Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 3


    కాని నేను రామ్ సింగ్ తో హిందీలో బాస్ అన్న మాటలు చెప్పకుండా "రామ్ సింగ్ భాయ్! నీవు చెప్పినచోట వజ్రాలు దాచావో లేదో ఈ రోజు వెళ్ళి చూసివచ్చి నీవు నిజమే చెప్పివుంటే నీవు బతికిపోతావు. మనం ముగ్గురం భాగాలు పంచుకుందాము. నీవు చెప్పింది అబద్ధం ఐతే మాత్రం రేపటితో నీకీ భూమ్మీద నూకలు చెల్లిపోయినట్లే. పరలోకం వెళ్ళి పదిళ్ళలో పాచిపని చేసుకుని బ్రతుకుదువుగాని" అని మాటమార్చి చెప్పాను.


    రామ్ సింగ్ మౌనంగా తల వూపాడు.


    నా బాస్ గాడు నేను రహస్య స్థావరంలో మారుమూల వున్న ఆ గదిలోంచి ఇవతలికి వచ్చాము.


    గది తలుపులకి బయట తాటికాయంత తాళంవేసి ఆ తాళం తాలూకా తాళం చెవిని బాస్ బొడ్లో వున్న మొలతాడుకి తగిలించుకున్నాడు.


    మా స్థావరంలో (మా ముఠాలో) వున్న మా అనుచరులెవరికీ 'రామ్ సింగ్ అనే వక కోటి యాభై లక్షల విలువచేసే వ్యక్తిని అండర్ గ్రౌండ్ లో బంధించినట్లు తెలియదు. తెలిస్తే వాటాలు పెరిగిపోతాయి. రామ్ సింగ్ కి తిండి తిప్పలు అన్నీ బాస్ గాడే స్వయంగా చూసుకుంటున్నాడు. వంటరిగా నేను రామ్ సింగ్ దగ్గరకు వెళితే నయానో, భయానో ఆ వజ్రాల సంగతిని నేనెక్కడ తెలుసుకుంటానో అని వాడి భయం. వెర్రి వెధవ హిందీ వచ్చిచావదు. అతి తెలివి మాత్రం తట్టెడు.


    ఇప్పుడు మాత్రం ఏమయింది. నిజం తెలిస్తే బాస్ గాడు గుండెలు బాదుకుని నిజంగా గుండెకాయ బీట్లువారి మరీ చస్తాడు.


    ఆ పగలంతా మామూలుగానే ఉన్నాను.


    రాత్రి పన్నెండింటికి_


    రామ్ సింగ్ చెప్పిన పాడుబడ్డ ఆ బంగ్లాలోకి వెళ్ళాను. దెయ్యాల బంగ్లా అని దానికి పేరు మానవమాత్రుడు పగలే ఆ బంగ్లాలోకి వెళ్ళడు. ఇహ రాత్రిపూట ఎవరెళతారు నాలాంటి మొండివాడు తప్ప.


    దెయ్యాల బంగ్లాలో దెయ్యాలు ఎదురొచ్చి స్వాగతం ఇవ్వలేదు. దెయ్యాలు వుంటే కదా స్వాగతం ఇవ్వటానికి.


    రామ్ సింగ్ చెప్పినచోట రాయి గుర్తు చూసుకుని గదిలో ఈశాన్య మూలగా మూరెడు లోతు తవ్వి చూశాను.


    రామ్ సింగ్ చెప్పింది నిజమే.


    ఒక కోటి యాభై లక్షల విలువగల వజ్రాలు జానెడు వెడల్పు బాక్స్ లో ప్లాస్టిక్ కాగితంలో చుట్టిపెట్టి ఆ బాక్స్ ని పాతేసి వుంచాడు.


    వాటిని చూసి...


    నా కళ్ళు జిగేల్ మన్నాయి. నా గుండె టకటక కొట్టుకుంది. నా మెదడు వేగంగా పనిచేసింది_లాంటి మాటలు ఇప్పుడు అప్రస్తుతం. నేను వెంటనే రంగంలోకి దిగాను.


    సాధారణంగా దొంగబుద్ధి వున్న ప్రతివాళ్ళూ ఒకేరకంగా ఆలోచిస్తారు. ఏవయినా నిధులు దొరికితే దొరికిన చోటునుంచి దూరంగా తీసుకు వెళ్ళటం...ఒకడు చేసిన పని మరొకడు చేయకపోవటం అలా అన్నమాట.


    ఈ విషయంలో నా బుద్దే వేరు.


    ఆ వజ్రాలున్న పెట్టెని పక్కగదిలోకి తీసుకెళ్లి గది మధ్యగా మూరెడు లోతు తవ్వి పెట్టెని గోతిలో వుంచి పాతేశాను. నేపాతేసిన చోటు నుంచి గోడదాకా అడుగులు లెక్కపెట్టాను.


    సరిగ్గా ఐదడుగులు.


    అయిదడుగులు...గోడనుంచి మధ్యకి అయిదడుగులు. ఈ కొలతని మనసులోనే భద్రపరచుకుని గోతిని మూసేశాను. అక్కడ తవ్వినట్లు ఎవ్వరికీ అనుమానం రానివిధంగా నేలను సర్ది మట్టిని విరజిమ్మి రాళ్ళని, ముళ్ళకంపని అక్కడక్కడ ఆ పాడు పడిన గదిలో పడేశాను.


    నేవచ్చినపని గ్రాండ్ సక్సెస్ గా పూర్తి అయింది. దీనినే తెలుగులో చేపట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తికావటం అనేది.


    ఓసారి పరిసరాలను పరికించి చూశాను.


    మనుషులకేకాదు గోడలకీ కళ్ళు చెవులుంటాయి. నా జాగ్రత్తలో నేను వుండడంలో తప్పు ఎంతమాత్రం లేదు. కాబట్టి ప్రతి నిమిషం జాగ్రత్తపడుతూనే వున్నాను.


    ఆకుకూడా కదలటంలేదు.


    అనుమానాస్పదంగా ఏమీలేవు.


    గుండె నిండుగా వూపిరి పీల్చుకుని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని దర్జాగా ఊరివైపు బయలుదేరాను.


                                        2


    లేచి టైము చూశాను.


    రెండున్నర.


    మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ప్రపంచమంతా హాయిగా నిద్రపోతున్న ఈ రాత్రి... మానసిక శారీరక బాధలున్న వాళ్ళు, నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు... దొంగలు... వీళ్ళుమాత్రం నిద్రపోరు. మరి నాకేమయిందని నిద్ర రావటంలేదు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS