Previous Page Next Page 
గురవాయణం పేజి 5


                                                                            గురవాయణం

                                                        రత్తమ్మ విలాస్

    పోయినవారం ఇంట్లో మోటర్ చెడిపోయి నీళ్ళు రావడం ఆగిపోయాయి. కష్టపడి ఓ బకెట్ నీళ్ళతో స్నానంచేసి హాస్పిటల్ కి చేరుకున్నాను. దేవుడు నా బుర్రకి రివైండ్ బటన్ ఒకటి కాదు నాలుగు పెట్టి ఉంటాడు.
    ఆపద వచ్చినా, ఆనందం వచ్చినా దానికి సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలకి తలుపులు చటుక్కున తెరుచుకుంటాయి.
    చిన్నప్పుడుగాబు పక్కన నుంచొని చన్నీళ్ళతో స్నానం, వచ్చిన అతిథులకు మాత్రం మా అమ్మ వేడినీళ్ళతో గౌరవించేది. మా అమ్మ ఇంకొక విషయం కూడా చెప్పేది. స్నానానికి ఎంత తక్కువ నీళ్ళు వాడితే అంత పొడుపు, పొందిక మనకు ఉన్నట్టు లెక్క అని.
    కొత్త కోడలికి ఇంటికి వచ్చినప్పుడు ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చిందంట అత్త. ఆ కొద్ది నీళ్ళతో రెండు కాళ్ళు పూర్తిగా తడుపుకుని ఆ కోడలు ఫస్ట్ మార్క్ కొట్టేసిందట. చెంబు నీళ్ళతో కాలేమిటి కర్మ... పూర్తి శరీరాన్ని స్నానం చేయించగల లాఘవాన్ని మెడికల్ కాలేజీ రోజుల్లో రత్తమ్మ విలాస్ పుణ్యమా అని సంపాదించాను. గుంటూరు అరండల్ పేటలో రత్తమ్మ నాలుగు గదులు మాకు అద్దెకు ఇచ్చింది.
    ఆమె లెక్క ప్రకారం గదికి ముగ్గురు చొప్పున 12 మంది మాత్రమే అక్కడ ఉండాలి.
    కానీ మా లెక్క ప్రకారం గదికి ఐదుగురు చొప్పున 20 మంది ఉండేవాళ్ళం. అంటే ఎనిమిదిమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నమాట.
    గదికి ఒక బకెట్ నీళ్ళు మాత్రమే సాంక్షన్. కింద పంపు దగ్గర కూర్చుని యుద్ధం టైమ్ లో ఖైదీలకు రేషన్ ఇచ్చినట్టు నీళ్ళ పంచాయతీ చేసేది.
    చిన్నప్పుడు మా అమ్మ నీళ్ళ పొదుపు గురించి నాకు నేర్పిన పాఠాలు ఇప్పుడు బాగా పనికి వచ్చాయి. ఒక బకెట్ నీళ్ళతో ఐదుగురు వ్యక్తులు ఎలా స్నానం చేయాలో నేను అందరికీ నేర్పి ఒక గొప్ప జలయజ్ఞానికి దోహదం చేశాను. ఈ రోజుకి నేను గర్వపడే ఒక గొప్ప విషయం అది.
    ప్రతివాడికి రెండు మగ్గులు మాత్రమే వచ్చేవి. మళ్ళీ దీంట్లో మోసాలు, మాయలు జరక్కుండా ఒకరు స్నానం చేస్తుంటే ఇంకొకరు కాపలా.    
    పైన ఉదహరించిన పొడుపు స్నానం గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే వీడియో పంపగలను. సారీసారీ ఆడియో పంపగలను.
    రత్తమ్మ విలాస్ లో బతకడానికి ఇంకా ఎన్నో అంకమ్మ శకలు నేర్చుకోవాల్సి వచ్చేది. ఇంటి మొత్తానికి కలిపి కింద ఒక్కటే సౌచాలయం. దాంట్లోకి ప్రవేశించాలంటే బయటే కుర్చీలో కూర్చున్న రత్తమ్మకి నీ పాస్పోర్ట్ చూపించాల్సిందే.
    మరి మాలాంటివాళ్ళ మాటేమిటి. ముందుగా ఒకడు వెళ్ళి రత్తమ్మని సంభాషణల్లో ముంచి ఈలోపు నాలాంటి అనుకోని అతిథి చప్పుడు కాకుండా సౌచాలయంలోకి ప్రవేశించాలి. ఒక్కోసారి మారువేషాలుకూడా వేసుకోవాల్సి వచ్చేది.
    రత్తమ్మగారు శుద్ధ వెజిటేరియన్. మాకేమోరోజుకొక మర్డర్ జరక్కపోతే భోజనం సహించేది కాదు. దొంగతనంగా చికెన్, మటను పెసరట్ లలో మడిచి స్మగుల్ చేసేవాళ్ళం. ఇలాంటి వృద్ధ ఆడ పోలీసులకు వాసన పటిమ చాలా ఎక్కువ. అప్పుడప్పుడు వాసన పట్టిన జాగిలంలా ఆమె పైకి వచ్చి మమ్మల్ని అందరినీ నోరుతెరిపించి మరీ వెతికేది.
    అలా రత్తమ్మ విలాస్ లో మాకు ఎన్నో జీవిత పాఠాలు అబ్బాయి. పరీక్షలప్పుడు రాత్రంతా నైట్ డ్యూటీ, ఆ తర్వాత రాత్రంతా పేకాటలు, ఎన్నో మధురస్మృతులు. రత్తమ్మగారు పైన ఏ లోకంలో ఉందో కాని ఆమెకు నమస్మృతులు మనస్ఫూర్తిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది.
    మనందరం చదువుకునే రోజుల్లో హాస్టల్ లోనో, అద్దె కొంపలోనో నలిగిపోతూ, విసిగిపోతూ "ఏమి జీవితంరా బాబు" అనుకున్న రోజులు బోల్డన్ని.
    కానీ ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులు, ఆ అనుభవాలు, ఆ ఇబ్బందులు అన్నీ ఎంతో అందంగా, ఆనందంగా అనిపిస్తాయి. *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS