"నా చెయ్యి జారేటట్లుంది. వామ్మో చేయి జారితే ఇంకేమైనా వుందా!" బాస్ వాపోయాడు.
ఏదో జరగరానిదే జరిగింది. అంతవరకు ఖాయం. అప్పుడప్పుడు తిక్క వెధవలాగా బాస్ ప్రవర్తిస్తుంటాడు. వాడికి తిక్క పుట్టినప్పుడు అడ్డువస్తే మరింత ఆలస్యం తప్ప అసలు విషయం తెలియదు అనుభవంలో ఈ విషయం నాకు తెలుసు కాబట్టి మవునం వహించాను.
బాస్ చెప్పుకుపోతున్నాడు.
"నిన్నెందుకు పొద్దుటే రమ్మని కబురు చేశాననుకుంటున్నావ్. రామ్ సింగ్ పరిస్థితి బాగుండలేకనే. వకటా రెండా. సరీగ్గా వక కోటి యాభై లక్షలు. వాడు హరి అంటే మనపని హరిహరి. నేను వాడిని కొట్టిన దెబ్బలకి కడుపులో నరాలు ఇప్పుడు చిట్లాయో లేక వాడికేదయినా కేన్సర్ లాంటి మాయరోగం వుందోగాని భళ్ళుభళ్ళున భోజనం పూర్తి కాంగానే అన్నంతోపాటు ఇంత నెత్తురు కక్కుకున్నాడు. నాకు హిందీ వచ్చి చావదు. వాడికేమో తెలుగువచ్చి చావదు. ఇంకెవరినయినా తీసుకెళ్లి చూద్దామా అంటే మన రహస్యం తెలిసి చస్తుందాయె..."
"ఇప్పుడు రామ్ సింగ్ కి ఎలా వుంది?" బాస్ మాటలకి అడ్డు తగిలి ఆతృతగా అడిగాను.
"ఆ తర్వాత రాత్రి బాగానే వున్నాడు. రాత్రంతా వాడికి కాదు కోటి యాభై లక్షలకి కాపలా కాయలేక చచ్చాననుకో. లుంగీ చుట్టుకుని పడుకున్నాడు. పిలిస్తే పలకడు. అలా అని చావలేదు బ్రతికే వున్నాడు. నీవే ఏదో వక ఉపాయం ఆలోచించి వాడి నోట్లోంచి నిజం రప్పించాలి. అందుకే పొద్దుటే కబురంపాను."
"అరె!" అన్నాను నేను, ఆత్రుత నటిస్తూ.
బాస్ ముఖంలోని ఆత్రుతా ఆందోళనా చూస్తుంటే నాకు చెప్పలేనంత అదేదో ఇదిగా వుంది. రామ్ సింగ్ ని బాస్ బాగా కొట్టాడు. పొట్టలో తగలరానిచోట ఎక్కడో దెబ్బ తగిలి వాడికేదో జరగరానిదే జరిగి వుంటుంది. ఈ దెబ్బతో రామ్ సింగ్ 'హరీ' అంటే బాస్ పని "హరి, హరి!" అవుతుంది. అందుకనే వాడు గాభరా పడి ఛస్తున్నాడు. నా మటుకు నాకు లోలోపల పట్టరానంత ఆనందంగా వుంది.
"కోటీ యాభై లక్షలు" చెయ్యి జారిపోతాయేమో అని హడలి ఛస్తున్నాను. నువ్వు వాడికి థైర్యం చెప్పి, బ్రతుకు మీద డబ్బుమీద ఆశ చూపి, నాతో పార్టనర్ గా ఇప్పిస్తానని ఆశ పెట్టి వాడి నోట్లోంచి ఎలాగో అలా నిజం కక్కించాలి. అందుకే నీకు కబురు పంపించాను. నీకు లౌక్యం తెలుసు. తొందరగా వెళదాం పద!" అన్నాడు బాస్.
"పద బాస్! ఇప్పుడు ప్రతి క్షణం ఎంతో విలువయింది. రాత్రే నాకు కబురు చెయ్యాల్సింది" నేను కూడా కంగారు నటిస్తూ అన్నాను.
ఆ తరువాత__
నేనూ, బాస్ కలిసి, మేము రహస్యంగా అండర్ గ్రౌండ్ లో ఏర్పరచిన రూమ్ దగ్గరకి నడిచాము. దాన్ని రూమ్ అనే కన్నా పోలీసు వాళ్ళ స్పెషల్ సెల్ అంటే బాగుంటుంది. ఆ రూమ్ లో బంధించబడిన వాడిని రకరకాల శిక్షలకి గురి చెయ్యటం, ఆకలి దప్పులతో ఎవడైనా చచ్చిపోయేదాకా అక్కడే పడేసి వుంచటం, సరాసరి అక్కడి నుండి పరలోకానికి పంపటం ఇలాంటివెన్నో చెయ్యటానికి బాస్ ఆ రూమ్ తన ఆధీనంలో వుంచుకున్నాడు. అలాంటి రూమ్ ఒకటి వున్నట్లు మా ముఠాలో చాలా కొద్దిమందికే తెలుసు. పూర్తిగా ఆ రూమ్ ని బాస్ తన ఆధీనంలో వుంచుకున్నాడు. ఆ రూమ్ తాలూకా తాళం, తాళం చెవులూ తన దగ్గరే వుంచుకుంటాడు. ఇరువురం కలిసి అక్కడికి వెళ్ళాం.
మేము వెళ్ళి చూసేసరికి రామ్ సింగ్ కాళ్ళూ చేతులూ బార్ల జాపి వెల్లకింతలా పడుకొని వున్నాడు. ముఖం గోడ ప్రక్కకి తిరిగి వుంది.
ఆ విధంగా పడుకుని వున్న రామ్ సింగ్ ని చూడగానే బాస్ గుండె బేజారెత్తి పోయింది. నిల్చున్న వాడు అలాగే గుమ్మం దగ్గరే నిలుచుండిపోయాడు.
"వాడు ఎలా వున్నాడో నువ్వెళ్ళి కదిలించి చూడు!" నాలుక పిడచకట్టుకొని పోతూండగా ఎలాగో అలా మాట పూర్తి చేయగలిగాడు బాస్.
రామ్ సింగ్ పరిస్థితి కన్నా బాస్ పరిస్థితి చూస్తూ వుంటే నాకు లోలోపల మాహా ఆనందం వేసింది. కోటీ యాభై లక్షలకి వారసుడుని నేనొక్కడినే అయినప్పుడు, బాస్ లాంటి మరొకడికి ఆ అదృష్టం ఎలా పడుతుంది?
రామ్ సింగ్ ఈ లోకంలో లేకపోతే ఈ రహస్యం అతనితోనే అంతమయింది అనుకుంటాడు బాస్ గాడు. నన్నేమాత్రం అనుమానించడు. నేను వూరుకోకుండా మధ్య మధ్య సన్నాయి నొక్కులు నొక్కుతుంటాను.
"అనవసరంగా కోటీ యాభయ్ లక్షలు చేజారిపోయాయి. ఈ రామ్ సింగ్ ని అంత గట్టిగా కొట్టకుండా వుండవలసింది."
ఈ మాట అంటున్న బాస్ ముఖం చూడాలి నాసామి రంగా!
"ఏమిటయ్యా! వెళ్ళమంటే యిక్కడే నుంచున్నావ్, త్వరగా వెళ్ళి చూడు."
ముఖం దిగులుగా పెట్టుకుని రూమ్ లోపలికి నడిచాను. ఈ మాత్రం నటన అవసరమే కదా! రామ్ సింగ్ ప్రక్కనే మోకాళ్ళ మీద కూర్చుని రామ్ సింగ్ ని కుదుపుతూ,
"రామ్ సింగ్ భాయ్! రామ్ సింగ్ భాయ్" అని పిలిచాను. రామ్ సింగ్ లో చలనం లేదు.
అదే సమయంలో 'కిర్' అని వెంటనే 'క్లిక్' అని చప్పుడు అయ్యింది.
