Previous Page Next Page 
గురవాయణం పేజి 3


                                                                      గురవాయణం

    క్రోసూరు మా అమ్మమ్మవాళ్ళ ఊరు. సత్తెనపల్లి తాలూకాలో గుంటూరు జిల్లాలో. నా బాల్యమంతా బాపట్లలో జరిగి నా అదృష్టం కొద్దీ రెండేళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకోవడం జరిగింది.
    ఆ పల్లెటూరి జీవితం మరపురాని అనుభూతిని మిగిల్చింది. అప్పటి సంక్రాంతి పండుగ రోజులు గుండెల్లో లోతుగా దాక్కుని ప్రతిసంవత్సరం ఆ పాత సంక్రాంతి వస్తే బాగుండు అనేట్లు చేస్తుంటాయి. జనవరి చలిరోజులు మొదలైన దగ్గర నుంచి సంక్రాంతి సంబరాలు మొదలైనట్టే.
    భోగిరోజు మంటలు వేసుకోవడానికి సరంజామా కావాలికదా. పక్కింటి గడ్డివాములో నుంచి చొప్పా. ఎదురింటి గోడమీద నుంచి పిడకలు దొంగతనంగా కొట్టేసి దాచేసి భోగిరోజు రారాజు లాగా ఫీల్ అయ్యేవాడిని.
    రెల్లుగడ్డి సిగరెట్ లాగా పీలుస్తూ పొగ వదులుతూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయేవాడిని.
    సంక్రాంతి రోజు ఉదయాన్నే తలంటి గొడవ. ఎంత తప్పించుకుందామనుకున్నా మా అమ్మ పడనిచ్చేది కాదు. ముందు ఆముదం మర్దన తర్వాత సున్నిపిండి వడ్డన కళ్ళకు చుక్కలు కనిపించేవంటే నమ్మండి. ఆ ఒక్క గండం గట్టు ఎక్కాం అంటే ఇక రోజంతా పండుగే. కొత్త బట్టలు, అరిసెలు, పాయసం, కారప్పూస... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
    ఇంతలో సన్నాయిమేళం, గంగిరెద్దు ఆగమనం. మనచేతివాటం ఉపయోగించి కొష్టంలో దాచిన బస్తాల్లో నుంచి కొట్టేసిన జొన్నలు పంచంపెట్టి గంగిరెద్దుతో కాసేపు డాన్స్ చేపించి సినిమాల్లో జ్యోతిలక్ష్మి డాన్స్ చూసినంత ఆనందం పడేవాళ్ళం. ఈ సరికి మీకు అర్థమయ్యే ఉంటుంది సంక్రాంతి పండక్కి నేను ఎన్నిసార్లు దొంగతనం చేయాల్సి వచ్చిందని.
    ఆ తర్వాత గుడి దగ్గరున్న రచ్చబండ చేరేవాళ్ళం. అక్కడ కోడిపందాలు చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే మేము పిల్లలం కదా పెద్దోళ్ళు మమ్మల్ని తొక్కేసి తోసేవాళ్ళు.
    మధ్యమధ్యలో దేవుడి ప్రసాదం, వడపప్పు, చక్రపొంగలి లొట్టలేసుకుంటూ తినేవాళ్ళం.
    సాయంకాలం చల్లబడ్డాక కొండ దగ్గర కాలువ పక్కన కబడ్డీ పందాలు జరిగేవి. ఒళ్ళు హూనం అయ్యేది. ఆడటంవల్ల కాదు... ఆడేవాళ్ళు మీదపడటం వల్ల. ప్రతిసారి వాళ్ళలాగా కండలు పెంచుకోవాలని తెగ డిసైడ్ అయిపోయేవాడిని కానీ ఈ 60 ఏళ్ళ వరకు కుదిరితే ఒట్టు.
    రాత్రికి గడ్డపెరుగుతో భోజనం. ఆ తర్వాత ఊరి ప్రెసిడెంట్ అయిన మా మేనమామతో డేరా టాకీస్ లో ఒక టికెట్ పై రెండు సినిమాలు. అందరూ నేలమీద కూర్చుంటే మాకు మాత్రం కుర్చీలు వేసేవాళ్ళు.
    ఇంటర్వెల్ లో గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్, ఇంటికి వచ్చేటప్పుడు కిళ్ళీ.... మన లెవెల్ అప్పటినుంచే హైక్లాస్ అన్నమాట. ఆ తర్వాత మా మామ తీ.తా (తీసేసిన తాసిల్దార్) అయినప్పుడు నేను టప్పున నేలలో పడిపోయాను అన్న విషయం మీకు చెప్పడానికి సిగ్గుపడటం లేదు. మూడోరోజు కనుమ. ఉదయంనుంచే వంటింట్లో నుంచి గారెలగుమగుమలు చికెన్ మటన్ మసాలా దట్టించిన సరిగమలు.
    బయటవసారాలో అరుగుమీద మా మామ ఆయన స్నేహితులు పేకాట ఆడుతుండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో గ్లాసుల్లో నల్లటి డ్రింక్ ఉండేది. మమ్మల్ని మటుకు ముట్టుకోనిచ్చేవాళ్ళు కాదు.
    ఆ రహస్యపానీయం ఏమిటో తెలుసుకోవడానికి నాకు చాలారోజులు పట్టింది.
    వాళ్ళకి మధ్యమధ్యలో సిగరెట్లు కోసం పావలా ఇచ్చేవాళ్ళు. మిగిలిన ఐదు పైసలతో నీకు ఇష్టం వచ్చింది కొనుక్కోరా అనేవాడు మా మా... అదేదో తన ఆస్తి మొత్తం ఇచ్చినట్లు.
    ఈ రకంగా సంక్రాంతి ఆ మూడురోజులు ఎంత ఆనందంగా గడిచిపోయేదో. పట్నం వచ్చినప్పటి నుంచి ఆ పల్లెటూరి మజా పోయింది.
    బాపట్లలో ఆ తర్వాత గుంటూరులో అమ్మ ఎంత మనసుపెట్టి సంక్రాంతిపండుగ చేసినా ఆ పల్లెటూర్లో వచ్చినంత ఆనందం మళ్ళీ కలగలేదు.
    నా ఉద్దేశంలో పల్లెటూర్లో ఒక్క సంక్రాంతిపండుగ అన్నా జరుపుకోని తెలుగువాడి దరిద్రం జాలిపడాల్సిన విషయం. దయచేసి మీ అమ్మానాన్న ఇంకా పల్లెటూర్లో ఉంటే కనీసం ఓ సంక్రాంతి పండక్కి వెళ్ళి కమ్మగా అరిసెలు బొక్కి, పల్లెటూరి గాలి పీల్చుకుని రావాల్సిందిగా నా ప్రార్థన. మీ పిల్లల్ని తీసుకువెళ్ళడం మర్చిపోకండి సుమా. *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS