పార్వతికి కంగారుగా వుంది. శివరావుకి కూడా కంగారుగానే వుంది. ఎవరికి వారే కంగారు దిగమ్రింగి మౌనంగా రాబోయే బస్ కోసం నిరీక్షిస్తూ వుండిపోయారు. వాళ్ళెంత ఆదుర్దా పడుతున్నారో అంత ఆలశ్యంగా బస్ వచ్చేటట్లు వుంది.
"ఇంతకు మునుపే బస్ వెళ్ళిందేమో? ఆత్రుత పట్టలేక పార్వతి అంది.
"ఏమో!" ముక్తసరిగా అన్నాడు శివరావు.
మళ్ళీ మాట్లాడించే ధైర్యం పార్వతికి లేకపోయింది.
పగలంతా పనిచేసి పార్వతి బాగా అలసిపోయింది. శివరావు కూడా బయట తిరిగి తిరిగీ వున్నాడేమో బాగా అలసిపోయి వున్నాడు. అలసటకి తోడు ఆందోళన ఇద్దరి మొహాలూ అలసటతో ఆందోళనతో అలసిపోయి వున్నాయి. కానీ, వాళ్ళు చెట్టుక్రింద కూర్చొనే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నుంచునే వున్నారు.
దూరంగా బస్ హారన్ వినిపించింది.
"బస్ వచ్చేస్తోంది!" ఆనందంగా అంది పార్వతి.
"అవును" తనూ ఆనందం వ్యక్తం చేస్తూ అన్నాడు శివరావు.
అయితే వీళ్ళ ఆనందం పట్టుమని పదినిమిషాలు కూడా నిలువలేదు. అది బస్ హారన్ కాదు.
ఏదో లారీ తాలూకా హారన్! లారీ వాడిని బ్రతిమాలాడి, ఆ లారీ ఎక్కి వెళదాం అన్నా, అది పట్నం వైపు వెళ్ళే లారీ కాదు. ఎదురునుండీ వచ్చే లారీ, అయినా మానవ ప్రయత్నంగా లారీని ఆపే ఉద్దేశ్యంతో, లారీని ఆపమన్నట్లుగా చెయ్యి ఊపుతూ కాస్త ముందుకి వెళ్ళి నించున్నాడు.
తమ వాహనాన్ని ఆపమంటున్నారని లారీలో వున్నవాళ్ళకి అర్థమయింది కానీ, వాళ్ళు లారీని ఆపేవాళ్ళ లాగా లేరు. మరింత స్పీడుగా దూసుకుని ముందుకు వెళ్ళిపోయారు.
నిరాశగా వెనక్కి వచ్చేశాడు శివరావు.
నిట్టూర్చి వూరుకుంది పార్వతి.
గొడ్ల కాచే వెంకడు వస్తూ శివరావుని చూశాడు.
"ఏంటి శివయ్య గారూ, ఇక్కడ నుంచున్నారు?" అడిగాడు.
"అర్జంటుగా పని బడింది, ప్రక్క వూరికి వెళ్ళాలి. ఇటు వచ్చే బస్ కోసం చూస్తున్నాను." శివరావు చెప్పాడు.
"ఇటొచ్చే బస్సు ఇంతకు ముందే వెళ్ళిందయ్యా!" అని చెప్పాడు వెంకడు.
"సరేలే, నువ్వెళ్ళు!" అన్నాడు ముక్తసరిగా శివరావు.
వెంకడు అక్కడే నిలబడితే ఇంక ఎన్ని ప్రశ్నలు వేస్తాడో అని, మాట్లాడటానికి మనస్సురాని శివరావు వెళ్ళమని వెంకడుతో చెప్పాడు.
శివరావు ఆ మాట చెప్పిన తరువాత వెంకడు ఆగే ప్రయత్నం చెయ్యలేదు.
ముందుకు సాగిపోతూ అనుకున్నాడు "ఎప్పుడూ శివయ్యగారు పలకరించినా పలకరించకపోయినా నేను కనపడితే చాలు వంద ప్రశ్నలు వేసేవారు. అదేమిటో వెళ్ళమన్నారు. చాలా వింతగా వుందే. పార్వతమ్మ గారు కూడా ప్రక్కనే వున్నారు. ఆరు కూడా మాట్లాడించలేదు."
'బస్సు ఇంతకు ముందే వెళ్ళింది' అన్న వెంకడు మాటలు విని పార్వతి మరింతగా క్రుంగిపోయింది.
సరీగ పావుగంట నిరీక్షణ తరువాత, మరోసారి బస్సు హారన్ వినిపించింది దూరంనుంచీ. ఈ తఫా భార్యా భర్తా ఇద్దరూ ఒకరి మొఖం వంక ఇంకొకరు చూసుకున్నారు. అంతేకాని ఇరువురూ మాట్లాడుకోలేదు. చింత చెట్టు క్రింద నుంచున్నవాళ్ళు కాస్తా, కాస్తా రోడ్డు వారగా నుంచున్నారు. ఈ తఫా వచ్చింది నిజంగా బస్సే. అయితే ఇటుప్రక్క నుంచి వచ్చే బస్సు కాక అటు ప్రక్కనుంచీ వచ్చే బస్సు.
"భగవంతుడా! ఏమి పరీక్షయ్యా ఇది మాకు?" నిరాశగా ఎవరికి వారే అనుకున్నారు.
సడన్ బ్రేక్ వేసినట్లు బస్సు వీళ్ళ ముందుకి వచ్చి ఆగింది.
"ఊ...ఊ... తొందరగా ఎక్కండి!" కండక్టర్ డోర్ తీస్తూ అన్నాడు.
"ఊహు! ఈ బస్ కాదు మేము ఎక్కేది!" శివరావు ఒక అడుగు వెనక్కి వేస్తూ అన్నాడు.
"మరి రోడ్డు వారగా వచ్చి ఎందుకు నుంచున్నారు?" కండక్టర్ గీరగా అని డోర్ గట్టిగా వేస్తూ "రైట్, రైట్!" అన్నాడు.
