గమనిస్తోంది. అతను నిద్రపోయాడు. ఒక గంట గడిచింది. అంతలో చప్పుడవకుండా మంచం మీంచి లేచాడు. అంటే__ నిద్రపోలేదన్నమాట, నిద్ర నటించాడన్నమాట__అనుకుంది.
మంచం పక్కన నుంచుని శాంత ముఖంలోకి చూశాడు. నిద్రపోతోంది. ఆమె మొహం మీదకి కొద్దిగా వొంగాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. తల పక్కకి తిప్పుకుని__అవతలికి నడిచాడు.
శాంత గమనిస్తూ వుంది.
వంటింట్లోకి వెళ్ళాడు. గమేక్సిన్ పొట్లం తీశాడు. పాలలో కలుపుకున్నాడు. పొడవాటి గ్లాసు చేత్తో పట్టుకుని ముందు గదిలోకి నడిచాడు చప్పుడవకుండా.
శాంతకి గమేక్సిన్ వాసన ఘుప్పున వచ్చింది.
ముందు గదిలోకి వెళ్ళి, గ్లాసు బల్లమీద పెట్టాడు. కూర్చున్నాడు. కంపించాడు. వణికిపోయాడు. కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. మరి కాసేపటికి మనసుని దిటవు చేసుకుని నిశ్చలంగా చూశాడు. యెటో__గ్లాసు చేత్తో పైకి యెత్తి__అంతలోనే బల్లమీదపెట్టి__లేచి టేబుల్ మీంచి కాగితమూ ఓ పుస్తకమూ పెన్నూ తీశాడు. కూర్చుని రాస్తున్నాడు.
'కొందరి జీవితాలు నిరర్ధకమూ దుర్భారమూ. అకారణంగానే కావొచ్చు. యెందుకూ సంసారమూ జీవితమూ? పుట్టిన వెంటనే మరణం అనుసరించాలి. నా చావుకి నా జాతకమే, నా నుదుటి రాతే కారణం__' అని రాసి సంతకం చేసి తేదీ వేశాడు.
ఆ కాగితం మీద పేపర్ వెయిట్ పెట్టాడు.
గ్లాసు అందుకున్నాడు.
దగ్గిరికి లాగివున్న తలుపుల్ని రవ్వంత తెరిచి ఆ సందులోంచి గమనిస్తున్న శాంతకి_అదంతా యేమిటో అర్ధమైంది.
తలుపులు తెరుచుకుని తటాలున లోనకి వచ్చింది శాంత. అనుకోని సంఘటనకి తుళ్ళిపడి, గ్లాసు బల్లమీద పెట్టి, "యింకా నిద్రపోలేదా శాంతా?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"మెలుకువొచ్చి చూస్తే మీరు కనిపించలేదు. చూస్తే యిక్కడున్నారు. ఒక్కరే దేనికి నేను లేను తోడు?" అని అతని పక్కన కూచుని, "పాలు ఒక్కరే తాగుతున్నారా? నేనేం పాపం చేశానండీ? సొంత భార్యని నాకూ కాసినిస్తే తాగుతాను కదండీ?" అని తటాలున గ్లాసు అందుకుని రెండు గుక్కలు వేసింది.
చేత్తో గ్లాసుకేసి విసిరికొట్టాడు. గ్లాసు అవతల గచ్చుమీద పడి పగిలింది. పాలు విస్తరించుకుని కాలవగానూ కదలుతున్నాయి.
"పాలు తాగడానికి కూడా నాకు అర్హత లేదాండీ?" అంది.
"ఆ పాలూ__ఆ పాలూ__"
"ఆ పాలేమిటో నాకు తెలుసు. అందుకే అవి నేనే తాగదలిచాను. నోటి దగ్గిరి కూడు లాంటి పాలు లాగేశారు. నేనంత పాపాత్మురాలినండీ? గమేక్సిన్ కలిసిన పాలు నాకు చాలా యిష్టమండీ. చాలా రోజులుగా తాగుదామనుకుంటున్నా" అంది.
"శాంతా నువ్వు నిద్రపోలేదా?"
"వుఁహూఁ."
"నిద్రపోతున్నట్లుగా పడుకున్నావెందుకని?"
"యేమో__యిందుకేనేమో"
సుబ్రహ్మణ్యం కళ్ళనిండా నీళ్ళు.
అతనిని తన ఒళ్ళోకి లాక్కుని, "చెప్పండి, మీరెందుకో పెళ్ళయిన మొదటి నుండి ఘోరంగా బాధపడుతున్నారు. నన్ను అనుమానిస్తున్నారు__అని కొంత కాలానికి గ్రహించాను. యెందుకు అనుమానిస్తున్నారో అర్ధమవలేదు. అనుమానం రాతగినట్లుగా నైనా నేనెన్నడూ ప్రవర్తించలేదు. నేనేమీ చెయ్యకుండా నన్నెందుకు అనుమానిస్తున్నారో అర్థంకాలేదు. పోనీ తార కారణంగానా అనుకుంటే__ఆ విషయం మీకు తెలియనప్పటి నుండీ తొలిరాత్రి నుండీ అనుమానిస్తూనే వున్నారు. తార మా యింట్లో తప్ప పుట్టింది. మిగతా పిల్లలం అందరం ఒక తీరు. మా వంశమే నిప్పులాంటి వంశం. అసలు యెందుకు అనుమానిస్తున్నారో చెప్పండి" అంది.
"అనుమానించడమా?" అన్నాడు నిదానంగా.
"తప్పించకండి. దాచకండి. మీకు పుణ్యం వుంటుంది. యీ స్థితికి యెందుకొచ్చాం? ఏనాడైనా నేను అపసవ్యమైన పని ఏదైనా చేశానా? మా పుట్టింటివాళ్ళు మీకు లోపమేమన్నా చేశారా? అసలు తొలిరాత్రే నన్నెందుకు అనుమానించారు? నా గురించి మీకెవరో యేవేవో కల్పించి చెప్పి వుంటారు. యెవరో చెప్పండి. నిజానిజాలు తేల్చుకోవచ్చు. అనవసరంగా నన్ను హింసిస్తూ మీరు హింస పడుతూ__చెప్పండి. మీకు పుణ్యం వుంటుంది. చెప్పకపోతే__నేను కొన్నాళ్ళుగా అనుకుంటున్న పని చేసి తీరతాను__దొడ్లో బావిలో దూకి చచ్చిపోతాను, చెప్పండి, నామీద మీకు యెవరు యేం చెప్పారో__" అంది ఆవేదనగా ఆవేశంగా.
"లేదు శాంతా, నీమీద నాకెవ్వరూ యేమీ చెప్పలేదు. నిజమే. మీ అక్క తార విషయం__"
మధ్యలోనే అందుకుని, "దాన్ని మా అక్క అనకండి. మా యింట్లో యెవరూ దాని పేరెత్తరు. దానికి ఘటశ్రాద్ధం పెట్టేశాడు మా నాన్న, దాని సంగతి తెలిసిననాడే" అంది.
"ఆమె విషయం తెలియక ముందునుండీ తొలిరాత్రి నుండీ అనుమానిస్తూనే వున్నాను. నిజమే తొలిరాత్రి నుండీ అనుమానిస్తున్నాను" అన్నాడు.
బాధతో ఒకలాంటి అవమాన భారంతో కిందకి జారింది శాంత, పడిపోయినట్లుగా.
చటుక్కున, సుబ్రహ్మణ్యం నేలమీదకి కూలబడి, "శాంతా" అన్నాడు ఆమె భుజంమీద చెయ్యి వేస్తూ.
ఒక నిమిషం. శాంత లేచికూచుని, అతని తల ఒళ్ళోకి తీసుకుని, అతని ముఖంలోకి చూస్తోంది. కళ్ళలో నిండిన నీళ్ళలోంచి రెండు బొట్లు రాలి అతని తలమీద పడ్డాయి.
అతని ముఖాన్ని రెండు చేతుల్లోకీ తీసుకుని, ప్రేమగా చూస్తూ "చెప్పండి, నా ప్రవర్తనలో యేదన్నా దోషం వుంటే__అజ్ఞానం వల్లనేగానీ తెలిసి కాదు. చెప్పండి యెందుకు అనుమానించారో చెప్పండి" అంది.
సుబ్రహ్మణ్యానికి ఏడుపోచ్చింది.
ఆమె చేతుల్ని ముఖం మీదకి జరుపుకుని ఏడ్చేశాడు.
"చెప్పండి, చెప్పరూ? చెప్తే, మీ సంతోషం కోసం నా ప్రాణాలైనా వదులుకుంటాను చెప్పండి" అంది.
"శాంతా నువ్వు పవిత్రురాలివి. నేనే. నేను నాలో దాచిపెట్టుకున్నదేదో పెనుభూతంలాగా లేచి నన్ను ఆవహించి__నిన్ను అనుమానించాననిపిస్తోంది. నేను పాపాత్ముణ్ని. నేను రాక్షసుణ్ని. నిన్ను చంపుకు తిన్నాను" ఏడ్చేస్తున్నాడు.
