రెండు రోజుల కొకసారైనా రవితో తృప్తిగా గడిచినప్పుడు_ రవే సమస్త లోకంలాగా ఆ పాకే మహా సౌధంలాగా, ఆ గట్టి పరుపు సత్తుపాత్రలు సౌఖ్యాలుగా అనిపించి సంతోషంతో పొంగిపోతుంది గంగి.
రవిని తలుచుకుంటూ, ప్రకృతిలా త్రిగుణాత్మకంగా ప్రేమగా ఆప్యాయంగా దాహంగా అలలు అలలుగా యెగిసి పడుతూ అతనిలో అతనితో దహించుకుపోవాలని గంగి, గంగలా పొంగులెత్తి ప్రవహించాలని పరితపించిపోతూంటుంది__గంగి.
74
తార, యెర్ర పడవ కారు నడుపుతోంది. ఆమె ప్రక్కన సూర్యప్రకాశ్.
కారు నడిపేతనం పుటకలోనే వున్నట్లుగా, వొక్క రోజులో డ్రైవింగ్ నేర్చి, యెంతో నేర్పుగా యెంతో వేగంగా__మళ్ళీ యెంతో సేఫ్ గా డ్రైవ్ చెయ్యగలిగింది.
ఆ కారు ఆమె సొంతానికి వుండిపోయింది. ఆ కారు, తన తొలి కారుగా తన సొంత కారుగా ఫీలవుతుంది. సూర్యప్రకాశ్ ఆ కారు సాధారణంగా ముట్టుకోడు. యింకా నాలుగు కార్లు వున్నాయి__వ్యాపార సంబంధంగా కొన్ని వ్యానులు జీపులు కాక.
ఆ కారులో షికార్లు తిరుగుతుంది. హైవే మీద నూటయాభయ్ కిలోమీటర్ల వేగంతో పోతూండటం ఆమెకి సరదా. బజారు, షాపింగు. కానీ__షాపింగ్ కి__మార్కెట్లో యేమున్నాయని కొంటుంది!
రెండు మూడుసార్లు యిద్దరూ కలిసి బొంబాయి ఢిల్లీ కలకత్తా వెళ్ళి వొచ్చారు. చాలా ఖరీదైన వస్తువులు__వేలూ లక్షలూ ఖరీదువి కొంది.
కానీ__
ఆమెని సూర్యప్రకాశ్ యెప్పుడూ వొక కంట కనిపెడుతూ వుంటాడని రెండు మూడు వారాలలోనే గమనించింది.
వొకసారి తను కారు డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో వొక్కతే సాయంత్రం వేళ అలా కారు నడుపుకుంటూ వెళ్ళింది. రియర్ వ్యూ అద్దంలో వొక కారు అదే వేగంలో రావటం గమనించింది. అది వాళ్ళ కారుల్లో వొక కారు. గమనించి మరికొంచెం ముందుకు వెళ్ళి కారు ఆపి రోడ్డు పక్కన వున్న చెట్ల మదుగులోకి వెళ్ళింది. తన వెనక వస్తున్న కారు బాగా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. గుర్తించింది కారు నడుపుతున్న వ్యక్తిని__వాళ్ళ డ్రైవర్లలో యెవరూ కాదు, అతని సన్నిహిత వ్యక్తులలో వొకతను.
ఐదు నిమిషాలు ఆగి కారు స్టార్ట్ చేసి ముందుకు సాగింది. నాలుగు ఫర్లాంగుల అవతల ఆ కారు ఆగి వుంది. మనిషి కారులో లేడు. ముందుకు సాగిపోయింది. నాలుగు నిమిషాలలో__తన కారు రియర్ వ్యూ అద్దంలోంచి కనిపిస్తున్న ఆ కారు__
అప్పటినుంచి__తన కదలికలను సూర్యప్రకాశ్ యెలా గమనిస్తున్నది గమనించటమేకాక, సూర్యప్రకాశ్ కదలికలు వ్యాపకాలనూ గమనించసాగింది.
సరససల్లాపాలప్పుడు తప్ప__యెప్పుడూ అతని పడక గదిలో అతనొక్కడే వుంటాడు. రాత్రంతా తను, తన పడకగదిలో_- ఇంద్రభవనం లాంటి సూర్యమహల్ లోని తన ఖరీదైన అందమైన పడకగదిలో.
చిన్న ఇల్లంత వైశాల్యం వుండే అతని గదికి_ఒకవైపు తలుపు తన సెక్రటరీ రోజీ ఆఫీసు గదికి. మరో తలుపు తన ఆఫీసు గదికి. మరో తలుపు బాత్రూంకి.
ఒకరోజున తార కళ్ళకి గంతలు కట్టి "నాతోరా కొన్ని విషయాలు తెలుసుకుందువు" అన్నాడు సూర్యప్రకాశ్.
జబ్బ పట్టుకుని నడిపిస్తున్నాడు. యే గదో యే భాగమో తెలియదు.
లిఫ్ట్ లాంటి దాన్లో కాసేపు కిందకి వెళుతున్నట్లుగా, కాసేపు పైకి వెళుతున్నట్లుగా అనిపించింది.
అంతలోనే మెట్లమీంచి దించుతున్నాడు.
కళ్ళగంతలు విప్పాడు.
ఓ చక్రాల బండిలో ఒక స్త్రీ__నలభయ్ ఐదేళ్ళుండవచ్చు. చీర కుచ్చిళ్ళు కిందకి నేలమీద వేళ్ళాడుతున్నాయి. ఒక కాలో రెండు కాళ్ళూనో లేవనిపించింది తారకి, చూడగానే.
"మా ఆంటీ" అన్నాడు.
"నమస్తే" అంది తార.
"యీ యింటి యిల్లాలివి అని అనటానికి వీలులేని జాతకం. అందుకని తారవి మాత్రమే. నీకేం కావాలో చెప్పు. యీ సూర్యమహల్ కావాలంటే మహల్, యేది కావాలంటే అది తన పేర రాసివ్వు బాబూ__ భార్య అన్నట్లేగా__అదో ముచ్చట, అదో తృప్తి" అంది ఆమె.
అటు ఒక గోడ దగ్గిరికి తీసుకెళ్ళాడు. అవతలగా వున్న ఒక చిన్న స్టూలు కాలితో జరిపి కూర్చోమన్నాడు, కూర్చుంది.
"ఆ యెదురుగా గోడకి వున్న స్పాట్ లోంచి చూడు" అన్నాడు.
చిన్న గాజు కంత. ఒంటికంటితో మాత్రమే చూడటానికి వీలయ్యేటంత చిన్నది.
చూసింది, ఒక కన్ను మూసుకుని దాన్లోంచి__చాలా పెద్ద ఆవరణ, జీపులు, కార్లు, వ్యాన్లు, మనుషులు, చక్కపెట్టెలు, డబ్బాలు ఏవేవో వున్నాయి.
అది చూస్తున్నప్పుడు తారలో వొణుకు పుట్టింది.
మళ్ళీ కళ్ళకి గంతలు.
పడక గదిలోకి చేరారు.
"మీరూ__" అని ఆగిపోయింది తార.
"చాలా పనులు చేస్తాను."
"స్మగ్లింగ్__"
"అదొక్కటే కాదు. చట్ట వ్యతిరేకమైనవి ఎన్నో యీ సంగతులు నీకేకాదు. వీటిని నా ఆజ్ఞలు, సూచనలు, సలహాల ననుసరించి స్వయంగా చేసి పెడుతున్న వాళ్ళున్నారు. వాళ్ళలో యెవరు యే కొంచెం నోరు జారినా, మరుక్షణం యీ లోకంలో వుండరు. నేనిప్పుడు యిక్కడ కూర్చుని వున్నాను నీతో మాట్లాడుతూ. కానీ నాకు సంబంధించినంతవరకు యెక్కడ ఏం జరుగుతున్నదీ తెలుసు. యెట్లా తెలుసునంటావా? అతీంద్రియ మంత్రతంత్ర శక్తులేం కాదు. అసాధారణ వైజ్ఞానిక సాధనాలతో. అవి మాత్రం నావరకే పరిమితం. యీ నానా కష్టాలు నీకక్కరలేదు. కులాసాగా హాయిగా సుఖంగా విలాసంగా గడిపేసెయ్యి" అన్నాడు.
