Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 27


    "కాదు. అంత ప్రత్యేకంగా నన్ను గుర్తుంచుకున్నందుకు"
    "మిమ్మల్నెవరైనా గుర్తుంచుకుంటారు. నిజానికి మర్చిపోలేరు."
    "అది ఒకవేళ నిజమే అయినా, మీరు యెవరినైనా ప్రత్యేకం గుర్తుంచుకోవటం జరిగాలిగా!" అంది.
    "మిమ్మల్ని కూడా అంటారా?"
    "మిమ్మల్ని మీరే గుర్తుంచుకోని వాళ్ళు" అని, శ్రీపతి ముఖంలోకి చూసి, "మీ అవ్వగారు బావున్నారా?" అంది.
    ఆశ్చర్యంగా చూస్తూ, "మీకెలా తెలుసు?" అన్నాడు.
    "రమాదేవి చెప్పింది, మీ యింటి సంగతులు. అదొక్కటేగా దారం. చాలా ముఖ్యమైన దారం" అంది.
    "ఆవిడకేం లోటు? అన్నీ వున్నాయి" అన్నాడు.
    "యెవరికేమి లోటూ ఉండదు_లేదనుకోపోతే అంది.
    "మీ మిత్రురాలి బర్త్ డే కేండిల్స్ చివరికొస్తూ వుండి వుండాలి." అన్నాడు.
    చిన్నగా నవ్వి లేచింది.
    నడుస్తున్నారు మౌనంగా. నల్లని వెడల్పాటి తారు రోడ్డు.
    "అనంత్ ఈ మధ్య నాకూ ఓ వుత్తరం రాశాడు" అన్నాడు.
    "అక్కడికి, నాకేదో ఉత్తరాలు వస్తున్నాయని చెబితే చెప్పినట్లు అదేం చెప్పటం!" అంది.      "ప్రత్యేకం చెప్పక్కర్లేదని!"
    "వుత్తరం. యేవని?" అంది.
    "అక్కడ బోర్ కొడుతోందిట అనంత్ కి"
    "స్టేట్స్ లో బోర్ కొడుతోందనీ యెవరన్నా రాస్తే నమ్మొచ్చునా!"
    "అనంత్ రాస్తే నమ్మొచ్చు."
    "యేఁవోఁ!"
    తల పక్కకి తిప్పి ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు నిశ్శబ్దంగా.
    తనూ నవ్వేసింది, నిశ్శబ్దంగా.
    "మీ సినిమా!" అంది స్వప్న రాగలీన, రిక్షాలో కూచుంటూ.
    "చెప్పానుగా!" అన్నాడు శ్రీపతి.

                                 82

    పెళ్ళయి గడిచిన ఆరు నెలలుగా సుబ్రహ్మణ్యం చిక్కి శల్యమయ్యాడు. అంతకంటే మించి మనిషి కుంగిపోయాడు. బ్యాంకుకి వెళ్ళిన దగ్గర్నుంచి యింట్లో యేం  జరుగుతుందోననే ధ్యాస.
    భార్య శాంతకి ప్రియుడు వుత్తరం వ్రాస్తే చదువుకుంటున్నదో, లేదూ, అతనికి శాంత శృంగారం వొలికిస్తూ వుత్తరం రాసి ఆ పోస్టు డబ్బాలో వేసిందో_ ఆ యువకుడెవడో యింట్లోకి వచ్చి చేరాడో_ వాళ్ళని శృంగార కార్యకలాపాలలో రకరకాలుగా వూహించుకుంటూ కొట్టుకులాడిపోతూ_ బ్యాంకు పనిలో తప్పులు చేసి నానా చివాట్లూ తింటున్నాడు. "యిది బ్యాంకు వుద్యోగం, ప్రభుత్వోద్యోగం కాదు. అంకెలతో పని. బ్యాంకు పరువు తీసేయకు. పీకలమీదికొస్తుంది__" అని చివాట్లేశాడు బ్యాంకు మేనేజరు.
    యింటికొచ్చిన దగ్గిర్నుంచీ__తను లేని సమయంలో జరిగి వుంటుందనుకునేదంతా తలుచుకుని భార్యని దగ్గిరికి తీసుకోలేకపోవటం. మళ్ళీ ఒక్కోసారి శాంత తప్పేమిటో బోధపడదు. అనవసరంగా హింసిస్తున్నానేమో పాపం అని అనుకుని ప్రేమగా దగ్గిరికి తీసుకోబోతాడు. అంతలోనే వాళ్ళూ, వాళ్ళ చేతుల్లో ఆ శరీరం నలిగినా తన తలంపులు గుర్తొచ్చి దూరంగా జరిగిపోతాడు.
    శాంత అర్ధరాత్రుళ్ళు ఒక్కతే ఏడవటం గమనించాడు. ప్రియుడి కోసం కాబోలు. తన ఆట వాటంగా సాగడం లేదని కాబోలు__అని అనుకుని మంటగా కందిపోతాడు.
    కానీ శాంత కూడా చిక్కి శల్యమైపోయింది. ముఖాన వెనకటి కళా కాంతీ లేవు.
    "తను అనుకునేది నిజమైతే మొహం మరీ అంతగా యెందుకు కళా విహీనమైపోతుంది? తనలో నాటకం ఆడుతున్నతనమూ కనిపించదు. అనుకూలంగా వుంటాది. ప్రతిదానికీ నేనే విపరీతార్ధాలు తీస్తున్నానేమో__" అనీ బాధపడతాడు. మళ్ళీ అంతలోనే, "ఆడదానికి ఒక్క మొగుడంటేనే యిష్టం వుండదు. పెళ్ళికి ముందు పెళ్ళిచూపులకి వచ్చిన వాళ్ళలో ఒకతను వచ్చాడని యెంత ధైర్యంగా చెప్పిందీ. అంతటిది యెంతకేవీ తెగించగలదు. యెన్ని గ్రంథాలైన చాటున సాగించగలదు__ అని మరికాసేపు గిజగిజలాడిపోతాడు, తారసపడతాడు.
    యెన్నోసార్లు చెడామడా తిట్టాడు. నోరెత్తలేదు. కానీ యెప్పుడూ చెయ్యి చేసుకోలేదు. 'కొడితే__కొడితే, లేచిపోతుందేమో, నొప్పెట్టి __ బోడి మొగుడు వీడితో ఏంటి, చావగొడుతూంటే__అని అనుకుని చక్కా లేచిపోతుందేమో, వాళ్ళలో ఒకడితో__' అని కాసేపు వాపోతాడు లోలోన.
    అలా రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చుని హింసపడుతూంటే, ఒక్కోసారి కళ్ళవెంట నీళ్ళొస్తాయి_అతనికి.
    శాంత ఒకసారి అది గమనించింది. అప్పటినుంచి అతనిని గూఢంగా నిశితంగా పరిశీలించసాగింది. యేదో తెలియని బలమైన కారణంతో బాధపడుతున్నాడని గ్రహించింది.
    అతని మాటల సారాంశాన్ని బట్టి తనని అనుమానిస్తున్నాడని నిర్ధారించుకుంది శాంత. కానీ తన ప్రవర్తన యేనాడూ అనుమానానికి అవకాశమిచ్చేలాగా వున్నట్లు తనకి అనిపించలేదు. దొడ్లో వున్న నూతులో పడి చచ్చిపోవాలని అనుకుంది చాలాసార్లు.
    యివాళ సాయంత్రం వచ్చిన దగ్గిరినుంచి భర్త అదోలాగా వుండటం గమనించింది శాంత.
    రాత్రి యెనిమిదికి భోజనాలు. యిద్దరిలో యెవరూ యేరోజూ సరిగా తినటం లేదు. కూర్చుని నాలుగు మెతుకులు కెలికి_లేస్తాను మౌనంగా_మాట్లాడుకోవటం కూడా తక్కువే_యెవరైనా బయటివాళ్ళుంటే తప్ప.
    పడుకున్నారు. మంచం ఒకటే. సుబ్రహ్మణ్యం నిద్రపోతే మాత్రం నిద్ర కొద్దిగా మెలుకువొచ్చి, ఆ మగత నిద్రలో భార్యని దగ్గిరికి లాక్కుని తన దాహాన్ని రకరకాలుగా తీర్చేసుకుంటాడు. ఆ వెంటనే మంచం అంచువైపు జరిగి పడుకుంటాడు. ఆపైన నిద్రపోతాడు__అలసటలోంచి. అలా గంటో గంటన్నరో__మెలుకువ వచ్చి లేచి ముందు గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని మోకాళ్ళమీద తలపెట్టుకుంటాడు.
    యివాళ అతనికి అసలు నిద్ర రాలేదు.
    శాంత, పదిగంటల వేళప్పుడు నిద్రపోయినట్లుగా పడుకుంది. అతనిని గమనిస్తోంది కొన్ని రోజులు ఓ గంట నిద్రపోయి, మెలుకువ వచ్చి నిద్రమత్తులో తన బట్టలన్నీ పీకేసి మరీ గొడవచేసి__చివరికి తను నిద్రపోయాననుకోగానే ముందు గదిలోకి వెళ్ళిపోయి__


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS