Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 6


    పెళ్ళిచూపులు జరిగిన మరసటి నెలలో పెళ్ళి జరిగింది. సిటీలోనే చేశారు. నెల్లూరులో చేస్తే పెళ్ళి సందర్భంలో యెవరన్నా పెళ్ళికొడుకు తరపు వాళ్ళతో తార ప్రసక్తి తెస్తారేమోనని. అనుకున్న ప్రకారం పెళ్ళిలో ఐదువేల రూపాయలు యిచ్చేశారు. అన్ని లాంఛనాలు స్థాయి ననుసరించి బాగానే జరిపారు.
    ఆ పై నెలలో శోభనానికి నరహరి వొచ్చి, అల్లుడు సుబ్రహ్మణ్యాన్ని నెల్లూరు వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. మూడు రోజులు యింట్లోనే. సాయంత్రాలు చిన్న బావమరిది అలా వీధిన వూళ్ళోకి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు.
    మొదటి రాత్రి, పాలగ్లాసుతో తెల్ల చీరతో సిగ్గుపడుతూ గదిలో అడుగుపెట్టిన భార్య శాంతని చూసి సంబరపడిపోయాడు, సుబ్రహ్మణ్యం....ఆ రూపం, ఆ సంప్రదాయికపు వొద్దిక చూసి.
    చిన్నగా సరసమాడాడు.
    పక్కమీద చేరాక తనకి మహా తమకంగా వుంది. శాంతని దగ్గరికి లాక్కుని గట్టిగా ముద్దెట్టుకుని....ఆరాటం తీర్చేసుకున్నాడు. ఆమె స్తబ్దుగా వుండిపోయింది.
    యిష్టంలేదేమో యిలా వుండిపోయింది....యెవరినేనా ప్రేమించి, పెళ్ళి చేసుకోదలిస్తే పెద్దవాళ్ళు యీ పెళ్ళి కురిర్చారేమో....అనుకున్నాడు, సుబ్రహ్మణ్యం.
    "మరీ అలా చచ్చుగా వుంటావేం? వుత్సాహం లేకుండా?" అన్నాడు.
    మరి కాసేపటికి, శాంత తనే అతని వీపుమీదకి చెయ్యి వేసింది. దగ్గిరికి జరిగాడు. అతని పెదాలమీద ముద్దెట్టుకుంటూ, అతని కింది పెదవిని పంట నొక్కింది.
    సరిగ్గా వేదవతి అలాగే నొక్కేది. గుర్తొచ్చింది.
    'యిదే మొదలైతే అంత నేర్పు యెలా వొస్తుంది! ఆ ప్రియుడి దగ్గిర నేర్చుకుని వుంటాది' అని అనుకున్నాడు.
    ఆపైన ఆ రాత్రికి తాకకుండా పడుకున్నాడు.
    రెండో రాత్రి....తాకవొద్దనుకున్నాడు గానీ....ఆమె ముఖం చూస్తే ఆ అమాయకత్వం చూస్తే...దగ్గిరికి తీసుకున్నాడు. ఆరాటం తీరాక, "ఇంతకుముందు పెళ్ళిచూపులు జరిగాయా" అన్నాడు.
    "వూఁ" అంది.
    "యెన్నిసార్లు?"
    "మూడు నాలుగు సార్లు."
    "నీకు యెవరూ నచ్చలేదా?"
    "వొకరిద్దరు నచ్చారు."
    అవును, ఆడదానికి వొకడే యేఁవిఁటీ, చాలామంది నచ్చుతారు....అనుకున్నాడు.
    "మరి చేసుకోలేదేం?" అన్నాడు.
    "కట్నకానుకలు కుదరలేదట."
    మూడో రాత్రి__
    రెండు రాత్రులూ గడిపాడుగానీ, మనిషిని సరిగా చూడనే లేదనిపించింది సుబ్రహ్మణ్యానికి. బ్లౌజు హుక్కులు తియ్యటం, చీర పైకి జరపటమేగానీ రూపం కంటినిండా చూడనేలేదని అసంతృప్తిగా అనిపిస్తూంటే__
    చీర కుచ్చిళ్ళు లాగేశాడు. లోపావడా నాడా ముడి వూడలాగేశాడు.
    సిగ్గుతో కంపించి, అతనికి కనిపించకుండా వుండాలని అతనికి అల్లుకుపోయింది అమాంతం.
    "అవురా యెంత యిదీ!" అనుకున్నాడు.
    ఆ యిదిలో శాంతిని బాగా రెచ్చగొట్టాడు.
    ఆమెలోని వయసు పొంగు, పొంగులెత్తి అతనిని గట్టిగా కావలించుకుని ముద్దులతో కదలికలతో, మీదకి జరిగి కవ్వించి పక్కకి జారి అతనిని తనమీడకి లాక్కునీ__సుబ్రహ్మణ్యం మైకంలో పడిపోయాడు.
    అరగంట తరవాత__యింత చిన్న వయసులో శోభనం నాటికే యింత నేర్పూ తెగువా యెలా వొచ్చినట్లు! అని అసంతృప్తిగా పక్కకి జరిగి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.
    శాంత లేచి బట్టలు వేసుకుని మంచంమీద పడుకుని భర్త వీపుమీద తృప్తిగా చెయ్యి వేసుకుని నిద్రపోయింది, రెండు నిమిషాల్లో.
    సుబ్రహ్మణ్యానికి యెప్పుడో తెల్లవారుజామున గానీ నిద్ర పట్టలేదు.
    నాలుగో రోజు ఉదయం తను వొచ్చేస్తూ__'తను వొచ్చేస్తున్నాడు రోజూ వొక్కణ్నే, ఇదేమీ లేకుండా వుండాలి. తనూ అంతేగా__యేమో ఆ ప్రియుడి దగ్గిరికెళ్ళి__' అని ఆలోచన వొచ్చి నీరసించిపోయాడు సుబ్రహ్మణ్యం.
    మహబూబ్ నగర్ వొచ్చి రోజూ బ్యాంక్ కి వెళ్ళివొస్తూనే వున్నాడు గానీ, మనసు చికాకుగా వుంటోంది సుబ్రహ్మణ్యానికి.
    ఓ రోజుని వున్నట్లుండి, తల్లికి వుత్తరం రాశాడు__యీ హోటలు తిండి తినలేక చస్తున్నాను, నువ్వన్నా వొచ్చి ఒండిపెట్టు__అని. వుత్తరం తండ్రి చూసి_కొడుకు అవస్థ గ్రహించి నవ్వుకున్నాడు. వియ్యంకుడికి వుత్తరం రాశాడు_అబ్బాయి అక్కడ వొక్కడే వుంటున్నాడు. వాడికసలే హోటలు తిండి సరిపడదు. అమ్మాయిని త్వరగా కాపరానికి పంపితే బాగుంటుంది_అని. అట్లాగే, మంచి ముహూర్తం చూసి యేర్పాట్లు చేసి నేరుగా మహబూబ్ నగర్ కే తీసుకొస్తాం. యిల్లు చూసి వుంచమనండి_ అని నరహరి రాశాడు. ఆ మాటే శాయోజీరావు కొడుక్కి రాశాడు.
    సుబ్రహ్మణ్యానికి మహదానందంగా అనిపించింది. బ్యాంకులో అందరికీ చెపాడు ఇల్లు కావాలని. పొద్దుటా, సాయంత్రం చీకటిపడేదాకా తిరిగాడు యింటికోసం వూరంతా గాలిస్తూ.
    వారం రోజుల్లోనే ఓ పోర్షన్ తీసుకున్నాడు. వరసగా రెండు గదులు. వంట గది. ఆ వెనక వొక గదిమేర ఖాళీస్థలం. దాన్లోనే బాత్రూం. మరుగుదొడ్డి. మరుగుదొడ్డి సెప్టిక్ టాంక్ కాదు. బక్కెట్ తీసుకుని రోజూ మనిషి వొచ్చి శుభ్రం చేసి తీసుకుపోవాలి. అందుకు వీలుగా వెనకవైపున తలుపు. ఆ తలుపుకి అవతల సన్న సందులాంటి వీధి.
    కాపరానికి కావాల్సిన సామగ్రి_మంచం, పాత్ర సామగ్రి, కిరోసిన్, స్టవ్వులు గట్రా అన్నీ పరిమితంగా తన శక్తిని బట్టి కనీసావసరం మేరకు కొని_కూతుర్ని తీసుకుని వొచ్చాడు నరహరి. అతని భార్య కూడా వొచ్చింది. భార్యా అత్తమామలూ యింట్లో వుంటే సుబ్రహ్మణ్యానికి తృప్తిగా అనిపించింది. కోర్టు కేసులు అర్జంటువి వున్నాయి వీలుపడదని రెండోరోజునే వెళ్ళిపోయాడు అతని మామ వేదాంతం నరహరి.
    వారం రోజుల తరవాత_యింట్లో అందరూ దీని తరవాతివాళ్ళే. సరిగా చూసుకోలేరు. నేను లేకపోతే కష్టం_అని వెళ్ళిపోయింది అతని అత్త కూడా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS