రూమ్ తలుపు వేస్తేనే అలాంటి చప్పుడు అవుతుంది.
తల త్రిప్పి చూస్తూనే గబుక్కున లేచి నుంచున్నాను.
బాస్ నన్ను ఈ రూమ్ లోపల నన్ను పెట్టి బయట తలుపులు వేశాడు.
"బాస్!" అంటూ గట్టిగా అరిచాను.
ఎప్పుడు పైకి లేచాడో రామ్ సింగ్ పైకి లేచాడు.
వెనక నుంచి నా మెడ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా బిగించాడు.
"ఇదేమిటి?" అనే లోపలే "మీరూ, మీరూ బలాలు చూసుకోండి!" ఇకిలిస్తూ అన్నాడు బాస్ కిటికీ చువ్వల్లోంచి మమ్మల్ని చూస్తూ.
'బాస్ సంగతి తరువాత, ముందు వీడి బారి నుండి తప్పించుకోవాలి' అనుకున్న నేను, రామ్ సింగ్ వుడుంపట్టు నుండి తప్పించుకోడానికి చాలా తేలిక పద్ధతిని అవలంబిస్తూ నా ఎడమచేతిని క్విక్ గా వెనుకకి పోనిచ్చి వాడి చేతి క్రింద కితకితలు పెట్టాను.
దెబ్బలు నరాలుని బిగదీస్తే, నవ్వు నరాలుని సడలింప చేస్తాయి. ప్రాక్టికల్ గా నేను తెలుసుకున్న నిజం యిది. నా ఉపాయం ఫలించింది. రామ్ సింగ్ నా మెడ చుట్టూ వేసిన చేతిని వదులు చేశాడు. ఇదే సరిఅయిన అవకాశం, చాలా క్విక్ గా రామ్ సింగ్ కి అభిముఖంగా తిరిగాను నేను.
వెంటనే మా మధ్య పోరు ప్రారంభం అయింది.
ముఖాముఖి రెండు దున్నపోతులు తలపడ్డట్టో, రెండు చిరుతలు భీకరంగా పోరు ప్రారంభించినట్లో నేనూ, రామ్ సింగ్ క్రిందా మీద పడుతూ ఎడాపెడా తన్నుకున్నాం.
రామ్ సింగ్ బలం తక్కువదేమీ కాదు. నాతో బానే పోరుసల్పాడు. కానీ, అతనిది క్రింద చెయ్యి, నాది పై చెయ్యి అయింది.
అప్పుడు అరిచాడు రామ్ సింగ్.
"వీడు నా ప్రాణం తీసేటట్టున్నాడు. నన్ను రక్షించు బాస్!" అని.
బాస్ పగలబడి నవ్వాడు.
"నిన్ను రక్షించాలో, భక్షించాలో ఇకపై వీడు చూసుకుంటాడు. నీకు తోడుగా వీడిని యిక్కడే వదిలి వెడతాను. ఇద్దరూ కలసి నన్ను తిట్టుకుంటూ జపం చేస్తారో, కొట్టుకు చస్తారో, ప్రాణ స్నేహితుల్లాగానే అఘోరిస్తారో నాకనవసరం. నిన్నటిదాకా "కోటీ యాభయ్ లక్షలకి" నీవు వారసుడివి. రాత్రి వంటిగంట లోపల వీడు వారసుడయ్యాడు. వంటి గంట తరువాత రాత్రికి రాత్రే నేను ఆ వజ్రాలని అక్కడినుంచి మరోచోటికి తరలించి "కోటీ యాభయ్ లక్షలకి" నేను వారసుడిని అయ్యాను. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు.
నా బుర్రకి ఇంత పదును వుండబట్టే నేను అందరికీ బాస్ నయ్యాను. మీ ఇద్దరూ నాకు జన్మ ఖైదీలు అయ్యారు. మీ ఇద్దరినీ కలుసుకోవాలా, లేదా అన్న విషయం, మరొకసారి ఆలోచించి ఇక్కడికి వస్తాను. అంతదాకా విశ్రాంతి తీసుకోండి." అని నవ్వుతూ చెప్పి కిటికీ తలుపులు వేసేశాడు బాస్.
అవాక్కయి నిలిచి పోయాను నేను.
"మోసం! దగా! వంచన!" పిచ్చి పట్టినట్లుగా హిందీలో అరిచాడు రామ్ సింగ్.
రామ్ సింగ్ అరుపులకి నాలో చలనం కలిగింది.
రామ్ సింగ్ వేపు వెర్రిగా చూశాను.
అదే సమయంలో,
రామ్ సింగ్ నావేపు జాలిగా చూశాడు.
4
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?"
ఎంత సత్యమైన మాట ఇది.
నిన్నటిదాకా బాస్ ప్రక్కన, బాస్ కి కుడి భుజంగా వుండి దర్జాగా తిరుగుతూ వుండే వాడిని. బాస్ పోతే వాడి స్థానం నాకు అన్నంతగా ముఠాలో ముఖ్యుడిగా వుండేవాడిని.
"కోటీ యాభయ్ లక్షలు" మాట దేవుడెరుగు. ఇప్పుడు ఖైదీని మామూలు ఖైదీని కాను, పోలీస్ స్టేషన్ లో వున్న ఖైధీనీ కాను.
నీళ్ళూ, నిప్పులూ లేకుండా అండర్ గ్రౌండులో బంధింప బడిన ఖైధీనిని. కాకపోతే నాకొక తోడు రామ్ సింగ్ వున్నాడు అంతే.
జైలు నుంచి తప్పించుకోవటం చాలా తేలిక.
ఇక్కడ నుంచీ తప్పించుకోవటం మాత్రం మానవమాత్రునికి సాధ్యం కాదు. అండర్ గ్రౌండ్ లో స్పెషల్ గా నిర్మించిన స్పెషల్ రూమ్ ఇది. ఇక్కడో రూమ్ వున్నట్లు బయట ప్రపంచానికి తెలియదు.
ఈ రూమ్ లోకి గాలివచ్చే ఏర్పాటు మాత్రం వుంది. రూమ్ లో అంతకుమించి ఏ సౌకర్యాలు లేవు. రూమ్ గోడలు చాలా దళసరిగా వుంటాయి. తలుపు తీసుకుని వస్తేతప్ప మరో మార్గంలేదు ఈ రూమ్ కి. బలమైన ఇనప కటకటాలతో ఇనప తలుపు వుంది. దానికి ఒక తాళం వుంటుంది. ఇనప తలుపులని మూడువంతులు కవర్ చేస్తూ చెక్క తలుపులు బయటకి వుంటాయి. దానికి ఒక తాళం వుంటుంది.
