Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 3

   
    ఇది అడవి. ఇక్కడ క్రూరమృగాలు లేవో, లేక దరిదాపుల్లో లేక కొంత ప్రదేశంలో మాత్రమేసంచరిస్తున్నాయో పరమాత్ముడి కెరుక. క్రూరమృగాలే ఉన్నట్లయితే స్పృహలేని స్థితిలోనే వాటి కాహారం అయేది తను. ఏ జీవుల వల్లా తనకి ప్రమాదం లేదా! ముందు ముందు ఏ ప్రమాదమయినా ఎదురవుతుందా?    
    ఇక్కడ నుంచి తను బైటపడగలదా?    
    తన వునికి ప్రపంచానికి తెలుసా?    
    తనేనా ఇంకెవరైనా ప్రమాదంనుంచి బైటపడ్డారా?    
    ఎన్నో ఆలోచనలు కీర్తిని వేధిస్తున్నాయి.    
    లేచి నిలబడటానికి సాధన చేస్తూనే వుంది కీర్తి.    
    తూర్పున తెలతెలవారు తున్నది.    
    పక్షులు కలకలా రావములు చేస్తున్నాయి.
    
                                                      3
    
    ఆకలి....దాహం...    
    దాహం....ఆకలి...    
    కీర్తి కాళ్ళూ చేతులు ఆధీనంలోకి వచ్చాయి. కాని ఆకలి దాహం విపరీతంగా వేదిస్తున్నాయి. బయలుదేరే ముందు కొన్ని రకాల ఇంజక్షన్స్ పుచ్చుకోటం వల్ల నీరసం మాత్రం లేదు.    
    కీర్తి గాయపడ్డ ఎడమ కాలిని మెల్లగా ఈడుస్తూ ముందుకు నడిచింది.    
    అప్పటికి పూర్తిగా తెల్లవారింది.    
    కీర్తి గాయపడ్డ ఎడమ కాలిని మెల్లగా ఈడుస్తూ ముందుకు నడిచింది.    
    అప్పటికి పూర్తిగా తెల్లవారింది.    
    ఉండి, ఉండి దూరంగా పెద్ద పక్షుల కూతలు చుట్టూ చెట్లమీద పక్షుల కువకువలూ తప్ప మరెటువంటి శబ్దములేదు.    
    ఆ అడవిలో అడవి మృగాల అరుపులు లేవు. భీకర శభ్దాలు లేవు, ఓ విధమైన గంభీరం అంతటా ఆక్రమించుకుంది.    
    కీర్తి కాలు నడుస్తుంటే బెణికినట్లు కలుక్కుమంటున్నది. పదడుగులు వేయటానికి పది నిముషాలు పడుతున్నదా అనిపించింది.    
    కొంతదూరంలో కందిరీగలు గూడు పెట్టుకున్న ఒకనిమొండెం సగం కనిపించింది. ఇంకో చోట కాలిపోయిన దేహం వుంది. మరో చోట మొండి చెయ్యి పడుంది.    
    మొండి చేతికి వాచీ వుంది. అది పురుషుడి చెయ్యి.    
    కీర్తి పరిశీలనగా చూస్తూ ఆ ప్రదేశ మంతా వెతుకుతున్నది.    
    విమానం తాలూకా కొన్ని భాగాలు కాలనివి కాలిపోయినవి అక్కడక్కడ కొన్ని పడున్నాయి.    
    కొందరి సూట్ కేసులు ఎయిర్  బ్యాగ్ లు విసిరేసి నట్లు పడున్నాయి. అనికూడా కాలీ కాలక వున్నాయి.    
    కీర్తి ఎయిర్ బ్యాగ్ చెక్కుచెదర కుండా చెట్టు కొమ్మలకి చిక్కుకని వుంది. చూస్తూనే గుర్తించింది కీర్తి అది తన బ్యాగ్ అని. బ్యాగ్ కనబడినందుకు ఆనందించాలో విచారించాలో తెలియలేదు. చెట్టు కొమ్మల మధ్య బ్యాగ్ వుంది. చెట్టు ఎక్కటానికి కాలు సరిగాలేదు. చెట్టెక్కితే గాని గ్యాగ్ రాదు.    
    కీర్తి ఆలోచిస్తూ అదే చెట్టుక్రింద కూర్చుంది.    
    పది నిముషాలు గడిచిపోయాయి.    
    "ప్రస్తుతం ఆలోచించాల్సింది బ్యాగ్ గురించి కాదు ఆకలి, దాహం అవి తీరే మార్గం" అనుకుని కూర్చున్న చోట నుంచి లేచింది. చుట్టూ వెతకటం మొదలు పెట్టింది.    
    చెట్లకి ఫలాలుంటే తినొచ్చు.    
    ఏ చెట్టుకీ కాయ పూత లాంటివి లేవు.    
    ఆకలయితే ఆకులు తినాల్సిందే.    
    అరగంటకి చాలా భాగం తిరిగి చూసింది కీర్తి. రూపాలు లేని శవాలు, మొండి చేతులు మొండి అవయవాలు వదిలేసి కాస్త బాగా వున్న సూట్ కేసులు రెండు, ఎవరిదో ఓ పెద్ద బ్యాగ్ లాక్కొచ్చి ఓ చోటికి చేర్చింది.    
    ఓ బ్యాగ్ జిప్ తెరిచింది.    
    బ్యాగ్ లో ప్యాంట్లు, షర్టులు మగాడికి పనికొచ్చే దుస్తులున్నాయి. "ఉండనీ" అనుకుంది కీర్తి.    
    సూట్ కేసులు మూతతెరవడం సాధ్యంకాలేదు. రెండో సూట్ కేసు మూత తీయటానికి ప్రయత్నించింది అదీ రాలేదు.    
    కత్తిలా చేతిని చాచి "ఫట్ ఫట్" అమి సూట్ కేసు వెనక భాగంలో బలంగా రెండు దెబ్బ లేసింది.    
    సూట్ కేసు జాయింటు భాగం వూడిపోయింది.    
    సూట్ కేసులో చీరలు జాకెట్లు వున్నాయి. టవల్స్, కాశ్మీర్ శాలువా, నాలుగు కర్ చీఫులు, ఫోటోల ఆల్భం అవన్నీ గాక చిన్న అట్టపెట్టె వున్నాయి.    
    అట్టపెట్టెకున్న దారం విప్పింది కీర్తి.    
    అట్టపెట్టెలో...    
    పంచదార చిలకలు పేర్చివున్నాయి. పాతిక ముప్పై దాకా వుండొచ్చు.    
    ఫారిన్ లో పంచదార చిలకలు దొరకవా?    
    ఎవరైన మిత్రులు తెమ్మంటే మనదేశంలో తయారయే చిలుకలు తీసుకెళుతున్నారా?    
    పంచదార చిలకల్లో రహస్యం వుందా?    
    చిలకల్ని చూస్తుంటే నోరూరుతుంది. ఆకలి అధికమవుతున్నది. ఆకలికన్నా అనుమానం అధికంగా వేధిస్తున్నది కీర్తిని.   
    ఆల్భం తెరిచింది.    
    ఆల్బంలో ఒక్క ఫోటో కూడా లేదు.    
    పంచదార చిలకని తుంచింది.    
    చిలకలో ఏం లేదు.    
    కీర్తి మెల్లగా ఓ చిలకని ముని పంటితో కొద్దిగా కొరికింది. పంచదార చిలకకాబట్టి అది తియ్యగా వుంది. మొత్తం చిలకల్ని లెక్కబెట్టింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS