Previous Page Next Page 
గురవాయణం పేజి 4


                                                                             గురవాయణం

                                                         లిటిల్ సోల్జర్స్

    ఆదివారం, అందరి వారం. కుటుంబం అందరితో కలిసి, గడపాలనే బలమైన కోరికని, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడుమీద మొహమాటం లేకుండా రుద్దేస్తుంటాను.
    "వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు-వాళ్ళకి సంసారాలున్నాయి. సరదాలున్నాయి- వాళ్ళకి స్పేస్ ఇవ్వు-నీ ముసలితనంలో దీవెనలు తప్ప, ఆజ్ఞలు, ఆనతులు పనికిరావు" అని నాకంటే చాలా తెలివితేటలు ఉన్న (ఉన్నాయి అనుకున్న) శ్రీమతి, నా మందమతితనాన్ని ఎన్నిసార్లు ఎత్తి చూపినా పట్టించుకోను. అందమైన బ్లాక్ మెయిల్ చేస్తూనే వుంటాను. పోయిన ఆదివారం- ఈ సదరు బ్లాక్ మెయిల్ నేపథ్యంలో-
    నా కూతురు కావ్య. "నాన్న- నేను ఆదివారం బిజీ, సాక్షిలో ఇంటర్వ్యూ ఉంది. 'లిటిల్ సోల్జర్' సిన్మా వచ్చి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా" అని ఫోన్ పెట్టేసింది. మనసు 25 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయింది. 1995 ఇంగ్లాండ్ లో, లివర్ పూల్ లో ఉద్యోగం. కావ్యకి మూడేళ్ళు, అక్కడే పుట్టింది.
    మా అమ్మది, నాది, కలిసి అబ్బినట్లుంది- వాగుడులో. మూడేళ్ళకే, ముప్పైయేళ్ళ ముదనాపసాని లాగా మా అందరికీ క్లాస్ లు పీకేది.
    ఓసారి అలాంటి వాడుగుని వీడియో తీయడం, ఇండియాకి పంపడం జరిగింది. అదే సమయంలో కో.బ్ర.గుణ్ణం గంగరాజుకి (కో.బ్ర. అంటే కో బ్రదర్- అనగా తోడి అల్లుడు) వందల సంవత్సరాల నుంచి వేలమందిని బలి తీసుకుంటున్న- ఓ చికిత్స లేని (సిని)మాయదారి జబ్బు పట్టుకుంది.
    తను అప్పటికే స్క్రిప్ట్ సలైన్, డైలాగ్ డ్రగ్స్ ట్రీట్ మెంట్ తో, స్టూడియో బెడ్ మీద ఆరునెలలనుంచి, 'అటో-ఇటో'గా ఉన్న సమయంలో 'కావ్య వాగుడు' వీడియో చూడడం-" ఈ పిల్లే, నా లిటిల్ సోల్జర్" అని ఫిక్స్ అవడం జరిగిపోయాయి.
    మా వదిన ఊర్మిళ ఇంగ్లాండ్ వచ్చి, కావ్య కాల్ షీట్స్ అడిగినప్పుడు, ఓ వర్ధమాన హీరోయిన్ తండ్రిగా, నేను ముందు 'కుదరదు' అని నసిగి, తర్వాత 'ఎంతిస్తావ్' అని గొణిగి ఒప్పుకున్నాను. మూడేళ్ళ హీరోయిన్, తోడుగా ఏడేళ్ళ ఆదర్శ్ అన్న, ఇండియాకి చేరుకున్నారు.
    అక్కినేని వెంకట్ సమర్పణలో, గంగరాజు దర్శకత్వంలో, అన్నింటికంటే ముఖ్యంగా, ఊర్మిళ పర్యవేక్షణలో, లిటిల్ సోల్జర్ సిన్మా ఓ వందరోజుల్లో రూపుదిద్దుకొంది.
    ఈలోపు సిన్మా షూటింగ్ మొదలవకముందే కావ్య, ఊర్మిళకి, గంగరాజుకి "మా ఊరెళ్ళిపోతా" అనే ఓ గుండెల్ని పిండేసే సిన్మా చూపించేసింది. ఎలాగోలా ఒప్పించి, మెప్పించి, ఓదార్చి, ఏమార్చి సిన్మా మొదలెట్టారు.
    దానికి, సిన్మా లైట్లవేడి, షూటింగ్ ఒత్తిడి పడక, "పెదనాన్నా నాకే ఎందుకింత కష్టం వచ్చింది" అనే భారీ డైలాగు వదలడం, అది గుండెల్లో గుచ్చుకుని, గంగరాజు, సిన్మాకి ఆల్ మోస్ట్ అటకెక్కించి, యుద్ధానికి వెళ్ళకుండానే, 'లిటిల్ సోల్జర్'ని ఇంటికి పంపించేయబోవడం జరిగిపోయాయి.
    చివరకు, ఊర్మిళ 'పెద్దమ్మతనం', అసిస్టెంట్ డైరెక్టర్ నందిని 'అమ్మమ్మతనం' (అలా మొదలైంది, ఓ బేబీ దర్శకురాలు), కావ్య మనసు మార్చి, సిన్మాను మళ్ళీ పట్టాల మీదకెక్కించాయి.
    ఫిబ్రవరి 1996లో రిలీజు అయిన 'లిటిల్ సోల్జర్స్', అందరి మన్ననలు పొందింది. సీతారామశాస్త్రి సాహిత్యంతో అన్ని పాటలు, వీనులవిందుగా కుదిరాయి. గంగరాజు క్రిస్ప్ సంభాషణలు, ఆర్టిస్టిక్ చిత్రీకరణలు, సిన్మాని ఇంకో లెవల్ కి తీసుకెళ్ళాయి.
    కోట, బ్రహ్మానందం, సుధాకర్, రోహిణి హట్టంగిడి లాంటి ఉద్దండులు, సిన్మాకి ఓ హుందాతనాన్ని తెచ్చారు. ఇక సోల్జర్స్ బాలాదిత్య, కావ్య- సన్ని, బన్నీ రోల్స్ లో, జీవించి, 'లిటిల్ సోల్జర్' సిన్మాని, బాలల సిన్మాలో ఓ cult statusకి తీసుకెళ్ళి, 9 నంది అవార్డ్స్, కావ్యకి నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డ్ తెచ్చిపెట్టారు. ఇప్పటికీ, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో, కొన్నివేలమంది పిల్లలు, ఏడ్వకుండా అన్నం తినాలంటే- I am a good girl-said my old teacher" పాత వినపడాల్సిందే, కనపడాల్సిందే.
    అదే పాటను, కావ్య పెళ్ళికి బహుమతిగా అన్న ఆదర్శ్, మళ్ళీ చిత్రీకరించి "Not so little soldiers" అనే పేరు మీద you tubeలో పెట్టాడు.
    డైరెక్టరు గంగరాజు లిటిల్ సోల్జర్ సిన్మా తర్వాత "పిల్లకాయలతో జెల్లకాయలు" అనే బుక్ రాసి, పిల్ల నటులతో సిన్మాలు తీయాలనుకున్న అత్యాశావాదులందరికీ మార్గనిరోధకుడయ్యాడు.
    'అమృతం' అనే అందమైన కామెడీతో సంవత్సరాలపాటు మనల్ని నవ్వించాడు.
    'అమ్మ చెప్పింది' అనే భారమైన ట్రాజెడీతో ఏడిపించటం కూడా చేశాడు.
    ఏలేటి చంద్రశేఖర్ అనే కత్తిలాంటి డైరెక్టర్ ని ('ఐతే', 'అనుకోకుండా ఒకరోజు') తెలుగు సిన్మాకి బహుమతిగా ఇచ్చాడు. ఊర్మిళ ఇద్దరు మనవరాళ్ళను, మధ్యలో గుళ్ళలో రాళ్ళను చూసుకుంటూ Candy CRUShలో మునిగిపోయింది.
    బాలాదిత్య, Chartered Accountantగా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ, అన్నం తినకుండా ఏడ్చే కూతురికి "I am a good girl" పాట వినిపిస్తూ, ఆనందంగా ఉన్నాడు. కావ్య, Cardiology PG చేస్తూ, రెండేళ్ళ కొడుకు అర్జున్ కి తల్లి పాత్రలో జీవిస్తూ, మధ్యలో పేషెంట్లకు సెల్ఫీలు ఇస్తూ, హాయిగా ఉంది.
    ఇంటర్వెల్ లోనే సిన్మా పేరు మర్చిపోతున్న ఈ రోజుల్లో, ఇన్ని సంవత్సరాలు లక్షలమందిని అలరించిన ఇలాంటి సినిమాలో నా కూతురి ద్వారా నేను కూడా భాగస్వామినయినందుకు ఆనందిస్తూ. గర్విస్తూ, ఇంకా ఊర్మిళ దగ్గరనుంచి డబ్బులు రానందుకు చింతిస్తూ... ఎదురుచూస్తూ... *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS