"ఆగండి!" పెద్దగా అరిచింది పార్వతి.
శివరావు వెనుతిరిగి చూడకుండానే అడిగాడు 'ఎందుకు?' అని.
"నేనూ మీతో వస్తాను."
"ఏమిటీ! నువ్వూ వస్తావా!" తెల్లబోతూ అడిగాడు శివరావు.
"మీరెంత స్వార్థపరులండీ!"
పార్వతి కాపురానికి వచ్చిన ఇన్నేళ్ళలో మనస్ఫూర్తిగా ఇలాంటి మాట అని ఎరుగదు. బాధ, ఉక్రోషం, దుఃఖం ముప్పిరి గొనగా ఆ మాట అనేసింది.
"నాది స్వార్థమా?"
"స్వార్థం కాకపోతే తొందరపాటు. మీ దోవన మీరు వెళితే నేను వంటరిగా ఎలావుంటాననుకున్నారు. విషం సీసా మీ జేబులోనే వుంది. కలిసి వెళదాం పదండి. చావో బ్రతుకో అక్కడే తేల్చుకుందాం" భయంతో స్వరం కంపిస్తున్నా కాస్త గట్టిగానే అంది.
పార్వతి చెప్పిందీ నిజమే అనిపించింది శివరావుకి. మారు మాట్లాడకుండా లోపలికి నడిచాడు. డ్రాయరు సొరుగు తీసి చేతికి అందిన పెద్ద నోట్లకట్ట అందుకుని జేబులో కుక్కుకున్నాడు. 'తాళం వెయ్యి పార్వతీ! వెంటనే బయలుదేరుదాం' అన్నాడు.
మరోక్షణంలో ఇరువురూ ఇంటి బయటకి రావటం ఇంటికి తాళం వెయ్యటం జరిగింది.
అప్పుడు గుర్తుకు వచ్చింది పార్వతికి 'ఆ విషయం. ముందుకు రెండు అడుగులు వేసిన పార్వతి, టకీమని ఆగిపోయింది.
4
"ఏమయింది మళ్ళీ?" శివరావు విసుగ్గా అడిగాడు.
"తొందరలో మనమొక విషయం మరచిపోయాము అంది పార్వతి.
"ఏమిటది?"
"పండరీ కాక్షయ్య బాబాయ్ ఇప్పటికి బస్సులో చాలా దూరమే వెళ్ళివుంటాడు. మనం బస్సు అందుకుని వెళ్ళి అలా జరిగేసరికి, మధ్యలో మూడు నాలుగు గంటల తేడా వుంటుంది... ... ..."
"అయితే ఏమంటావ్?" ఒక్క అరుపు అరిచాడు రావు.
పార్వతి నాన్చుడు వ్యవహారం చూస్తుంటే మరోసారి మరోసారి అయితే నవ్వుతూ ఎగతాళి పట్టించేవాడే. వున్న ఒక్క కొడుకు యొక్క జీవన్మరణ సమస్య. ఇక్కడ తామొక్కక్షణం ఆలస్యం చేస్తే హల్వా రూపంతో ప్రయాణిస్తున్న మృత్యువు ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తూంటుంది. ఇప్పటికే బాబాయ్ ప్రయాణమయ్యి మూడు గంటలయింది. ఆ సమయాన్ని అధిగమిస్తూ ముందుకుసాగటం అంత తేలిక విషయం కాదు. బిడ్డ క్షణక్షణానికి మృత్యువుకి దగ్గరవుతూంటే, కన్నతల్లి హృదయానికి ఆ ఆపద అర్ధంకావటం లేదా? పార్వతి మతివుండే ప్రవర్తిస్తున్నదా?
శివరావు అలా అనుకుంటూ ఉండగానే పార్వత అంది.
"మనం ఇప్పుడు బస్సులో వెళతాం అనుకోండి. కానీ బాబాయి కన్నా ముందు వెళ్ళటం సాధ్యం కాదు. ఏ దేవతలో కరుణిస్తే అయ్యేపని అది..."
"అయితే దేముడి మీద భారం వేసి ఆగిపోదామంటావా?"
"ఆగిపోవటం కాదండీ! ఇంకా ముందు వెళ్ళే ప్రయత్నం చేద్దాం! ప్రెసిడెంటు సూరిబాబు గారికి చిన్నకారు వుందికదా! విషయం ఇదని చెప్పి కారు ఇమ్మని అడగండి. ఆ కారు గనక అయితే మనం ఎక్కడా ఆగకుండా వెళ్ళవచ్చు. బాబాయ్ కన్నా ముందే పట్నం చేరతాం మనం." వివరించింది పార్వతి.
భార్య చెప్పింది వినగానే శివరావు కళ్ళు మెరిశాయి.
"సమయానికి ఎంత చక్కగా గుర్తుచేశావు పార్వతీ! ఈ ఆలోచన నాకు రానేలేదు. నువ్వు ఇక్కడే వుండు. పరుగున నేను వాళ్ళింటికి వెళ్ళొస్తాను." అంటూ మారుమాటకి ఆస్కారం ఇవ్వకుండా వేగంగా వెళ్ళిపోయాడు శివరావు.
