చూడగానే గొప్ప ఫిలింస్టార్ లాగా అనిపించేదనుకో" అన్నాడు.
    విషయం గ్రహించి, "ఆఁ ఆఁ అవును. అదేదో ఆ పిల్ల తప్ప పుట్టింది" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    ఆ తరవాత రెండు వారాలకి ఆ ఆఫీసరు వెళ్ళిపోయాడు.
    "యేమీ లేకపోతే యెందుకు దాచిపెడతారు? యేదో వుంది_ బయటికి పతివ్రతలేగా!" అనుకున్నాడు.
    ఆ తరవాత వొకసారి అడిగాడు. "నువ్వు మీవాళ్ళకి రెండో కూతురివి కదూ_ మీ అక్కయ్య_" అని.
    "అవును. మా అక్కయ్యని గూడూరు యిచ్చారు. ఆయన హైస్కూలు హెడ్మాస్టరుగా చేస్తున్నారు" అంది.
    'పెళ్ళయ్యి కాపరానికెళ్ళి భర్త పరువు పోయేలాగాప్రవర్తిస్తున్న యింకో అక్క వుండీ_యెలా అంటుందో చూడు! అవునట! నంగనాచిలాగా. నెల్లూరి నెరజాణలన్నారు అందుకే' అనుకున్నాడు.
    మనసులో యేదో అనుకుని వూరుకోడు. ములుకుల్లా గుచ్చుకునే సూటిపోటి మాటలుగా బయటపడుతుంది, ఆ లోపలి యాతన.
    చాలాసార్లు వొంటరిగా కూర్చుని ఏడుస్తుంది శాంత.
    వొకసారి రాత్రిపూట, శాంత చప్పుడవకుండా ఏడవటం గమనించి "యెందుకా ఏడుపు? అక్కడికి నేను నిన్నేదో హింసించుకు తింటున్నట్లు అన్నాడు.
    వొకరాత్రి తనకి మెలుకువ వొచ్చి చూస్తే అతను మంచంమీద లేడు. చప్పుడవకుండా వంటగదిలో చూసింది. లేడు. వెనక తలుపు వేసి వుంది. ముందుగది గుమ్మం తెరపక్కనుంచి గమనించింది. ముందు గదిలో కుర్చీలో కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని వున్నాడు.
    అలా గమనిస్తూ వుండిపోయింది.
    ఐదు నిమిషాలు.
    తల పైకెత్తాడు.
    కిటికీలోంచి లోనకి పడుతున్న వీధి దీపపు కాంతిలో__అతని కళ్ళలో తడి!
    చప్పుడవకుండా వొచ్చి పడుకుంది. అతను బాగా చిక్కిపోయాడు యీ మధ్య_తన లాగానే.
    మరో అరగంటకి అతను వొచ్చి మంచంమీద పడుకున్నాడు. ఆమె భుజం మీద చెయ్యేసి అంతలోనే తీసేసి, మంచం అంచుమీదకి జరిగి అటు తిరిగి పడుకున్నాడు. యేమీ గమనించనట్లు వుండిపోయింది.
    అతను ఆమెని తాకి చాలా కాలమైంది.
    యెప్పుడో అర్ధరాత్రి మెలకువ వచ్చి, ఆ మగతలో శాంతని దగ్గిరికి లాక్కుని ఆరాటంగా నానా యిదీ చేసి, అలిసిపోయి నిద్రలోకి జారిపోతాడు. ఉదయం అదేదీ జరగనట్లుగా వుండిపోతాడు.
    మొత్తానికి యెందుకో బాధపడుతున్నాడని గ్రహించింది. తనని సూటిపోటి మాటలతో హింసిస్తూ వుంటాడు. శీలానికి సంబంధించిన మాటలు కూడా. మళ్ళీ చాలా యిష్టంగానూ వుంటాడు.
    వొకసారి అంది,_"మీరెట్లాగో వుంటున్నారు అదోలాగా!" అని.
    "యెలా వున్నాను! బాగానే వున్నానే నా నుదుటి రాతలాగా! అన్నాడు.
    ఆమె దిగులుగా కనిపిస్తే, "యేంఁ పాపం మనసు బాగుండలేదా? అవును యీ యింట్లో నీ మనసెలా బావుంటుందిలే!" అన్నాడు.
    దిగులంతా దిగమింగుకుని వుత్సాహంగా వుంటే_ "యేం చూసుకుని అంత సంతోషం_నలుగురు మొగుళ్ళుండి వాళ్ళందరితోటి అనుభవాన్ని తలుచుకుని పరవశించిపోయినట్లుగా!" అంటాడు_"వూరినుంచి వాడి వుత్తరం వొచ్చి వుండాలి యీ రోజు_లేక, వీడెవడో మధ్యాహ్నం లోపలికి వస్తే మజాగా...." అనుకుని.
    యీ డిశంబరు ఆఖరి వారంలో వుత్తరం వొచ్చింది, సుబ్రహ్మణ్యానికి మామ దగ్గిర్నుంచి- "సంక్రాంతి పండక్కి రావాలి. తప్పక. వీలయితే అమ్మాయిని ఫస్టుకే పంపించు__" అని.
    "అవును ముందుగా వెళ్తే దీనికి తన శృంగార లీలలు విశృంఖలంగా తీర్చుకోడానికి వీలుగా వుంటుంది_" అనుకున్నాడు సుబ్రహ్మణ్యం.
    రోజులు యిలా గడుస్తున్నాయి.

                                 72

    రామ్మూర్తి రెండు గంటల నుంచి దీర్ఘంగా తన ఫైనల్ డ్రాఫ్ట్ పేజీలు  చూసుకుంటూ_అలసటగా అనిపించి కాగితాలు భద్రంగా బల్లమీద పెడుతూ_
    "_యిది ముగిస్తే బౌండు చేయించి ఆఫీసులో యిచ్చి ఆ తరవాత గైడ్ కి హారతి పట్టి - హారతి -హా -రతి -ఆ -రతి ఆరతి యే రతి యీ రతి హారతి ఘాటుగా సువాసన -హాస్పటలు వాసనలాగా హాస్టళ్ళ స్వరతి వాసన -వాసన  స్తన....స్తన పూర్న_ అన్నపూర్ణ.... అన్న స్తవ పూర్న స్తన తార .... పూర్న తార పూర్న స్తనపూర్న....అన్నపూర్ణ....అన్నమక్కరలేదు ఆ పాలకడవ లివ్వు.... స్తన పూర్న తార పూర్న  స్తనతార పూర్నతార....తార కనిపించి యెంతకాలమైందో....యిప్పుడెక్కడున్నారో....ఆ యింట్లో లేరు....యిల్లు కట్టుకున్నారేమో యెక్కడైనా_ ఎమ్.ఏ. పూర్తిచెయ్యదూ_దేనికి చెప్పేం చేస్తుంది....చేస్తే చేస్తూంటే _కనిపిస్తూంటే....కనిపించకుండా కనిపించనంత దూరంగా....చదువైపోయిందిగా నేనే యీ మహానగరం బయట దూరంగా పెడగా....వొంటిగది కుటీరం పూదోట వంటరి వివాస్పహవాసం. కష్టమైనా నిజానికి రావాలనీ....కోరుకుంటూ గుండెల ఆ గుండెల గుబ్బలలో లోతుల పూల పంపుల ఆర్తిగా ఆరాధనగా సదా నిలుపుకోవాలనీ_నిత్యం మళ్ళీ మళ్ళీ యింకాయింకా అలా గిలాగిలా గలాగిలాగ లాగు లాగి....జారిపోతోంది వెధవది. నడుం వొదులైంది_ ప్యాంటు, కుంగడానికి బదులు సాగిందా కాట్సూల్ లాగా....లేక నడుం సన్నబడిందా...నడుం సన్నని నాగాలోకపు నాగినీ వూగనీ తాగనీ తారనీ లాగనీ సాగనీ...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS