Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 4


సీసాపై లేబుల్ పై వున్న అక్షరాలు చదివివుంటే!

ఓ ఘోర ప్రమాదానికి....

ఓ చిన్న ప్రాణానికి__

మరణ ముహూర్తం చేజేతులా ఓ అమాయకపు కన్నతల్లి పెట్టేది కాదు. వెన్న లాంటి మంచి మనసుతో తియ్యని హల్వాలో కలిపి.

ఆ బుల్లి సీసాలో వున్నది.

పాయిజన్.

సైనెడ్ లాంటి పాయిజన్.

                                 2

"ఈ సీసా ఎందుకు తీశావు పార్వతీ!"

భర్త ముఖంలోని కంగారు, ముఖంనిండా అలుముకున్న శ్వేత బిందువులు కళ్ళలోని ఎర్రజీరలు చూసి పార్వతి గుండె ఎందుకో దడదడ లాడింది.

భయం భయంగా భర్త ముఖంలోకి చూస్తూ "మీరే చెప్పారు కదండీ. ఏలకుల రసం వున్న సీసా అలమరలో వుంది తీసుకోమని...!" అంటూ నెమ్మదిగా చెప్పింది పార్వతి.

"దీనిలో రసం హల్వాలో వేశావా!" గాభరాగా అడిగాడు శివరావు.

"రెండు చుక్కలు వేస్తే చాలని మీరు ఆ రోజెప్పుడో చెప్పారు కదా! వాసన చూశాను. ఏ వాసనా రాలేదు. జలుబు వల్ల నా ముక్కు పనిచేయటం లేదో ఏమోనని అనుమానం ఆ తర్వాత వచ్చింది హల్వాలో చెంచాడు రసం వేశాను" పార్వతి చెప్పింది.

 "ఆ హల్వా నీవు తిన్నావా?"

 "ఉహూ."

 "కొద్దిగా కూడా తినలేదా?"

"మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు యీ ప్రశ్నలు ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు."

"ముందు నా ప్రశ్నలకి జవాబు చెప్పు పార్వతీ!" శివరావు స్వరం కరకుగా వినవచ్చింది.

 "ఉహూ, కొద్దిగా కూడా తినలేదు. మీతో కలిసి తిందామని నాలుగు హల్వా ముక్కలు తీసి అవతల పెట్టాను."

"పండరీకాక్షయ్య బాబాయి వచ్చాడా?"

"ఉహూ, బ్యాగ్ లో అన్నీ సర్ది నేనే వెళ్ళి యిచ్చి వచ్చాను. బాబాయి మనింటికి రావటానికి బైలు దేరుతున్నారు. నేను వెళ్లాను. నీ వెందుకమ్మా శ్రమపడి రావటం నేను రానా!" అన్నారు..." అంటూ పార్వతి చెప్పుకు పోతుంటే.

 "ఆగు పార్వతీ!" అన్నాడు శివరావు.

టక్కున నోరు మూసుకుంది పార్వతి.

"నేను యిప్పుడే బాబాయి వాళ్ళ యింటికి వెళ్ళి వస్తాను. నీవు కూడా నాతోరా!" అంటూ శివరావు మూలన విడిచిన చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు!

"నేనెందుకండీ!" అన్న మాట పార్వతి నోట్లోంచి రాబోయే లోపలే భర్త రెండు అడుగులు ముందుకు వేయటంతో మారు మాట్లాడకుండా ఎలా వున్నది అలాగే బైలుదేరింది.

జరగరానిదేదో జరిగిందని అంతవరకూ పార్వతి గ్రహించ గలిగింది. ఆ గాభరాలో పెదవి కదిపి అదేమిటని అడగలేక పోయింది. విషయమేమిటో శివరావు చెప్పనూ లేదు.

భార్యాభర్తలు వీధి గేటు దాట బోతున్నారు పుల్లారావు ఎదురు వచ్చాడు.

పుల్లారావుకి పదిహేను ఏళ్ళుంటాయి. శివరావుకి తెలిసిన వాళ్ళబ్బాయి.

"అరేయ్ పుల్లారావ్! నీవు పరుగెత్తుకుంటూ వెళ్ళి పండరీ కాక్షయ్య బాబాయిని ఊరు వెళ్ళవద్దని చెప్పు. నేను వస్తున్నాను అర్జంటుగా ఏదో విషయం చెప్పాలని కూడా చెప్పు." శివరావు చెప్పాడు.

"ఆయన ఎప్పుడో ఊరెళ్ళి పోయారు. నేను అటునుంచి వస్తుంటే వూరెళ్ళటం చూశాను."

"వెళ్లి గంటయిందా?" ఆతృతగా అడిగాడు శివరావు.

"ఉహు," తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు పుల్లారావు.

"అరగంట అయిందా?"

"ఉహూ, సరీగ చెప్పాలంటే దాదాపు రెండు గంటలయింది" పుల్లారావు ఆ మాట చెప్పి "భూషణం తాతయ్య నిన్నెందుకో ఓ అరగంటలో వచ్చి వెళ్ళమన్నారు. యీ మాట చెప్పటానికి పరుగున వచ్చాను. వస్తాను బాబాయ్!" అంటూ తూనీగ లాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS