Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 6

రెండు సీసాలు దరిదాపు ఒకే సైజువి కావటం పార్వతి అంతక్రితం ఎసెన్స్ సీసాని గుర్తుపెట్టుకునే అంతగా చూడకపోవటం జరగబోయే ఘోర ప్రమాదానికి బీజం నాటినట్టు అయింది.

పాయిజన్ అని సీసాపై లేబుల్ మీద రాసివుంది. పార్వతికి ఇంగ్లీషు రాకపోవటం వల్ల పాయిజన్ అన్న ఆంగ్ల అక్షరాలు చదవలేక పోయింది. సమయానికి దిక్కుమాలిన జలుబు. పని తొందరలో శివరావు బైటికి వెళ్ళటం దానా దీనా మధురంగా వుండే తియ్యని హల్వా కాస్త విషతుల్యం అయింది.

జరిగింది అలా జరిగిపోయింది.

ఇహ చూడాల్సింది ఏం జరగాలా అన్నదే. అంతే కాదు ఏం చేయాలా అన్నది కూడా.

"పార్వతీ!" శివరావు పిలిచాడు.

పార్వతి "ఏమండీ!" అంటూ మరింతగా ఏడ్వటం మొదలుపెట్టింది.

"పార్వతీ! ముందు నేను చెప్పేది విను" అన్నాడు శివరావు.

"ఏమి వినమంటారండీ! లేక లేక పుట్టిన నా నోముల పంట, వరాల తండ్రిని నా చేతులారా... అయ్యో భగవంతుడా! నేనేం పాపం చేశానయ్యా! ఈ దరిద్రపు చేతులతో కన్న కొడుక్కే విషం పెట్టాను కదయ్యా! అయ్యో..."

పార్వతి మాట వినిపించుకోకుండా అదే పనిగా ఏడ్వటం చూసి శివరావు టేబుల్ మీదనున్న పాయిజన్ సీసాని చేతిలోకి తీసుకున్నాడు. "పార్వతీ! నేను విషం తాగుతున్నాను" అంటూ గట్టిగా అరిచాడు.

 పార్వతిలో చలనం కలిగింది. "అయ్యో!" అంటూ భర్త మీదపడి సీసాని లాక్కోబోయింది.

శివరావు సీసాని చేత్తో ఎత్తి పట్టుకుని "పార్వతీ! నేను చెప్పేది ముందు విను" అన్నాడు.

భర్త స్వరం కరుకుగా వినరావటంతో పార్వతి నోరు మూసుకుని శివరావు ముఖంలోకి బేలగా చూస్తూ వుండిపోయింది.

"చావు దేనికి పరిష్కారం కాదు అవునా?"

"ఇప్పుడు యీ మిట్ట వేదాంతం దేనికండి?"

"అవునా కాదా! సమాధానం చెప్పు."

భర్తకి మతిపోలేదు కదా! అని అనుకుంటూనే "ప్రతి విషయానికి చావు పరిష్కారం అయితే ఈ లోకంలో అందరూ ప్రతి చిన్న విషయానికి చావటానికే చూస్తారు. ప్రయత్నంతో పరిష్కారానికి చూసుకోవాలి కానీండి చచ్చి మాత్రం సాధించలేరు. చచ్చి సాధించామనుకోటం పిచ్చితనం" అంది పార్వతి.

"అందుకే నేను చావను" అన్నాడు శివరావు.

పార్వతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. అయోమయంగా చూస్తూ వుండిపోయింది
                                         3

"పార్వతీ!"

 "ఊ."

"సమయం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను."

"చెప్పండి!" వింటానన్నట్లు చూసింది పార్వతి.

"నేను ఇప్పుడు బయలుదేరి దొరికిన బస్సు అందుకుని వెళతాను. పండరీ కాక్షయ్య బాబాయ్ కన్నా ముందు పట్నం చేరే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం ఫలించి దైవం నాయందు వుండి, నాకు మేలు జరిగితే సరి, లేకపోతే__"

పార్వతి బేలగా చూసింది భర్త వైపు.

"పార్వతీ! జరగానిది జరిగితే మాత్రం నేను ఒక్క క్షణం కూడా బ్రతకను. నాతోపాటే నీవు కూడాను." ఆవేశంగా అన్నాడు శివరావు.

 పార్వతి మూగదానిలా నుంచుండిపోయింది.

తలుచుకోటానికే భయపడే దృశ్యం అది. తలచుకున్నా తలచుకోకపోయినా, మనసు మళ్ళించాలని చూసినా అది వృధా ప్రయత్నమే. మనిషి మనసు అంతర్నేత్రం. దాని మానాన అవి పనిచేస్తూనే వుంటాయి. ఆప్యాయంగా హల్వా తిని మరుక్షణంలో గిల గిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచిన చంద్రం, విగత జీవుడై నేలమీద పడివున్న చంద్రం, చంద్రం రూపం కళ్ళకి అస్పష్టంగా కానవస్తున్నది.

"పార్వతి! ఈ సీసాలో మిగిలిన విషం చెరిసగం త్రాగుదాం. అంతవరకు ఈ సీసా నా జేబులో భద్రంగా వుంటుంది. నువ్వు జాగ్రత్తగా వుండు. నేను వెడుతున్నాను." అంటూ వున్నపాటున బయలుదేరాడు శివరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS