వాడి అరుపులతో తెలివి తెచ్చుకుని స్పీడు తగ్గించాను. నేనేం చేయను! కోటి యాభయ్ లక్షలు నా కళ్ళముందు కదలాడుతూ వుంటే నా మనసు నా వశం తప్పి గాలిలో పయనిస్తున్నాను. దట్సాల్. అది సహజం.
ఇహపై నేను చాలా జాగ్రత్తగా వుండాలి. కోటి యాభయ్ లక్షలకి ఏకైక వారసుడిని... యజమానిని... గుంభనంగ రిజర్వ్ డ్ గా వుండాలి. కూనారి వెధవ పల్లేరుకాయ ముఖము వీడూను. నా ఫేసులో మార్పు నా నడతలో మార్పు ఒక్క చూపులో గ్రహించాడు. బాస్ ముండా వాడివి వెధవ తెలివితేటలు. ముఖం చూడకుండానే గ్రహిస్తాడు. ఎప్పటిలా అసలేం జరగనట్లు వుండాలి. వుండితీరాలి. ఇది ముఖ్యం.
నేనో నిర్ణయానికి రావటం స్కూటర్ ని నెమ్మదిగా ఆపటం చేశాను.
"ఒక్కరోజులో నీలో ఎంతమార్పు చిన్న గురువా!" స్కూటర్ దిగుతూనే ఆశ్చర్యంతో అన్నాడు బలరాజ్.
నాలో నాకు తెలియకుండానే చిన్న ఉలికిపాటు కొద్దిగా కలవరం. దేవ రహస్యం ఏదో కనిపెట్టినట్లు వీడేమిటి నన్ను పట్టుకున్నాడు?
"నాలో మార్పా! బహుశా ఆ మార్పేదో నీలో వచ్చినట్లు వుంది. ఇందాకనుంచి చూస్తున్నాను కదా! ఒకటే గోల. ఇంతకీ నాలో ఏం మార్పు వచ్చింది. ఏం చూసి గ్రహించావు?" కాస్త చిరాకు ప్రదర్శిస్తూ అడిగాడు.
"రాకెట్ వేగంతో స్కూటర్ నడిపావు. ఇది రాకెట్ కాదు స్కూటరు అని లబ్బున గోలపెడితే నత్త నడకలాగా స్కూటర్ ని పోనిచ్చావు. ఎప్పుడు స్కూటర్ ఆపినా సడన్ బ్రేక్ కొట్టి ఆపేవాడివి. మరి ఇప్పుడేమో పువ్వుని ముట్టుకున్నంత సున్నితంగా ఆపావు. నీలో ఎంత మార్పు! ఎంత మార్పు! ఎంతెంత మార్పు!"
బలరాజ్ అలా అంటుంటే నా బుర్ర వేగంగా పనిచేసింది.
"నీతో చెపితే కొంప మునగదనుకో. అందుకే చెప్పేస్తున్నాను. నిన్న సాయంత్రం...
నామాట పూర్తికాకముందే వాడే అన్నాడు "లక్ గా ఏదన్నా దొరికిందా?"
"ఆ దొరికింది ఎవడో వాడిపారేసిన్ బ్లేడు" వ్యంగ్యంగా అని ఆ వెంటనే మాట పూర్తిచేశాను. "నిన్న సాయంత్రం ఓ అందమయిన అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ఫాలో అయి అడ్రస్ పట్టుకుని ఆ తర్వాత ఓ పట్టు పడదామని అనుకున్నానో లేదో కారెక్కి తుర్రు మంది. సమయానికి నా దగ్గర సైకిలన్నా లేకపోయింది"
"అద్గదీ సంగతి చిన్నగురూ! ఆ పిల్లదాన్ని చూసిన దగ్గరనుంచి మనసు మనసులో లేదు అంతేనా?"
"అంతే."
"నీకంత పడ్డదేది నీకు దూరం కాదులే చిన్న గురూ! ఇవాళ కాకపోతే రేపు" పెద్ద ఆరిందలా భరోసా యిచ్చాడు బలరాజ్.
"చాల్లే. బాస్ దగ్గరకు వెళుతున్నాము ఇంక నోరుమూసుకో పెద్ద తరహాగా వాడిని మందలించి బాస్ స్థావరం వేపు నడిచాను.
"బాస్ నాకింకోపని అప్పగించాడు. నేవెళుతున్నాను. నీవు వెళ్ళు" అంటూ బలరాజ్ వెళ్ళిపోయాడు.
నేను లోపలికి బయలుదేరాను.
3
"కొంప మునిగింది.
బాస్ నన్ను చూడంగానే కంగారుగా అన్నాడు.
"మునిగింది ఎవరికొంప?" అని నేనడగలేదు. ఎలాగూ బాస్ గాడే చెపుతాడు. అందుకని నేను కంగారు నటిస్తూ "ఏమైంది?" అన్నాను.
"రామ్ సింగ్ పరిస్థితి ఏమీ బాగుండలేదు. ఇప్పుడెలా?" బాస్ కంగారు ఇంకా తగ్గలేదు.
"రామ్ సింగ్ కి ఏమైంది?"
"రామ్ సింగ్ కి ఇంకా ఏమీ కాలేదు. ఏదయినా అయితే ఎలా అని! వాడి రహస్యం వాడితోనే అంతం అయితే? ఇంతా కష్టపడి మనం సాధించింది ఏమిటి?"
బాస్ చాలా గాభరాగా వకమాటకి మరో మాటకి పొంతనలేకుండా చెపుతుంటే నాకు వక్క ముక్క అర్ధంకాలేదు. నాకర్థమైనంతవరకు రామ్ సింగ్ కి ఏదో అయింది.
ఏదో అంటే?
కొంపదీసి పారిపోవటం కాదు కదా!
ఈ ఆలోచన నాకు రాంగానే ఇప్పుడు నాకు గాభరా వేసింది. "ఏమయిందో వివరంగా చెప్పండి బాస్!" అన్నాను.
"కోటి యాభై లక్షలు...?"
"ఊ...కోటి యాభై లక్షల కేమైంది?"
