Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 9


    ఇప్పుడు బాస్ మా ఇద్దరికీ బద్ధ విరోధి.    


    కానీ, వాడు బాస్ స్థానంలోనే వున్నాడు. మేమిద్దరం ఖైదీల స్థానంలో వున్నాం.


    బాస్ వున్నప్పుడేకాక బాస్ వెళ్ళిన తరువాతకూడా మేమిద్దరం చచ్చేటట్లు తన్నుకున్నాం. తన్నుకునీ తన్నుకునీ మాకే విసుగుపుట్టి, ఇరువురం పోరు విరమించుకున్నాము.


    "మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తే ఇలానే జరుగుతుంది" కోపంగా అన్నాను నేను.


    "ఇదే ప్రశ్న నేనూ నిన్ను వేస్తున్నాను. దీనికి సరిఅయిన సమాధానం ఏమిటి భాయ్?" హిందీలో వ్యంగ్యంగా అడిగాడు రాంసింగ్.


    అంతే.


    మూతలుపడ్డ నా కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. అంతవరకూ బద్ధశత్రువులుగా వున్న మేము ఆ క్షణం నుంచీ మిత్రులమయి పోయాము. ఇద్దరం గాయపడ్డ పులులమే. పులిని పులి చంపుకుంటే ఏమి న్యాయం? పులి చంపవలసింది ఏ మేకనో లేకపోతే ఏ జింకనో.


    నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ "చాలా దాహంగా వుంది భాయ్!" మూలుగుతూ అన్నాడు రామ్ సింగు.


    "నాకూ అలానే వుంది" అన్నాను నేను నాలుకతో పెదవులని రాచుకుంటూ.


    మేమిద్దరం ప్రతి మాటా హిందీలోనే మాట్లాడుకుంటున్నాము. నాకు హిందీ బాగా వచ్చు. రామ్ సింగ్ కి హిందీలో మాట్లాడటం తేలిక. అందువల్ల మా మధ్య మాటలు హిందీలోనే సాగుతున్నాయి.


    "మనిషికి ఆశ వుండటం, మనిషనేవాడు ఆశ పడటం ఎంత మాత్రమూ తప్పుకాదు. ఒక దొంగ, ఒక పోలీసు కలిసి బరిలోకి దిగి పోరు సలిపితే అర్ధం వుంది. ఇద్దరు వీరులు యుద్ధంలో ఎరురెదురుగా నిలిచి, భీకరంగా యుద్ధం చేసినా, దానికీ ఓ అర్ధం వుంది. శత్రువూ, శత్రువూ తలపడి తన్నుకుంటే దానికీ మరో అర్ధం వుంది. కానీ నువ్వూ నేను ఏంటి భాయ్! దొంగవాడు మరో దొంగవాడిని దోచుకోవటం. మోసగాడిని మరో మోసగాడు మోసపుచ్చటం అర్ధంలేదు. మనలో మనకు విభేదాలు వుంటే, నీతో నిజాయితీ అనేవి, ముఖ్యంగా మన వృత్తిలోనే వుండాలి. లేకపోతే ఇలాగే అధోగతి పాలవుతాం!


    మనం ఇతరులని మోసగించటానికి పుట్టాంగానీ, మనని మనం మోసగించటానికి కాదు__" రామ్ సింగ్ ని మోసగించటానికి ప్రయత్నించింది నేనే. అయినా ఇప్పుడు మళ్ళీ ఈ నీతులు చెబుతున్నదీ నేనే.


    రామ్ సింగ్ నా మాటలకి అడ్డు తగులుతూ "నువ్వు ఎందుకిలా చెబుతున్నావో నాకు అర్ధమయింది భాయ్. నీ మనసు గ్రహించాను. ఆశపడటం మానవ సహజం అని అత్యాశ అనర్ధకమని రెండూ నువ్వే చెప్పావ్! గతాన్ని సమాధిచేసి ఇకపై క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం! బలంలోనూ, తెలివిలోనూ నాకన్నా నీవు గట్టివాడివని గ్రహించాను. ఇకపై ఏపని చేసినా మనిద్దరం కలిసే చేద్దాము. ప్రతిదీ కలిసే పంచుకుందాము. అది పైసా అయినా లేక 'ఒక కోటీ యాభై లక్షలు' అయ్యేది కానీ నాదొక్క కోరిక. అది మాత్రం కాదనకు. ఈ క్షణం నుంచీ మనం ప్రాణమిత్రులం. ఒక్కటేకాదు...నీవు నా బాస్ వి. నేను నీ కుడిభుజాన్ని అంటే నీ అసిస్టెంటుని" గంభీరంగా అన్నాడు.


    రామ్ సింగ్ చెప్పింది నాకు చాలా నచ్చింది. నా మనసులోమాట కూడా అదే.


    "ఇదేం కోరిక బ్రదర్?" నవ్వుతూ అడిగాను.


    "ప్రశ్న వద్దు. జిహ్వకో రుచి, పుర్రెకోబుద్ధి. ఎస్, యా, నో  ఏదో ఒకటి చెప్పు" గుప్పెడు మూసి బొటనవేలు పైకెత్తి చిరునవ్వుతో "ఎస్" అన్నాను రామ్ సింగ్ అన్న ఈ మాటలకి సమాధానంగా.


                                          5


    "నువ్వు అబద్ధం ఆడుతున్నావు" రామ్ సింగ్ అన్నాడు.


    "నేనా! అబద్ధం ఆడటమా!" తెల్లబోయాను.


    "ఔను. నేను చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం!"


    మరోసారి ఆశ్చర్యపోవటం తప్ప నా నోటివెంట మాట రాలేదు.


    "నీవు చూడటానికి నాలాగే పొట్టిగా, లావుగా లేవు. ఎంతో హ్యాండ్ సమ్ గా ఆడపిల్లల్ని ఆకర్షించే విధంగా వున్నావు. నీ కళ్ళల్లో మెరుపు పహిల్వాన్ కి ఉన్నట్లు కాకుండా కరాటే వీరుడికి ఉన్నట్లు కండలు, సిన్హా మధ్యమూడు అంటారే అలా ఉంటావు. అంతేకాక ఆడపిల్లేమిటి వయస్సు మళ్ళిన ఆడవాళ్ళుకూడా నిన్ను పదేపదే చూసేలా నిలువెల్లా మగతనం ఉట్టిపడుతూ ఉంటావు. నిన్ను చూడంగానే ఎవరూ దొంగవనికాని, మోసగాడనికానీ ఎవరూ అనుకోరు. కలల రాజకుమారుడివి..."


    రామ్ సింగ్ మాటలకి మధ్యలో అడ్డు తగిలి "నాకో పెద్ద అనుమానం వస్తున్నది" అన్నాను నేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS