Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 4


    "లే. రవిసాబ్ తానె అన్నడు గంగీ మనం పెండ్లి చేస్కుందామా? అని"
    "యెప్పుడు? నిజమా?"
    "యీ పొద్దు. ఆడికెల్లి వొచ్చి రవీసాబ్ యింట్ల కూకుంటిమి అప్పుడు" అంది.
    "యేమిచూసి నిన్ను చేస్కుంటనన్నడే!" అని పరిహాసమాడాడు రాములు సంతోషంతో.
    "యేమ్? నాకేమి? నల్లగుంటె మంచిగుండరా?" అంది.
    గంగిని జనం యెలా దాహంగా చూస్తారో, యెలా వెంటపడుతుంటారో, రాములికి తెలుసు. అలా చూసి_ అతనికి వాళ్ళమీద చచ్చేకోపం వొస్తూంటుంది కూడా.
    "నాయ్నకు అవ్వకు చెప్తివా" అన్నాడు.
    "లే" అంది.
    "చెప్పు."
    "నువ్వు చెప్పు" అంది.
    "నీ పెండ్లి ముచ్చట నువ్వే చెప్పు." అని యేడిపించటానికి అని, "ముందుగల నేను రవీసాబ్ తోటి మాట్లాడి వొస్త" అని లేచి రవి దగ్గిరికి బయల్దేరాడు.
    వెళ్ళి నాలుగు నిమిషాలు ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడి, "గంగి పెండ్లి ముచ్చటేమొ చెప్పినది. అట్ల అంటివా రవీసాబ్?" అన్నాడు రాములు.
    "నీకేమన్నా అభ్యంతరమా" అన్నాడు రవి.
    రాములు అమాంతం రవి రెండు చేతులూ పట్టుకుని, "మేము తక్కువోళ్ళం. నా చెల్లెల్ని యెట్ల యేమిట్కి చేస్కుంటరూ_ అని అంటి. అంతె. నాకు అభ్యంతరమెట్లుంటది రవిసాబ్! గంగికి గంత అదృష్టమా అని అంటి. అంతె" అన్నాడు.
    యింటికి వెళ్ళి తల్లి దండ్రులకి చెప్పాడు రాములు. మహదానందపడి
    "గీపోరి పుట్టంగనె అనుకుంటి--యిది గొప్పింటి పోరి ఐతదని." అంది తల్లి.
    మరుసటిరోజు రాములు, ఫ్యాక్టరీలో తెలియజేశాడు వార్త.
    పెళ్ళి యెంత అట్టహాసంగా చెయ్యాలో మాట్లాడుకుంటున్నారు గుమిగూడి.
    రాముల్ని పిలిచి "పెళ్ళి చాలా సాదాగా సింపుల్ గా జరిగిపోవాలి. వాళ్ళని ఆ ఆలోచనలన్నీ మానుకోమను. వూరేగింపులూ, ఉయ్యాలలూ, వుట్టికొట్టటాలు- కుదరదు." అని చెప్పాడు రవి.
    "పెండ్లంటె నలుగురు వొచ్చి చూడాల చెయ్యాల__" అంది రాములు తల్లి ఆ విషయం చెప్పగానే.
    రాములు, "పంతుల్ని మంచిదినమెప్పుడొ వెలుసుకొస్త" అని వెళ్ళి బ్రాహ్మణి సంప్రదించి రవి దగ్గిరికి వెళ్ళి వాళ్ళమ్మ అన్నమాట చెప్పాడు.
    "దానికేం తను పిలవదలిచిన వాళ్ళనందర్నీ పిలవమను. బ్రాహ్మలూ మంత్రాలూ అన్నీ వుంటయ్. ఆర్భాటం, అట్టహాసం వొద్దు. నేనెవర్నీ పిలవను. ఫ్యాక్టరీనుంచి యెవరూ వొద్దు సాయిలూ వాళ్ళు ఓ పదిమంది వుంటారు. అంతె." అన్నాడు రవి.
    "మీ చుట్టాలు, కాలేజీల దోస్తులు__"
    "నేనెవర్నీ పిలవనన్నానుగా_" అన్నాడు రవి.
    దగ్గిర్లోనే మంచిరోజు వుండటంతో పెళ్ళి ఆ వారంలోనే జరిగిపోయింది. పెళ్ళిరోజునే శోభనం కూడా.
    రాత్రి పదకొండున్నర. మంచం మీద రవీ గంగీ.
    గంగిని దగ్గిరికి తీసుకుని నుదుటి మీదా తలమీదా ముద్దెట్టుకున్నాడు. అతనిని పెనవేసుకుని అతని పెదాలు గట్టిగా ముద్దెట్టుకుంది. అతనిని మీదకి లాక్కుంది.
    మహోధృత కెరటం లోపలి అట్టడుగున మునిగిపోయినట్లుగా కంపించిపోయాడు రవి.
    అలసటగా వొకరిప్రక్కన వొకరు తృప్తిగా పడుకుని__
    "రవీ" అంది.
    "వూఁ"
    "లవ్ మంచిగున్నది" అంది.
    అతని జబ్బమీద చెంప ఆనించుకుని, అరిచెయ్యి అతని చెంపకి అద్దింది.
    ఆమె కళ్ళలోకి తృప్తిగా చూస్తున్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ, పైకి జరిగి, అతని పెదాలమీద గట్టిగా ముద్దు పెట్టుకుని, జరిగి, అతని మెడ ప్రక్కన తల ఆనించి చెయ్యి అతని ఛాతీమీద వేసింది.
    రవి రెప్పలు వాల్చాడు. మగతగా నిద్ర ఆవరిస్తోంది.
    ఛాతీమీద వేళ్ళతో వెంట్రుకలు కదుపుతూ, మెడదగ్గర నాలికతో తాకుతూ, కాలు అతని తొడలమీదుగా వేసి గట్టిగా అదిమింది.
    అతను కదలకుండా వుండటం గమనించి, "నిద్రనా?" అంది. "వూఁ, నిద్రపోదాం, పొద్దుపోయింది."
    "అప్పుడే యేం పొద్దుపోయింది. రెండు మూడు గంటలదాక పుస్తకాలు చదువుకుంట వుంటవుగద? నిద్రెట్లోస్తదిప్పుడు? దిల్లగి చేస్తున్నావు!" అని గారాబుగా అని, అతనిని కదిపి కుదిపి, అతని పెదాలమీద గట్టిగా ముద్దు పెట్టుకుని, చేత్తో బలంగా పైకి జరుపుకుంటే__జరిగాడు పైకి.
    తరవాత__ "ఆడ దేనికి? అందరం యీడనే వుందం" అంది.
    "అది పద్ధతి కాదు. మనింట్లో మనం వుండాలి. ఆ యింటికి రేపు నీ అన్న భార్య వొస్తుంది" అన్నాడు.
    "వొచ్చినప్పుడు చూస్కుందం" అంది.
    గంగి తల్లిదండ్రులు, రాములు అక్కడే వుండమన్నారు.
    రవి వొప్పుకోలేదు.
    "కావాలంటే మనింటి నుంచి భోజనం పట్టికెళ్ళి మీ అమ్మానాన్నలకి పెట్టు__మీ అమ్మ చేసుకోలేకపోతే. రాములు వొచ్చి యిక్కడే తిని వెళ్తాడు" అన్నాడు రవి.
    ఫ్యాక్టరీలో ఐదువొందలలోను తీసుకున్నాడు. పేచీ పెట్టకుండా యిచ్చారు__పెళ్ళి సందర్భం అని కాకపోయినా, వర్కర్ల యూనియన్ లీడర్ కదా__అని.
    ఆ డబ్బుతో వంటకి కావాల్సిన కిరోసిన్ స్టవ్, అల్యూమినియం పాత్ర సామగ్రి కొన్నాడు.
    యెవరింట్లో వాళ్ళే. రోజూ సాయంత్రం వాళ్ళు వీళ్ళ దగ్గిరికి రావటమో, వీళ్ళు వాళ్ళ దగ్గిరికి వెళ్ళటమో జరుగుతోంది.
    గంగి రవి ఫ్యాక్టరీకి వెళ్ళేలోగానే వంట చేసేస్తుంది. మధ్యాహ్నం వేళ తల్లి దగ్గిరికివెళ్ళి నాలుగింటిదాకా వుండి వొస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS