Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 5


    "యింట్లో ఒక్కదానికి యేమీ తోచకపోతే టైపు హయ్యరు నేర్చుకో" అన్నాడు రవి_ఒక రోజున.
    "నేర్చుకోమంటావా" అంది.
    "నీయిష్టం, నేర్చుకోవాలనిపిస్తే. చేస్తే యింట్లో పనులుండకపోవు__నాల్రోజులు పోతే మనిద్దరమే వుండం!" అన్నాడు.
    "పండు కావాల్నా? బిడ్డెనా?" అంది గంగి.
    "అదేదో నీ చేతుల్లో వున్నట్లు అడుగుతున్నావు!"
    "ఆడ కాకుంటె మగ. నేనె కద కనేది" అంది.
    "ఆ గులాబీ చెట్టుకు నీళ్ళు సరిగా పోస్తున్నావా!" అన్నాడు రవి.
    "దేనికి? అది యెప్పుడు అట్లనే వున్నది!" అంది గానీ రోజూ, నీళ్ళు పోసి కుదురు సరిగా చేస్తూంటుంది.

                                71

    సుబ్రహ్మణ్యం....అటు వేదవతి భర్త తన్నులతో యిటు తండ్రి తన్నులతో వొళ్ళు హోనం ఐపోయి, పదిరోజులపాటు మంచం మీదనుంచి దిగలేను....వొంట్లో బాగా లేదనిచెప్పి, ముసుగెట్టుకుని.
    యింట్లో ఆ వేళకి తల్లీతండ్రే వున్నారు. వాళ్ళ వొదిన పక్కవాళ్ళింట్లో వుంది. చెల్లెళ్ళూ, తమ్ముళ్ళూ స్కూళ్ళనుంచి తిరిగిరాలేదు. అన్నకి వుద్యోగం మల్కాజిగిరీ వైపు. యింటికి వొచ్చేసరికి ఏడు దాటుతుంది.
    అందువల్ల ఆ విషయం తల్లికీ, తండ్రికీ తప్ప యింట్లో మరెవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ, యింట్లో యెవరితోనూ అనలేదు.
    తండ్రి ఆఫీసుకి వెళ్ళేవరకూ లేచేవాడుకాదు. భర్త ఆఫీసుకి వెళ్ళగానే తల్లి లేపి సపర్యలు చేసినట్లుగా బుజ్జగించి గారాబుగా చూసేది. కాలకృత్యాలు ముగించుకుని మళ్ళీ ముసుగెట్టేసుకునేవాడు. తిండికీ, కాఫీకే లేవటం. అలా పది పన్నెండు రోజులకి లేచి తిరగాల్సి వొచ్చింది. తండ్రిని తప్పించుకుని తప్పించుకుని తిరిగేవాడు. కొడుకు యెదురుపడినా గమనించనట్లుగా వెళ్ళిపోయేవాడు తండ్రి.
    బుద్ధిగా చదువుకునే తత్వమేమో....బాగానే పరీక్షా రాసినందువల్ల ఎం.ఏ.లో మంచి మార్కులొచ్చాయి. పరిక్షలు ఆ గొడవకి ముందే జరిగిపోవటం మేలైందనుకున్నాడు. ఎం.ఏ. ఫైనల్లో వుండగా బ్యాంకు పరిక్షలు రాశాడు. రైల్వే సర్వీసు కమిషన్ పరిక్షలు కూడా రాశాడు.
    లేచి ఎప్పుడన్నా సాయంత్రం అలా వీధిన నడుస్తూ పోయి.... సుదర్శన్ థియేటర్ ముందో సంగమ్ థియేటర్ ముందో సినిమా బొమ్మలు కనిపించి....వాటిల్లో అర్ధనగ్న చిత్రాలు, దిసమొల బొమ్మలు కనిపించి వేదవతి గుర్తొచ్చి; తల విదిలించుకుని గిరుక్కున తిరిగి చరచరా నడిచి యింట్లోకి వొచ్చిపడేవాడు. ప్రబంధ కావ్యాలలో శృంగారపద్యాలు చదువుకుని తృప్తిపడటం తప్ప....వేదవతి పరిచయమై తనని దించేవరకూ అతనికి ఆడ స్పర్శ తెలియదు.
    అలా నాలుగు నెలలు గడిచేసరికి బ్యాంకు సెలక్షను వొచ్చింది. మహబూబ్ నగర్ లో పోస్టింగ్ ఆర్డర్స్ యిచ్చారు.
    డిగ్రీలు చేత పుచ్చుకుని సంవత్సరాల తరబడి వుద్యోగం లేకుండా వేలాదిమంది నానా అవస్థలూ పడుతూంటే, యిలా వుద్యోగం వొచ్చినందుకు మహదానంద పడిపోయారు తండ్రీ తల్లీ.
    "మన సుబ్బిగాడిది మొదట్నుంచీ అదృష్టజాతకమే. ఎం.ఏ.లో కూడా ఫస్ట్ క్లాస్ లో పాసైపోయాడు. దీన్లో కూడా అంచెలంచెలుగా చిగురుకంటా సాగిపోయి....ఐదారేళ్ళలో ఆఫీసరై పోతాడు చూడండి?" అన్నాడు తండ్రీ, శాయోజీరావు సంతోషంగా.
    వెళ్ళి చేరాడు.
    ఓ చిన్న గది తీసుకుని వుంటున్నాడు. హోటల్లో భోజన, అతనుంటున్న యింటి అతనికి వూళ్ళో బట్టల దుకాణం వుంది. అతని భార్యకి ముప్ఫయ్ ఐదేళ్ళుంటాయి. యిద్దరు చిన్నపిల్లలు. హుషారుగా వుత్సాహంగా వుంటుంది. సుబ్రహ్మణ్యం కనిపిస్తే సాఫీగా చక్కగా పలకరిస్తుంది. ఎప్పుడన్నా పిండివంటలేమన్నా ఓ ప్లేట్లో పెట్టి పంపిస్తుంది. అలాంటప్పుడు భయపడిపోతాడు లోలోన.
    అంతలో, రెండు రోజులు సెలవుపెట్టి యింటికి జరూరుగా వొచ్చి వెళ్ళమని తండ్రి దగ్గిర్నుంచి ఉత్తరం వొస్తే వెళ్ళాడు.
    పెళ్ళి సంబంధం. నెల్లూరు ప్రాంతం. ఇంటర్ దాకా చదువుకుంది. 'సంసార పక్షం'గా వుంటుంది. వంటా వార్పూ చక్కగా వొచ్చు.
    ఆ పిల్ల తార చెల్లెలు. తార తల్లిదండ్రులు వెనకకూడా కూతురు దగ్గిరికి పెద్దగా రాలేదు. తార ప్రోత్సహించేదికాదు....వొకటి రెండు పర్యాయాలు తండ్రి వొచ్చివెళ్ళాడు. ఆపైన యిటీవలి కాలంలో తార జీవితం తెలిశాక....నలుగురితోనే కాక, ఆఖరికి యింట్లోకూడా తార పేరెత్తటం మానేశారు. ఛీ....అని అసహ్యించుకున్నారు. తండ్రి నరహరి యీసారి సిటీకి వొచ్చి వొక పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పివెళ్ళాడు, "మంచి సంబంధం కుదిర్చితే బాగా తృప్తి పరుస్తాన"ని. ఆ పెళ్ళిళ్ళ పేరయ్యకి నరహరి గురించి....నెల్లూరి ప్రాంతం గురించీ యేమీ తెలియదు. తూర్పు ప్రాంతాల నుంచి వొచ్చి సిటీలో స్థిరపడి పెళ్ళిళ్ళు కుదుర్చుతూ మనుగడ సాగిస్తున్నవాడు. వొక సందర్భంలో సుబ్రహ్మణ్యం తండ్రి జంధ్యాల శాయోజీరావు పరిచయం అయ్యాడు. మాటల సందర్భంలో అతని పిల్లల వివరాలు తెలుసుకున్నాడు. యిప్పుడీ పిల్ల గురించి తెలిసి శాయోజీరావుని కలుసుకుని "ఐదువేలు కట్నం ఇస్తారు పెళ్ళిలోనే. కేషు.మీదా, పెద్దసంసారం, అందరికీ లాంఛనాలు చూడాలంటే మాటలా, బోలెడవుతుంది. అవన్నీ భరించాలి కదా...." అంటూ నచ్చజెప్పి "పిల్లని చూసుకోండి. నచ్చితేనే. పిల్లతండ్రి నెల్లూరు ప్రాంతంలోనే లాయరు. మీకు అక్కడిదాకా వెళ్ళాల్సిన శ్రమలేదు. యీ వూళ్ళోనే పెళ్ళిచూపులు యేర్పాటు చేయిస్తాను" అని అన్నాడు.
    తీరా సంబంధం నచ్చుతుందో లేదో నలుగురమైనా వెళ్ళాలి ఖర్చులు పెట్టుకుని అంత దూరం....అని సంశయించి, పెళ్ళిచూపులు సిటీలోనే యేర్పాటు చెయ్యమన్నాడు శాయోజీరావు.
    ఆ పెళ్ళిళ్ళ పేరయ్య తన యింట్లోనే యేర్పాటు చేశాడు. మరికాస్త గిట్టుబాటు అవుతుందన్న ఆశతో.
    పెళ్ళిచూపులకి....సుబ్రహ్మణ్యంతోపాటు తల్లీ తండ్రీ వొకచెల్లెలు వెళ్ళారు. శాయోజీరావు పిల్లతండ్రి నరహరితో స్వయంగా మాట్లాడాడు. అతనికి అన్నివిధాలా నచ్చింది. పిల్లకూడా__యెరుపనుకుంటే యెరుపు__చామనచాయ అనుకుంటే చామనచాయ.
    అసలు, తారకి మిగతా పిల్లలకీ తీరుతెన్నులోనూ అభిరుచిలోనూ పోలికేలేదు. తార, యీ బికారి కొంపలో తప్ప పుట్టాను....అనుకుంటుండేది....తన పెళ్ళిచూపుల సందర్భంలో ఆ మాటే అంది. యిటీవల, "దానిమాట అక్షరాలా నిజం. అది మనబిడ్డ కాదు" అన్నాడు నరహరి వొకటి రెండుసార్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS