ఈయన ఒక పట్టాన వదిలే మనిషికాడు. ఈయనతో నిజం చెప్పినా కష్టమే. అబద్ధం చెప్పినా కష్టమే. "మరోసారి మాట్లాడతాను, అర్జంటుగా వెళ్ళాలి." అన్నాడు శివరావు.
"అయితే ఊరికే అంటావ్!" రామానుజం ఇరువురినీ ఎగాదిగా చూస్తూ అన్నాడు.
"ఊరికే అని చెప్పాను కదా! అబద్ధం అనుకుంటున్నారా ఏమిటి?"
"అబద్ధమే" నిక్కచ్చిగా అన్నాడు రామానుజం.
"అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు. ఊరినుంచి వచ్చాక అన్ని విషయాలూ చెబుతాను..."
శివరావు సాంతం మాట పూర్తి చెయ్యకుండానే రామానుజం అందుకున్నాడు "నిజం చెప్పటం ఇష్టంలేకపోతే చెప్పనూ అని ఒక్కమాట చెప్పొచ్చు కదా! చేతిలో పెట్టె లేకుండా ఆఖరికి చిన్న సంచీ అయినా లేకుండా పార్వతమ్మ కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రయాణమయ్యి వూరు వెళుతున్నారంటే ఎవరయ్యా నమ్మేది?" అంటూ మాట పూర్తిచేశాడు.
"నేను నిజమే చెప్పాను. మీ ప్రశ్నలకి సమాధానం తరువాత వివరంగా చెబుతాను. ఇప్పుడు మాత్రం సమయం లేదు. రా పార్వతీ!" అంటూ వేగంగా నడిచాడు శివరావు. పార్వతి కూడా శివరావు వెంట వేగంగా నడిచింది.
ఎవరో తరుముతూంటే పరుగెత్తుకెడుతున్న తీరుగా పార్వతీ, శివరావు వెళ్ళటం చూసి, రామానుజం తెల్లబోయి అలా నుంచుండిపోయాడు.
అసలు విషయం అర్థంకాకపోయినా ఈ వార్త వూళ్ళో వాళ్ళ చెవిన వేయటానికి రామానుజం అక్కడి నుంచి ముందుకు సాగాడు. పల్లెటూళ్ళలో నిప్పులేకుండానే పొగరాజుకుంటుంది. ఇప్పుడు ఆ వూళ్ళో జరగబోయేది అదే.
శివరావు, పార్వతి జరిగింది ఏమిటో ఎవరితో చెప్పదలచు కోలేదు. చెప్పేంత సమయం కూడా లేదు. వాళ్ళకు వున్నది వక్కగానొక్క కొడుకు చంద్రం. ఏ దేవతో అడ్డుబడి చంద్రాన్ని రక్షించిందా సరే.
లేక,
జరగానిదే జరిగితే వాళ్ళు మరుక్షణంలో చనిపోవటానికి నిర్ణయించుకునే బయలుదేరారు.
మనుషులు మంచి వాళ్ళయినంత మాత్రాన, సమయానికి దేవతలు ఆదుకుంటారని లేదు.
మృత్యువు పరిహసిస్తుంటే దేవుడు కూడా ఏంచెయ్యలేడు, మౌనంగా చూస్తూండటం తప్ప.
6
ఆ చిన్న పల్లెటూరికి బస్ స్టాండ్ అంటూ వేరేలేదు. ఊరికి ఒక పక్కగా విశాలమైన రోడ్డు, పక్క వూళ్ళకి వెళ్ళటానికి వీలుగా వుంది. రోడ్డు పక్కన నుంచొని వచ్చేపోయే బస్సులను ఆపి ఎక్కటమే.
వానవస్తే ప్రయాణీకులు తడిసి పోవాల్సిందే కాని, ఆఖరికి చిన్న షెడ్డు కూడా లేదు అక్కడ.
ఆ రోడ్డుకి ఇరుప్రక్కలా దారి పొడుగూతా చింత చెట్లు, మర్రిచెట్లు, మద్దిచెట్లు పెద్ద పెద్దవి వున్నాయి.
ప్రయాణీకులు ఆ చెట్ల క్రింద నుంచొనే బస్ రాకకోసం నిరీక్షిస్తూ వుంటారు.
ఇప్పుడు,
పార్వతి, శివరావు రాబోయే బస్ కోసం నిరీక్షిస్తూ చెట్టు క్రింద నుంచున్నారు. వచ్చేపోయే బస్ లకి ఒక టైమ్ అంటూ లేదు. పది నిమిషాలు, పావుగంట అటుఇటూగా వస్తుంటాయి. ఒక్కోసారి అరగంట ఆలస్యంగా కూడా రావచ్చు.
సరీగ ఐదునిమిషాలు చూశారు. ఏ బస్ రాలేదు.
