Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 10


    "అనుమానమా?"


    "అనుమానమే. నీవు నన్ను ఇలా వర్ణిస్తూ ఉంటే మగవేషంలో ఉన్న ఆడపిల్లవేమో అనిపిస్తున్నది" నవ్వుతూ చెప్పాను.


    అతడు కొద్దిగా సిగ్గుపడ్డాడు.


    "నిన్ను చూసిన తరువాత నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. ఎందుకో తెలుసా? ఆడదానిగా కాక మగాడిగా పుట్టినందుకు" అన్నాడు రామ్ సింగ్.


    కొద్దిసేపు నవ్వు ఆపుకోలేక పోయాను. "మగవాళ్ళు మగవాళ్ళని ప్రేమిస్తారని, ఆడవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమిస్తారని అలాంటి హోమో సెక్స్ వల్ టైపువా నాయనా!" భయం నటిస్తూ అడిగాను.


    "ఆ టైపుని కాను. కొరుక్కు తింటానని భయపడకు. జీవితంలో ఒకే ఒక్కసారి ఒక అమ్మాయిని ప్రేమించాను. మోసపోయాను. ఆ తర్వాత ఏ ఆడదాని ముఖమూ చూడలేదు__" అంటూ రామ్ సింగ్ తన కథ చెప్పాడు.


    "మనిషి దొంగగా పుట్టడు. పరిస్థితుల ప్రభావం అతన్ని దొంగ గానో, దొరగానో తయారు చేస్తాయి" రామ్ సింగ్ తోపాటు నా గురించి కూడా ఆలోచిస్తూ అనుకున్నాను.


    "నీలాంటి వాడికి 'గుండేరావ్' అన్న పేరు వుండదు. బాగుండదు కూడా. నీ అసలు పేరు ఏదో ఉండే ఉంటుంది. చూడటానికీ చదువుకున్నవాడిలా ఉంటావు. చదువుకున్నావనే అనుకుంటున్నాను. నీ కభ్యంతరం లేకపోతే నీ కథ నాకు చెప్పు" అన్నాడు రామ్ సింగ్.

    
తల వూపి ఆలోచనలో పడ్డాను. "మా మధ్య ఇకపై రహస్యాలుండకూడదు. బాస్ గాడు మమ్మల్ని ఈ గదిలో బంధించి అప్పుడే ఒకరోజు గడిచిపోయింది."


    "మిమ్మల్ని ఒక్కసారిగా చంపను. ఆహారం అనేది మీకు అందుబాటులో ఉండదు. ఇక ఆ విషయం పూర్తిగా మరచిపోండి. రేపు మీ ఇద్దరికీ కలిపి ఈ రోజుకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తాను. రేపు అరగ్లాసు ఎల్లుండి పావుగ్లాసు అలా అలా రోజురోజుకీ తగ్గిస్తూ మంచినీళ్ళు ఒక్కటీ ఇస్తుంటాను. ఆఖరికి ఇచ్చేది ఒక్క మంచినీళ్ళ బొట్టు. ఉత్తనీళ్ళతో ఎన్నాళ్ళు జీవిస్తారో చూద్దామని నాకో కోరిక కలిగింది. మీవి ఎంత మొండి ప్రాణాలో పరీక్ష చెయ్యటం నేను ఒక తమాషా ఆటగా తీసుకుంటున్నాను" ఈ మాటలు చెప్పి బాస్ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు.


    గ్లాసుడు మంచినీళ్ళు మమ్మల్ని బ్రతికించవని నాకు తెలుసు. కానీ, చాలా కొద్దిగా మా దాహం తీరింది. నేను నిద్రని, ఆకలిని, దాహాన్ని ఆపుకోగలను కొంతవరకూ. అందుకే పావు గ్లాసు మంచినీళ్ళు నేను త్రాగి, ముప్పావు గ్లాసు నీళ్ళు రామ్ సింగ్ కి ఇచ్చాను. దాంతో రామ్ సింగ్ నాపై వెర్రి అభిమానం ఆ క్షణం నుంచే పెంచుకున్నాడు. ఈ రోజు బాస్ గాడు వచ్చి అరగ్లాసు మంచినీళ్ళు యిస్తాడు. మేము చేసే పనంటూ ఏమీలేదు. అందుకే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.


    రామ్ సింగ్ నా కథ అడగంగానే...


    "నేను పుట్టి బుద్ధి పెరిగిన తరువాత నా జీవితంలో ఏ క్షణాన ఏం జరిగిందీ అన్నీ చెబుతాను. కానీ ఎక్కువ మాట్లాడటంవల్ల మనం తొందరగా అలసిపోవటం జరుగుతుంది. ప్రస్తుతానికి టూకీగా నా కథ వినిపించి, మరొకసారి పూర్తిగా చెబుతాను.


    నేను బాగా చదువుకున్నాను. ఎన్నో భాషలు సరదాపడి నేర్చుకున్నాను. మరెన్నో క్రీడల్లో పాల్గొని ప్రైజులు కూడా కొట్టేశాను. ఖర్మకాలి చెయ్యని నేరానికి, లోకం దృష్టిలోనూ, పోలీసుల దృష్టిలోనూ, చట్టం దృష్టిలోనూ దొంగగా ముద్రపడి శిక్షకు లోనయ్యాను. శిక్ష అనుభవించి జైలు నుండి బయటకు వచ్చిన తరువాత లోకం దృష్టిలో మోసగాడిని, దొంగని అయ్యాను. నేను దొంగని కానని ఘోషించాను. మోసగాడిని కానని ఎలుగెత్తి అరిచాను. నన్ను అర్ధం చేసుకున్నది కానీ నా మాట వినిపించుకున్నది కానీ ఎవరూ లేరు. ఆ దెబ్బతో ఈ లోకం మీదా, ఈ మనుషుల మీదా పుట్టింది విరక్తి కాదు 'కసి'.


    'కోటి విద్యలూ కోటి కొరకే' దొంగా మనిషే అనుకుంటూ హాయిగా దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతున్నాను. మోసం, దొంగతనం అంతవరకే వెళ్ళాను కానీ, హత్యలు జోలికి ఎన్నడూ వెళ్ళలేదు.


    హత్యలూ, రేప్ లూ చెయ్యటం అసమర్థుల పని అని నా నమ్మకం. ఓ దొంగతనం కేసులో బాస్ దృష్టిలో పడ్డాను. బాస్ నన్ను కాపాడటం కాక నేనే బాస్ ని కాపాడాను. అప్పటినుండీ బాస్ తన ముఠాలో నన్ను చేర్చుకున్నాడు. నేను దొంగనని,దొంగతనం చెయ్యటం నేరం అనీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నాకీ పరిస్థితిని పట్టించిన వాళ్ళమీద పగ తీర్చుకోవాలంటే నేను లకారాలకి అధిపతిని కావాలి. అదయ్యే మార్గం దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు.


    బాస్ నా చేత తన పని చేయించుకుని పదిరూపాయల పనికి పావలా చేతిలో పెట్టేవాడు. ఎదుగూ బొదుగూ లేని జీవితం అయిపోయింది. కానీ బాస్ దగ్గర వుంటే సేఫ్టీ వుంటుందని, వీళ్ళ ముఠాలో ఇలాగే ఉండిపోయాను. నీవు "కోటీ యాభై లక్షలు" విలువగల వజ్రాల గురించి చెప్పగానే నా పాత పగ గుర్తుకువచ్చి ఈ మధ్య నన్ను మా బాస్ కూడా తృణీకారంగా చూడసాగాడు. అందువల్లనే నేను వాడికి ఈ డబ్బు సంగతి చెప్పదలుచుకోలేదు కానీ, ఈ విషయంలో కూడా నేను మరోసారి చావుదెబ్బ తిన్నాను. నీవు వూహించినట్లు నా పేరు "గుండేరావు" కాదు. నాకంటూ ఒక మంచి పేరు ఉంది. నా పాత జీవితం పదేపదే గుర్తుకు వస్తుందని పేరు కూడా మార్చుకున్నాను. నా పేరు "విజయ్ రాజ్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS