Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 8

వెళుతున్న భర్తను చూస్తూ అలా నిలబడిపోయింది పార్వతి.

చంద్రానికి తను తిథుల ప్రకారమే ఎప్పుడూ పుట్టినరోజు చేస్తుంది. ఇంకా పదిరోజుల తరువాతగాని చంద్రం పుట్టినరోజు రాదు. తారీఖుల ప్రకారం అయితే రేపే చంద్రం పుట్టినరోజు. బాగ్ తీసుకుని బాబాయ్ ఇంటికి వెళితే, "ఏంటమ్మా! పార్వతీ! మీవాడి పుట్టినరోజా? ఇన్ని రకాల స్వీట్లు చేసి పంపిస్తున్నావు" నవ్వుతూ దిగాడు. అప్పుడు తనకి గుర్తుకు వచ్చింది. తారీఖుల ప్రకారం అయితే చంద్రం పుట్టినరోజు రేపే. "సమయానికి గుర్తుచేశావు బాబాయ్! తారీఖుల ప్రకారం చంద్రం పుట్టినరోజు రేపే. రేపు మధ్యాహ్నానానికి నీవు అక్కడికి చేరతావు. చంద్రానికి ఈ విషయం చెప్పి, వాడికి ఇష్టమయిన ఈ హల్వాని నీ చేత్తోవాడి నోటికి అందించు." అంది తను.

"ఆ అదృష్టమేదో నాకు దక్కింది అన్నమాట!" నవ్వుతూ అన్నాడు బాబాయ్.

"పెద్దవాడివి నీ చేత్తో వాడికి అందిస్తే వెయ్యి ఆశీస్సులుగా భావిస్తాను. ఇక్క హల్వా ముక్క తిను బాబాయ్!" అంది తను"

 కానీ.

ఆయన తిననంటే తిననన్నాడు. "నీకు తెలిసిందే కదమ్మాయ్! చక్కర వ్యాధితో నేను ఎంత బాధ పడుతున్నానో. డాక్టరు చిటికెడు పంచదార కూడా తినవద్దన్నాడు. చూస్తూ చూస్తూ ఈ హల్వా తిని ప్రాణం తీసుకుంటానా! కావాలంటే నీ తృప్తి కోసం తింటాను రెండు చేగోడీలు ఇవ్వు. అంతేకాని హల్వా తినమని బలవంతం చెయ్యకు." అన్నాడు.

దాంతో తను హల్వా పెట్టకుండా గుప్పెడు చేగోడీలు పెట్టటం బాబాయ్ తినటం జరిగింది. బాబాయ్ కాదుకదా శత్రువు కూడా ఆ విషపూరితమైన హల్వా తినడు. తను తన చేతులారా కొడుకు ప్రాణం తియ్యడానికి విషం కలిపి కమ్మటి హల్వా తయారుచేసింది. నా అంత పాపిష్టిది... ... ..."

అక్కడే అలాగే నుంచున్న పార్వతి జరిగింది ఆలోచిస్తూ, బొటబొటా కన్నీళ్ళు కార్చింది.
                                                                       5

పార్వతి మసకబారిన కళ్ళకి ఆదరాబాదరాగా వస్తున్న శివరావు కనిపించాడు.

"ఏమైంది?" అతనికి ఎదురునడుస్తూ అడిగింది పార్వతి.

"పద నడుస్తూ మాట్లాడుదాం!"

పార్వతి మారు మాట్లాడకుండా భర్త వెనుకనే నడిచింది.

ఇరువురూ శరవేగంగా ముందుకు సాగారు.

దారిలో పార్వతి అడిగింది. "చిన్నకారు లేదా?" అని.

కారెక్కడికి పోతుంది. కారైతే వుంది. కానీ, సమయానికి మనకి అందుబాటులో లేకుండా పోయింది. సూరిబాబు రెండో కొడుకు కారు తీసుకుని అరగంట క్రితమే వారి అత్తగారి వూరు వెళ్ళాడుట. అంతా మన దురదృష్టం. ఒక్క అరగంట ముందు వెళ్ళినట్లయితే... ..." అన్నాడు శివరావు.

పార్వతి ఏమీ మాట్లాడలేదు. భర్త ప్రక్కనే నడువసాగింది.

దారిలో వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు.

ఎవరి ఆలోచనలో వారు మదనపడుతూ వేగంగా నడవసాగారు.

దారిలో ఆ వూరి రామాలయపు పూజారి ఎదురువచ్చాడు. అతని పేరు రామానుజం.


 "ఎక్కడకి భార్యాసమేతంగా బయలుదేరావ్?" రామానుజం నిలవేసి అడిగాడు.

"అర్జంటుగా వూరు వెళ్ళవలసి వచ్చింది" నసుగుతూ చెప్పాడు శివరావు.

"ఊరికా?"

"ఆ వూరికే."

శివరావు చెప్పింది వినగానే ఫక్కున నవ్వాడు రామానుజం.

"ఏమ్మా పార్వతీ! మీ ఆయన ఎప్పటినుంచీ అబద్ధాలాడటం."

నవ్వులకీ, పరాచికాలకీ ఇది సమయం కాదు...అందువల్లనే పార్వతి ఏమీ మాట్లాడలేదు.

శివరావుకి అసలే చిరాకుగానూ, గాభరాగానూ వుంది. అనుకున్న టైమ్ కంటే ముందే తను పట్నం చేరాలి. మృత్యునాదం  చెవుల్లో హోరెత్తిపోతున్నది. పండరీకాక్షయ్య గోధుమ హల్వా చూడముచ్చటైన మోముతో చంద్రమూ. ఈ మూడే కనపడుతున్నాయి శివరావు కళ్ళకి. మనసు పనిచెయ్యటమనేది ఎప్పుడో మానేసింది. నిజం గ్రహించి బయలుదేరే సమయానికి పార్వతికి ప్రెసిడెంట్ గాటి చిన్నకారు గుర్తుకు రావటం, తను అక్కడికి వెళ్ళిరావటం వల్ల మరింత ఆలస్యమూ, దాంతో మరింత భయం, ఆందోళన ఎక్కువ అయ్యాయి. ఈ విషయం ఎవరికైనా చెబితే వాళ్ళ సలహాలు సానుభూతి మాటలూ దీంతో మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం వుంది. కాబట్టి ఎవరికీ చెప్పకుండానే బయలుదేరాడు. కానీ, మధ్యలో రామానుజం అడ్డం తగలనే తగిలాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS