Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 5

 పుల్లారావు చెప్పిన చివరి మాటలు వినిపించుకోలేదు శివరావు. పండరీకాక్షుడు రెండుగంటల క్రితమే వూరు వెళ్ళాడు అన్నమాట వినిపించుకున్న క్షణానే అలా నిలువు గుడ్లేసుకుని వుండిపోయాడు.

"ఏమండీ! అసలేం జరిగిందండీ!" అంటూ పార్వతి చేయి పట్టుకుని కుదపటంతో శివరావులో చలనం కలిగింది. అయోమయంగా వక్కక్షణం భార్య ముఖంలోకి చూసి అంతలోనే తెలివితెచ్చుకుని "పద" అంటూ ఇంట్లోకి దారి తీశాడు.

"ఏం జరిగిందో చెప్పకుండా యిదంతా ఏమిటండీ! నాకేదో భయంగా వుంది చెప్పండి..." అంటూ పార్వతి కాస్త గాభరాగానే గట్టిగా అడిగింది.

ఆ సీసాలో వున్నది ఏలకుల ఎసెన్స్ కాదు పార్వతీ!"

"మరి....!"

"విషం."

"ఆ__!"

అవును పార్వతీ! గరళం కన్నా ఘాటైన విషం అది."

మీరే చెప్పారు కదండీ. అలమరలో సీసా వుంది తీసుకోమని?" పార్వతికి యింకా విషయం అర్థంకాకనే అడిగింది.

"పండి కొక్కులు యీ మధ్య పొలాలలో ఎక్కువయి పంటను నాశనం చేస్తున్నాయి కదా! మందు పెడుతుంటే అవి చావటం లేదు. ఈ మధ్య కొత్తగా నీళ్ళులాగా వుండి ఏ వాసనా లేని ఈ మందు మార్కెట్ లోకి వచ్చింది. ఖరీదు కూడా కాస్త ఎక్కువే. రెండే రెండు చుక్కలు చాలు. అర్ధశేరు అన్నంలో కలిపి పెట్టటానికి... ఏలకుల ఎసెన్స్ వున్న సీసా మధ్య గదిలో చిన్న అలమరాలో పెట్టాను. ఈ విషాన్ని పెద్ద అలమరాలో వుంచాను. ఈరోజు తీసుకెళ్ళి గవర్రాజు కిద్దామనుకుని పని తొందరలో మరచిపోయాను..." శివరావు రెండు చేతుల్లో తలకాయ యిరికించుకుని కళ్ళు రెండూ గట్టిగా మూసుకుని మూగబోతున్న కంఠాన్ని పెగిలించుకుని చెప్పుకుపోతున్నాడు.

విషం అన్న విషయం వరకూ అర్థమైంది. ముఖ్యంగా తన వకానొక బిడ్డకి ఎంతో యిష్టంగా తినే హల్వాలో తన చేతులారా విషం కలిపిన హల్వాని చేసి పంపింది. ఆ విషపూరితమైన హల్వా చంద్రం తింటే...? ఆపై పార్వతీ ఆలోచించలేదు భర్త చెప్పేది వినిపించుకోలేదు. దోసిట్లో ముఖం దాచుకుని వక్కసారిగా భోరుమంది.

పార్వతి పెద్ద పెట్టున ఏడ్వటంతో శివరావుకి పూర్తి తెలివి వచ్చినట్లయింది. ముందు జరగ వలసినది చూడకుండా తెలివితక్కువగా తీరుబడిగా మాట్లాడుతూ కూర్చున్నా అన్న ఆలోచన కలగటంతో కూర్చున్న చోటునుంచి టక్కున పైకి లేచాడు.

పల్లెటూరిలో వుండే శివరావుకి పార్వతికి ఏలకుల ఎసెన్స్ లాంటివి ఊహా మాత్రం కూడా తెలియవు. పార్వతి ఎప్పుడు ఏ తీపి పిండి వంటలు చేసినా నాలుగు యాలుక్కాయలు కొట్టి పిండి వంటలో వేయటం వరకు తెలుసు.

చంద్రాన్ని పట్నంలో వుంచి చదివించటం వల్ల తరచు శివరావు పట్నం వెళ్ళి పచ్చళ్ళు పిండివంటలు యిచ్చి వస్తుండేవాడు.

చంద్రం ఓసారి షాపుకి వెళితే అక్కడ వకావిడ స్వీట్స్ లో వేసే రకరకాల రంగులు చాలా రకాల ఎసెన్స్ లో కొనటం చూసి ఏలకులతో చేసే ఎసెన్స్ సీసాని కొన్నాడు. గరిటెడు నీళ్ళలో రెండు డ్రాప్స్ ఈ ఎసెన్స్ వేసి పిండి వంటలో కలిపితే చాలు ఎక్కువ వేయనక్కర లేదని..." తెలుసుకుని ఆ విషయం తండ్రితో వివరంగా చెప్పి సీసా యిచ్చి పంపించాడు.

పార్వతి పైసా అంత కుంకం బొట్టు పెట్టుకుంటుంది. షాపులో బొట్టు బిళ్ళలు చూసి వాటిని కూడా ఓ ప్యాకెట్ కొని పంపించాడు. రూపాయి కొచ్చిన బొట్టు బిళ్ళలని చూసి "పిచ్చి కన్నకి నేనంటే ఎంత ప్రేమో" అనుకుంది.

శివరావు ఎసెన్స్ సీసాని పార్వతికి చూపించి తనే అలమరాలో పెట్టాడు. పార్వతి పిండి వంట చేసేటప్పుడు తను దగ్గర వుండి రెండు చుక్కలు వేయవచ్చనుకున్నాడు. కాని సమయానికి హడావిడిగా బైటికి వెళ్ళటం, అలమరాలో సీసా వుంది తీసుకోమని పార్వతితో చెప్పటం జరిగింది.

కొత్తగా మార్కెట్ లోకి పంది కొక్కులని క్షణాల్లో చంపే మందు వస్తే రుచి, వాసనా లేకుండా నీళ్ళులాగా వుండే ఆ మందుని ఎవరి ద్వారానో తెప్పించాడు శివరావు. ఆ మందు సీసాని గవర్రాజు కిద్దామనుకున్నాడు. ఈరోజు లేచిన దగ్గర నుంచీ హడావిడి పనులు అయ్యాయి. ఆ సీసా విషయమే మరచిపోయాడు శివరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS