Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 3


    "గప్పుడంత ధైర్యంగ యెట్లా చేస్తినో ఏమో నాకే తెల్వకున్నది. యిప్పుడు తల్చుకుంటే గుబులేస్తున్నది. మర్ల ఆడికి పోవాల్నంటె" అంది గంగి.
    "వాడు పరమ క్రూరుడు. వాడి అల్లుడు పరమ నీచుడు. యీ పరిస్థితిలో నువ్వింక ఆ వుద్యోగం చెయ్యొద్దు" అన్నాడు.
    "మరి?"
    "చేస్తే యింకెక్కడన్నా చేద్దువులే. ముందు ఆ టైపు హయ్యరు, షార్ట్ హ్యాండు ప్రయత్నించు"
    "ఆ షార్ట్ హ్యాండ్ బోర్. టైప్ రైటింగ్ హయ్యర్ అంటె చెయ్యగల్గుత"
    మధ్యాహ్నం వేళ.
    "నీకు ఆకలిగా లేదూ?" అన్నాడు.
    "నా టిఫిన్ బాక్స్ ఆడనె వున్నది. ఆ రామ్ నాధమ్ కి ధర్మమిచ్చిన!" అని నవ్వింది.
    "నాకు యీ పూట ఆకలిగా లేదు. నువ్వు యింటికి వెళ్ళి తినిరా" అన్నాడు రవి.
    "నాకు గూడ ఆకలిగ లే" అని పరుపుమీద పడుకుని అతని చేతిమీద చెయ్యివేసి "నువ్వుగూడ వాని ఫ్యాక్టరీలవద్దు. చాటుగ చంపిన చంపగలడు ఆ బద్మాష్" అంది.
    "యేడ్చాడు, నన్నేమన్నా చేస్తే_ తెల్లారేసరికి, వాడి ఫ్యాక్టరీలన్నిటికీ పెట్రోలు పోసి తగలేస్తారు వర్కర్లు. ఆ సంగతి వాడికి బాగా తెలుసు. నా జోలికి రాడు. యికముందు అసలే రాదు. అదీ ఫ్యాక్టరీలో, ఫ్యాక్టరీకి సంబంధించి"
    పైకి జరిగి అతని తొడమీద తల పెట్టుకుంది.
    "గంగీ."
    "వూ"
    "గంగీ_"
    "యెప్పట్కి యిట్లనె వుండిపోవాల్ననిపిస్తది నాకు" అంది.
    "గంగీ_ _"
    "వూఁ"
    "మనం పెళ్ళి చేసుకుందామా?" అన్నాడు.
    "యెవర్ని?" అని చిన్నగా నవ్వి తల అతని వొళ్ళోకి జరుపుకున్నట్లుగా జరిగింది.
    "యీ పిల్లని యీ పిల్లాడు_ యీ పిల్లాడిని యీ పిల్ల."
    "నీకు యింత దునియాల గీ కర్రి పోరే వచ్చిందా? నువ్వు గుడ్డోడివి రవీ! అంది.
    పొంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రవి.
    అలాగే పడుకుని నిద్రపోయారు. మెలుకువ వొచ్చేసరికి సాయంత్రం ఐదు అయింది.
    యిద్దరూ కలిసి కొమరయ్య యింటికి వెళ్ళారు. రాములింకా రాలేదు. కొమరయ్య పోశవ్వ వున్నారు.
    "ఆకలేస్తున్నది. ఏమన్న నాస్త పెట్టు." అంది తల్లిని.
    అటుకులూ బెల్లం పెట్టింది.
    యిద్దరూ కలసి తిన్నారు.
    టీ తాగుతూండగా రాములు వొచ్చాడు.
    "అగొ, నన్నిడిసేసి మజా అంతా మీరె వుడాయిస్తున్నరా!" అన్నాడు రాములు నవ్వుతూ.
    "యేమిటి యేడ్చపోతవు, చాయ్ తాగు" అని కప్పుతో టీ అందించింది అన్నకి.
    వొక గుక్కవేసి, "రవీ సాబ్ యాడికి పోతివి దినామంత కానరాలేదు?" అన్నాడు రాములు.
    రామనాథం యింట్లో జరిగినదంతా వివరించారు_ రవీ, గంగీ యిద్దరూ కలిసి.
    విని, భయపడ్డారు కొమరయ్య, పోశవ్వ.
    పోశవ్వ సన్నగా యేడుస్తూ, "గంగీ యింక వాని కొల్వుకి పోకే" అని కొడుకు వంకా రవి వంకా చూసి, "మీరుగూడ వాని కార్కాన యిడ్సిపెట్టున్రి" అంది.
    మరో గంటకి రవి హోటలుకి వెళ్ళి భోజనం చేసి గూటికి చేరుకుని పుస్తకం తెరిచాడు. యెప్పుడు తీరిక చిక్కినా ఆర్ధికశాస్త్రం పుస్తకాలు యేవో మధిస్తూనే వుంటాడు.
    యిటీవల సాయిలు రెండు నెలలు జబ్బు పడ్డాడు. అతనికి జీతం లేదు. అతని భార్య మంచాన పడింది. ఆ భారం తనమీదే వేసుకున్నాడు రవి. అదే సమయంలో తను బ్యాంకులోను యిప్పించితని పైకిలు చక్రాల బండి_ ఆర్టీసీ బస్సు గుద్దేస్తే తుక్కు తుక్కు అయింది. తప్పు చాలావరకు డ్రైవర్ దే అయినా, బండీ అతనిమీదకే నెట్టేశారు పోలీసులు. ఆ సందర్భంలో పోలీసులతో తగూపడ్డాడు రవి. వర్కర్ల యూనియన్ లీడరని కాస్త తగ్గి మాట్లాడారుగాని_ఆర్టీసీవాళ్ళు నష్టపరిహారం ఇవ్వటానికి వొప్పుకోలేదు. కోర్టుకి వెళ్ళి గెలిచే వీలూలేదు. అతని బండి రిపేరు చేయించి పెట్టాడు. రెండువొందలైంది యిలాంటివే యేవో పనులు_ ఫ్యాక్టరీవాళ్ళవో వాడకట్టువాళ్ళవో.
    రాత్రి ఎనిమిదింటికి భోజనాలయ్యాక గంగీ రాములూ వాకిట్లో చాప వేసుకుని కూచున్నారు.
    "నా కొల్వుపోయె_ నీకు కష్టమైతది." అంది గంగి.
    "యిన్ని దినాలు నీకు కొల్వుంటెనె గడిచెనా!"
    "యెంతైనా కష్టమేగద_ నాయ్నకు మందులకు చాన పైసలై పోతున్నవాయె. టైపు హయ్యర్ నేర్వు, వుద్యోగం తొందరేమి అంటున్నడు రవిసాబ్" అంది.
    "మంచి ఆలోచన. గట్లనెచెయ్యి" అన్నాడు రాములు.
    "రాములన్నా__"
    "వూఁ."
    "మరీ__" అని ఆగిపోయింది.
    వొక నిమిషం తరవాత, "యేమె చెప్పవూ" అన్నాడు రాములు.
    "నేనూ__నేనూ__"
    "నేనూ నేనూ__యేమి నేను? నీవే గంగివి. కండ్లవడ్తనె వున్నవు. ముచ్చటేమొ చెప్పు."
    "కోపం చేస్తవా?"
    "చెయ్య. చెప్పు"
    "నగుతవేమొ__"
    "నగ. చెప్పు."
    "మరి_ _నేను. రవీసాబ్ ని లగ్గమాడ్త" అంది.
    రాములు పగలబడి నవ్వాడు.
    "నీకు పిస వట్టెనే పోరి? రవీసాబ్ చాన గొప్పాయన. ఆయనెవరనుకుంటున్నవ్? చిన్నంతరం పెద్దంతరం మరిస్తివా దోస్తీగా వుంటున్నడని! ఆయన అందరితోటి అట్లనె దోస్తీగ వుంటరు. నువ్వు జరంత అంగ్రేజి నేర్శి టైప్ రైటింగ్ నేరిస్తివని అసుమంటి పిచ్చిపిచ్చి ఆలోచన్లు పెట్టుకోకు" అని దగ్గిరికి జరిగి చెల్లెలి భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేసి, "కోపం చేస్తలేను. నీకు సమజాయిస్తున్న గంతే" అన్నాడు రాములు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS