Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 8


    రూమ్ మొత్తం బయట స్విచ్ వేస్తే అంతటా కరెంట్ పాస్ అయ్యేలాగా ఏర్పాటు చెయ్యబడి వుంది. అలా కరెంట్ పాస్ కావటం వల్ల మనిషి చావడు కానీ, కదలక మెదలక వుండిపోతాడు. ముందుకు అడుగు పడదు. బాస్ రబ్బరు దుస్తులు ధరించి లోపలికి వచ్చి లోపల వున్న వాళ్లకి శిక్షలు విధిస్తూ వుంటాడు.


    బాస్ వెడుతూ, వెడుతూ కరెంటు స్విచ్ వేసి వెళ్ళలేదు. అందువల్ల మేము బందీలుగా వున్నా ఫ్రీగా కదలగలుగుతున్నాము.


    నేను కొట్టిన దెబ్బలకి రామ్ సింగ్ మూలుగుతూ పడుకున్నాడు.


    రెండు గంటల క్రితం రామ్ సింగ్, నేనూ తన్నుకు చావటంవల్ల నా శరీరంకూడా పూర్తిగా నా స్వాధీనంలో లేదు. వళ్ళంతా ఒకటే నొప్పులు. ఒళ్ళు నెప్పులకన్నా మనసు మండిపోయే బాధ భరించరానిదిగా వుంది.


    "కోటీ యాభై లక్షలు" చేయి జారిపోయాయి.


    స్వేచ్చను కోల్పోయాను.


    బంధీగా మిగిలిపోయాను.


    వీటన్నిటికన్నా ముఖ్యమయినది.


    ఘోరాతి ఘోరంగా, దారుణంగా మోసపోయాను.


    మనస్సు మండిపోక ఏం చేస్తుంది?


    జరిగినదంతా పదే పదే గుర్తుకు వస్తున్నది.


    గుర్తుకు రావటమే ఆలస్యంగా మనస్సుతో మంటలా బయలుదేరి నిలువెల్లా దహిస్తున్నది.


    ఈ మంటణు చల్లార్చటానికి ఎన్ని టాంకుల నీళ్ళు సరిపోవు.


    జరిగినదంతా తలుచుకుంటూ కూర్చున్నాను.


    రామ్ సింగ్ కి తెలుగువచ్చు. ఒకటీ రెండు తెలుగు ముక్కలు పట్టీ పట్టీ మాట్లాడగలరు. కాయితం కలం యిస్తే మాత్రం తెలుగులో యాసతో అయినా చక్కగా వ్రాయగలడు. ఈ విషయం నాకు ముందుగా తెలియకపోవటంవల్ల, నా కొంప నిలువునా మునిగింది.  


    రామ్ సింగ్ తెలుగు రానట్లు నటించాడు. వాడికి హిందీ తప్ప తెలుగు రాదనుకొని, ట్రాన్స్ లేటర్ గా (దుభాషిగా) బాస్ తనమధ్యా, రామ్ సింగ్ మధ్యా నన్ను నియమించుకున్నాడు.


    బాస్ పెట్టే బాధ భరించలేక రామ్ సింగ్ కి రవ్వంత ఆశకూడా ఎర చూపటం వల్ల రామ్ సింగ్ హిందీలో వజ్రాలు ఎక్కడ దాచిందీ చెప్పాడు. నేను ఆ విషయాన్ని తెలుగులో తర్జుమా చేసి బాస్ కి చెప్పక మోసపూరితమైన మాటలు చెప్పాను.


    "కోటీ యాభైలక్షలకి" ఆశ పడ్డాను.


    "కోటీ యాభైలక్షల" వజ్రాలు నేను తీసుకుంటానని, ఆ విషయం బాస్ కి చెప్పననీ, తనకి మరణం ఖాయమని, రామ్ సింగ్ గ్రహించాడు. ఆ రాత్రికి బాస్ రామ్ సింగ్ కి అన్నం తీసుకెళ్ళినపుడు....


    "నాకు తెల్గు కుఛ్ కుఛ్ వచ్చు! మోసము, దగా!" అని మాత్రమే చెప్పి "రాయడం వచ్చు" అని చెబుతూ కాగితం కలం కావాలని సౌంజ్ఞ చేసాడుట.


    ఆ దెబ్బతో బాస్ ఆశ్చర్యపోయి కాగితం కలం తీసుకువచ్చి రామ్ సింగ్ కి ఇచ్చారు.


    "నేను "కోటీ యాభై లక్షల" రహస్యం నీతో వచ్చిన వాడికి చెప్పాను. నీవు నన్ను పార్టనర్ గా చేసుకునేటట్టయితే అసలు నిజం చెబుతాను. నీకు నేను సాయం చేస్తున్నా కాబట్టి నాకు నమ్మక ద్రోహం చెయ్యవద్దు. నన్ను పార్టనర్ గా చేసుకుంటానని ప్రమాణం చెయ్యి..." అని రామ్ సింగ్ రాసి చూపించాడుట బాస్ కి.


    అది చదివిన బాస్, ఓట్లు, ఆరాలూ, తల్లితోడూ, భగవంతుడి మీద ఆన ఇష్టమొచ్చినన్ని ప్రామిస్ లు చేశాడు.


    అది నమ్మిన రామ్ సింగ్ మళ్ళీ ఇలా రాసి చూపించాడట.


    "నేను అప్పుడే గ్రహించాను. మొదటికే మోసం వస్తుందని నేను అప్పుడు చెప్పలేడు. నేను నీ అసిస్టెంటుకి "కోటీ యాభై లక్షల" రహస్యం చెప్పాను. ఆ విషయం నీ అసిస్టెంటు నీతో తెలుగులో చెప్పేటపుడు మాట మార్చివేసి నిజం చెప్పకుండా దాచేశాడు. ఈ రాత్రికే వాడు వజ్రాలను అక్కడనుండి తరలిస్తాడు. అవి నీవు చేజిక్కించుకో. మనిద్దరినీ మోసి చేసినందుకు వాడికి ఏమి శిక్ష విదిస్తావో నీ ఇష్టం. నీవు కోటి రూపాయలు తీసుకో. నాకు యాభై లక్షలు ఇవ్వు. మనిద్దరం ఇకపై పార్టనర్స్ గా వుందాం..."


    రామ్ సింగ్ రాసింది చదివి "ఆడిన మాట నేను తప్పను. నిన్ను నేను పార్టనర్ గా చేసుకుంటాను. అయితే నీవు చెప్పింది ఎంత నిజమో, నేను వెళ్ళి చూసి వస్తాను. నువ్వు చెప్పింది నిజమే అయితే, ఉదయాన్నే వాడిని ఉపాయంగా లాక్కువచ్చి, నీ గదిలో పడేస్తాను. వాడిని ఎలా శిక్షించాలో నీకే వదిలి పెడుతున్నాను. ఈ విధంగా చేద్దాం" అంటూ బాస్ తెలుగులో రాసి రామ్ సింగ్ కి చూపించాడు.


    ఆ తరువాత.


    బాస్ నన్ను నీడలాగా అనుసరించి వుంటాడు. నేను వజ్రాలు తీసి మరోచోట పాతి పెట్టడం కూడా కనులారా తిలకించటం చేసి వుంటాడు. నేను ఇటు రాంగానే, వాడు అటు "కోటీ యాభై లక్షల" వజ్రాలని చేజిక్కించుకుని, ఎక్కడో భద్రంగా దాచాడు. అంతవరకూ ఖాయం. ఉదయానే నన్ను కబురుచేసి పిలిపించటం, ఆ తరువాత ఇదిగో ఇలా బందీ చెయ్యటం చాలా చాకచక్యంగా జరిగిపోయింది. ఇటు నేనూ మోసపోయాను. అటు రామ్ సింగూ మోసపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS