వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే వొక రకంగా బాగా అనిపించింది సుబ్రహ్మణ్యానికి_భార్యతో వెనకా ముందు చూసుకోకుండా యెలా అంటే అలా సరసాలాడుకోటానికి వీలుగా వుంటుందని.
రెండు వారాలు గడిచాయి.
శాంతకి వంటా వార్పూ బాగా వొచ్చు. యిల్లు చక్కగా శుభ్రంగా వుంచుతుంది. పక్కావిడతో కలివిడిగా మెలుగుతుంది. వొద్దికగా చక్కగా వుంటుంది.
వొకరోజు సుబ్రహ్మణ్యం యింటికి తిరిగి వొస్తూండగా, వాళ్ళ వీధి మలుపులోకి వొచ్చేసరికి వాళ్ళింట్లోంచి వొకతను బయటికి వొచ్చి అటు వీధిన వెళ్ళటం గమనించాడు. ప్యాంటూ, స్లాకు. పాతికేళ్ళుంటాయేమో అనిపించింది.
యింట్లో కొచ్చేసరికి గదిలో మంచంమీద పడుకుని పత్రిక చదువుకుంటోంది శాంత.
భార్య వొంక పరిశీలనగా చూశాడు. జుట్టు చెరిగి వుంది. చీర నలిగివుంది.
"యేం చేస్తున్నావు శాంతా?" అన్నాడు.
పత్రిక చదువుకుంటున్నా_చూస్తున్నారుగా!" అంది సన్నగా నవ్వి.
"తలుపు బార్లా తీసి?"
"మీరొచ్చే వేళ అని, యిప్పుడే కాఫీకి నీళ్ళు స్టవ్ మీద పెట్టి వొచ్చి_"
"పక్కావిడొస్తే కాఫీ పెట్టి యిచ్చేవేమో అనుకున్నా__"
"అదెట్లా అనుకున్నారు? అసలెవరూ రానిదే యింట్లోకి!" అంది.
ఆ వొచ్చి వెళ్ళినతను_ గుమ్మంలోకి వొచ్చి చిన్నగా పిలిచాడు. యెవరూ వినిపించుకోలేదు. తలుపులు తీసివుంటే నాలుగు అడుగులు లోనకి వేసి ఎలక్ట్రిసిటీ మీటరు చూసి రీడింగ్ నోట్ చేసుకుని చక్కా వెళ్ళిపోయాడు.
అతను పిలిచిన ఆ వేళకి, వంటగదిలో స్టౌ వెలిగిస్తున్న శాంతకి అతను చిన్నగా పిలవటం అదీ వినిపించలేదు.
సాలోచనగా చూస్తూ, "అలాగా!" అన్నాడు.
వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది.
తాగుతూ భార్య వొంక పరిశీలనగా చూస్తున్నాడు. రేగిన జుట్టు, నలిగిన చీర, కందిన చెంప.
మణికట్టు మీద చెక్కిలి ఆనించుకుని పత్రిక చదువుకుంటూ వుండిపోయింది శాంత. అందువల్ల చెక్కిలి కందింది నలిపినట్లుగా.
ఆ రాత్రి భార్యని తాకాలనిపించలేదు సుబ్రహ్మణ్యానికి.
ఆ రెండో రోజు వుదయం "యివాళ్ళ సెలవేసి యింట్లో వుండిస్తాను" అన్నాడు.
"సెలవు యివ్వరేమో" అంది_అదివరకు వొకసారి_ సెలవు పెట్టి యింట్లో వుండిపొండి యీవేళ_అని ఆమె అంటే, మొదటి వారంలో సెలవు యివ్వరు_అని చెప్పటం గుర్తొచ్చి.
"అవును నాకు సెలవు యిచ్చేదీ లేనిదీ దీనికే తెలుసు. నేను సెలవు పెట్టకుండా పైకి వెళ్ళిపోతే_ఎంచక్కా యింట్లో వొక్కథీ ఆ ప్రియుడితో" అనుకున్నాడు.
వొకసారి సినిమా హాల్లో విరామ సమయంలో అతను బయటికి వెళ్ళి వస్తూండగా_భార్య యెవరితోనో మాట్లాడుతోంది. అతనెవరో సీటు కిందకి వొంగి మాట్లాడుతున్నాడు. సాలోచనగా తల పంకించుకున్నాడు సుబ్రహ్మణ్యం.
"నమస్కారమండీ. మేము మీ పక్క వీధిలో వుంటాం. మీవారు బ్యాంకులో పనిచేస్తారు. నా బ్యాంకు పనులకు సంబంధించి యెంతో సహకరిస్తుంటారు." అని కృతజ్ఞతగా చూసి, "మా ఆవిణ్ని తీసుకుని వొకసారి మీ యింటికి వొస్తామండీ" అన్నాడు అతను. "అట్లాగే తప్పక రండి సంతోషం." అంది మర్యాద సూచకంగా చిరునవ్వు ముఖంతో.
యింట్లో చక్కగా ముస్తాబయితే, "యేవిఁటా సావిషోకులు" అంటాడు_మనసులో వేదవతి మెదిలి.
ముస్తాబవకుండా వుంటే_మనసుకి నచ్చక, "యేవిఁటలా జిడ్డు మొహం నువ్వూ_కాస్త శుభ్రంగా తయారవలేవూ? చక్కగా కనిపిస్తే మొగుడన్నవాడు సంతోషిస్తాడనీ లేదు_యేం లేదు" అంటాడు. వొకసారి పక్కావిడ, "వీళ్ళొచ్చేసరికి వొచ్చేసెయ్యొచ్చు. చిన్నాటే. మ్యాట్నీకి వెళ్ళి వద్దాం" అని బలవంతం చేస్తే వెళ్ళింది.
సుబ్రహ్మణ్యం యింటికి రాగానే, ఆ విషయం చెప్పింది. "సినిమాకే వెళ్తే యింట్లో అడుగు పెట్టేనోలేదో వెంటనే అంతిదిగా యెందుకు చెప్తుంది!" అనుకున్నాడు.
మరసటి రోజు ప్రక్కతనితో మాటల సందర్భంలో ఆ సినిమా ప్రసక్తి తెచ్చి "బ్యాంకు వుండిపోయింది గానీ లేకపోతే నిన్న మ్యాట్నీకి వెళ్ళాలనిపించింది." అన్నాడు సుబ్రహ్మణ్యం.
"అహాఁ" అన్నాడు అతను_బస్టాండుకి వెళ్ళి మిత్రుణ్ని రిసీవ్ చేసుకోవాల్సిన తొందరలో.
'యిది ఆమెతో సినిమాకే వెళ్ళుంటే_అనేవాడేగా, అవును వీళ్ళిద్దరూ వెళ్ళారుట_అని!' అనుకున్నాడు సుబ్రహ్మణ్యం.
యెలావున్నా సూటిపోటి మాటలు తగులుతూండటంతో దిగులుగా వుంటోంది శాంత. కానీ విషయం యేమిటో ఆమెకి అర్థం అవటంలేదు. మళ్ళీ తనంటే చాలా యిష్టంగానూ వుంటాడు భర్త.
ఒకరోజు, "మా యింటినుండి వుత్తరం వొచ్చింది. మా చెల్లెకి బాగా జబ్బుగా వుందట" అని అంది శాంత.
"వెళ్తావా?" అన్నాడు.
"మీకు కష్టం కదా వెళ్తే_" అంది.
"అవును_వెళితే నాకు కష్టమేగానీ నీకు హాయేగా_ ఆ ప్రియుణ్ని కలుసుకోవచ్చు. అసలు తనూ వాడూ ఉత్తరాలు రాసుకుంటున్నారేమో! అన్ని ఉత్తరాలూ పోస్టు చెయ్యమని నాకే ఎందుకివ్వదు? కొన్ని కొన్ని వీధి చివరన పోస్టులో వేసి వస్తూంటుంది. తను పైకి వెళ్ళిన వేళ చూసి!" అనుకున్నాడు.
భర్త బ్యాంకుకి వెళ్ళాక తీరికగా యెప్పుడన్నా యింటికి వుత్తరం రాస్తే వీధి చివరన వున్న డబ్బాలో పడేసి వొస్తుంది శాంత.
భర్తని చూసి భయంగా అనిపించి ముభావంగా వుంటే, "అంత యిష్టం లేకపోతే యిక్కడ దేనికి నచ్చినవాళ్ళతోనే వుండొచ్చుగా!" అంటాడు.
"మాటలకి అర్థాలు తీస్తే చాలా వొస్తయ్. యేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు" అంది ఒకసారి.
"కాదూ_నీకిక్కడ బాగుండకపోతే కొన్నాళ్ళు మీ కన్నారింటికెళ్ళి వుండొచ్చుగా_అని. వెనకటి నుండీ నచ్చిన వాళ్ళుగా!" అన్నాడు.
