Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 4


    టెంక్షన్ టెంక్షన్ టెంక్షన్


    ఎస్ టెంక్షన్ వల్లనే నిద్రపట్టడంలేదు. మానవుడు చాలా అల్పజీవి. ఏదొచ్చినా పట్టలేడు అని ఎక్కడో చదివిన గుర్తు. మితిమించిన దుఃఖానికి తట్టుకోలేడు. శృతిమించిన ఆనందానికి తట్టుకోలేడు.


    ఒకటా రెండా, ఒక కోటి యాభయ్ లక్షలు. ఒక్కసారిగా నేను అంత ధనానికి యజమానిని అయ్యాను. బాస్ గాడి మోచేతి కింద నీళ్ళుతాగే నేను ఇంతవరకు ఇన్ని దొంగతనాలు చేసినా పట్టుమని పదివేలు దయలేని నేను అమాంతం వక్కసారిగా ఒక కోటి యాభయ్ లక్షలకు అధిపతిని... అధికారిని అయ్యాను.


    టెంక్షన్ కాక మరేమిటి?


    నా ఆనందాన్ని ఎవరితో పంచుకోలేను.


    నాకు పట్టిన ఈ అదృష్టాన్ని ఎవరికి చెప్పలేను.


    ఎలాగూ ఈ రాత్రికి నిద్ర పట్టేటట్లు లేదు. ఫ్యూచర్ గురించి తీయని కలలుకంటూ మంచంమీద అటూ ఇటూ పొర్లటం మొదలుపెట్టాను.


    ఓ పక్క తెల్లవారుతుంటే అప్పుడు పోయాను నిద్ర.


    ఎంతోసేపు నిద్రపోయి వుండను. తలుపు తట్టిన చప్పుడు కాపటంతో ఉలిక్కిపడి లేచాను. ఆ వెంటనే మంచం మీద నుంచి లేచివెళ్ళి తలుపు తీశాను.


    ఎదురుగా బలరాజ్ నిలబడి వున్నాడు.


    "చిన్న గురూ! నిన్ను అర్జంట్ గా వున్న పళాన బాస్ రమ్మన్నాడు" బలరాజ్ లోపలికి అడుగువేస్తూ చెప్పాడు.


    "దేనికి?"


    "కొత్త కేసు వచ్చింది. అది నీ ఒక్కడివల్లే సాధ్యంట."


    "కొత్త కేసా! అది సూట్ కేసా బ్రీఫ్ కేసా?"


    "అంత వ్యంగ్యం ఎందుకు చిన్నగురూ! ఇదివరలో బాస్ రమ్మన్నాడని చెప్పంగానే ఉరుకుల పరుగుల మీద బైలుదేరేవాడివి. ఇప్పుడేమో..."


    "చుప్...బాస్ రమ్మనంగానే బయలుదేరక ఆలస్యం చేస్తున్నానా? నీకెందుకా అనుమానం వచ్చింది?" నా అనుమానాన్ని దాచుకుంటూ జీన్స్ ప్యాంటులో కాళ్ళు దూర్చాను.


    "అనుమానం అంటే అనుమానం కాదనుకో. ఇదివరకు ఇలానే వచ్చి కబురు చెప్పంగానే నీవు ఆదరా బాదరాగా బయలుదేరేవాడివి. ఇప్పుడేమో ఒక్క క్షణం నొసలు ముడేశావు. క్రాపులోకి వేళ్ళు దూర్చి జుట్టు సవరించుకుంటూ నిలబడి ఆలోచించావు. ఆ తర్వాత తల పంకించావు. ఆ తర్వాత..."


    "నీ బొంద" అంటూ మధ్యలోనే అడ్డుతగిలి వాడినోరు మూయించాను. "మాడు పోటు వచ్చి రాత్రి నిద్రపట్టలేదు. తెల్లగ తెల్లారుతుండగా నిద్రపట్టింది. మాంచి నిద్రలో వుండగా నీవు లేపావు. ఇంకా నిద్రమత్తు వదలక నే ఇలా వుంటే నీవేమో ఏదేదో వాగుతుంటివి" అంటూ షర్ట్ తగిలించుకున్నాను.


    "అలా చెప్పు చిన్న గురూ! పరధ్యానంగా వుండేసరికి నాకేదో అనుమానం వచ్చింది. అయినా ఏ వయసు ముచ్చట ఆ వయసుదని నా అభిమాన హీరో టక్కర్ బాబు సినిమాలో శలవిచ్చాడు గందా! నన్నడిగితే మగాడికి గడ్డాలు, మీసాలు ఇలా రాంగానే అలా ఓ ఆడదాన్ని లటుక్కున..."


    "ధూ... నీ యవ్వ. భూమికి జానెడు ఎత్తునలేవు. ఎంతసేపు అడ్డగోలే. మగాడికి మీసాలు, గడ్డాలు రాంగానే అయిపోదు. అవి గొరిగించుకోడానికి డబ్బు కూడా కావాలి. కనుక ముందు డబ్బు సంపాదించాలి. ఆ పైనే ఏదయినా" బూటు లేసు బిగించుకుంటూ చెప్పాను.


    "నాకు తెలియక అడుగుతున్నాను చిన్నగురూ! గడ్డం దేనికి అడ్డం అంటావు?" బలరాజ్ ఇకిలించుకుంటూ అడిగాడు.


    "నీ నోటికి అడ్డంగా టేపు అతికించినా అలా వాగుతూనే వుంటావు. అది నీ సహజ లక్షణం. ఇంక నోరు మూసుకుని పద." అంటూ వాడినో గదుము గదిమి గదిలోంచి బయటపడ్డాను.


    నా గదికి తాళం వేసి ఇరువురం స్కూటర్ ఎక్కి బాస్ గాడి స్థావరానికి బయలుదేరాము.


    నా బాస్ గాడు కొద్దికాలం నుంచే పెద్దవాడు అయ్యాడు. వాడికో ముఠా, నివాస స్థావరము ఏర్పడ్డాయి. చిల్లర మల్లర దొంగతనాలతో పొట్టపోసుకునే నేను గాలివాటంగా వచ్చి బాస్ గాడికింద చేరాను. నా బుద్ధి పదును చూసి బాస్ గాడు నన్ను కుడిభుజంగా చేసుకున్నాడు.


    నా భుజ బలం నాదే.


    ఎవరి మోచేతి కింద నీళ్ళు తాగటానికి ఇష్టపడను. కుడి భుజం ఎడమ భుజంగా ఒకడికింద పడివుండటము అసలే ఇష్టంలేదు. గతిలేక... గత్యంతరం లేక బాస్ గాడికింద వున్నాను. అంతే.


    ఎప్పటికయినా బాగా డబ్బు బాగా సంపాదించాలి. లక్షాధికారిని కావాలి నేను. నాకో చిన్న సంసారం పెద్ద ఇల్లు సంఘంలో పరపతి ఇవి నా కోరికలు.


    ఆఫ్ ట్రాల్ లక్షాధికారినేమిటి? ఇప్పుడు నేను నో...నో...రాత్రి పన్నెండు గంటలప్పటి నుంచి ఒక కోటీ యాభయ్ లక్షలకి అధిపతిని. లక్షాధికారిని కోటీశ్వరుణ్ని...


    కోటీశ్వరుణ్ని.


    "చిన్న గురూ! చిన్న గురూ! యాక్సిడెంట్ అయితే అఖిలాంధ్ర అడుక్కునే సంఘంలో అంగవికలుడిగా చేరాల్సివస్తుంది. నీవు ఎక్కింది స్కూటర్. రాకెట్ కాదు. చూసి నడుపు గురో?" వెనుక నుంచి నన్ను గట్టిగా పట్టుకుని దారినపోయే వాళ్ళంతా వినేలా అరిచి మరీ చెప్పాడు బలరాజ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS