ఓదార్చుతుంది శాంత.
ఐదు నిమిషాలకి అతని యేడ్పు తగ్గింది.
ఆమె అతని చెంపలకి చేతులు ఆన్చి, నుదుటిమీద చిన్నగా పెదాలు అద్ది__కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, "మీరు మంచివారు. ఏ శాపవశానో యిట్లా జరిగింది చెప్పండి. అసలు నన్నెందుకు అనుమానించడం జరిగిందో. నా మీద యెవరో యేదో చెప్పి వుంటారు, నమ్మకం కలిగేటట్లు. దొంగ వుత్తరాలు చూపెట్టివుంటారు. లేకపోతే మీరు అట్లా వుఁహుఁ_ మీరు అట్లాంటివారు కాదు. చెప్పండి. అవును కదా?" అంది.
"కాదు" అని ఆమె వొళ్ళో పక్కకి జరిగి పడుకున్నాడు. అతని తల ఆమె పొట్టకి ఆనుతోంది.
ఆమె, అతని జుట్టూ నుదురూ చెంపలూ భుజాలూ నిమురుతోంది. రెండో చేత్తో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది.
ఒక చెయ్యి ఆమె తొడమీద ఆనించి, గచ్చువంక చూస్తూ_వేదవతి గాథ అంతా చెప్పుకుపోతున్నాడు. చెప్పుకుపోతూంటే అతని కళ్ళవెంట నీళ్ళు కారుతూ వున్నాయి. ఆవేదన వస్తుంది. ఆవేశం వస్తుంది. దుఃఖం వస్తుంది.
అతను చెప్పటం అయిపోయింది.
విపరీతంగా అలిసిపోయినట్లుగా నిద్రపోయాడు, అలాగే మరుక్షణంలో.
ఆమె అలాగే ఒక అరగంట కూచుని_జరిగి, కాలు తప్పించుకుని అతని పక్కనే పడుకుని, అతని తలని తన జబ్బమీదకి జరుపుకుంది. ఐదు నిమిషాల్లో నిద్రపోయింది.
ఉదయం యిద్దరికీ ఒక్కసారే మెలుకువొచ్చింది. యిద్దరికీ "పునర్జన్మ"లా అనిపించింది. ఒకరి కళ్ళలోకి ఒకరు తృప్తిగా చూస్తూ_ఒకరినొకరు దగ్గిరికి సున్నితంగా హత్తుకుంటూ_"శాంతా" అని గాఢంగా సుబ్రహ్మణ్యమూ, "ఏమండీ" అని శాంతిగా శాంతా ఒకేసారి పలికారు.
83
నిరుడు అక్టోబరులో వుద్యోగంలో చేరినప్పటినుంచి సక్రమంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూంది చారుమతి. వేసవి సెలవుల్లో కూడా హెడ్ మిస్ట్రెస్ చెప్పిన పనులు చేస్తుండేది వెళ్ళి.
తీరా, యీ జూన్ లో బళ్ళు తెరవగానే వెళ్ళిన మొదటిరోజునే, వూస్టింగ్ ఆర్డర్ కాగితం యిచ్చింది హెడ్ మిస్ట్రెస్.
ముందుగా వూహించనందున చారుమతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నేనేం చెయ్యగలను పైనుంచి వచ్చే ఆర్డర్స్." అని కసురుకున్నట్లుగా అంది హెడ్ మిస్ట్రెస్.
దిగులుగా ఇంటికొచ్చి పడుకుంది. తల్లి అడిగితే, ఒంట్లో బాగాలేదని చెప్పింది.
సాయంత్రం తండ్రి వచ్చాక విషయం చెప్పింది. మరికాసేపటికి వరాహశాస్త్రి వచ్చాడు, "బ్రోచేవారెవరురా" అని శృతించుకుంటూ.
ఆ తరవాత_తండ్రి భానుమూర్తి, అన్న వరాహశాస్త్రీ_స్వయంగానూ తమకి తెలిసినవాళ్ళ ద్వారా వాకబు చెయ్యగా తెలిసిన విషయాలు : ఆ హెడ్ మిస్ట్రెస్ కి బంధువు ఒకామె ఈ ఏడు కొత్తగా బి.యెడ్. పాసయ్యింది. ఆ వుద్యోగం ఆమెకి యిప్పించాలని ప్రయత్నించారు. ఆ అమ్మాయి తండ్రి కాస్త వున్నవాడు. హెడ్ మిస్ట్రెస్ అనుకూలతతో సహకారంతో, డి.యి.ఓ. ఆఫీసులో అవసరమైన ముడుపులు చెల్లించుకునీ కొంత పలుకుబడి ఉపయోగించీ ఆ వుద్యోగం ఆమెకి ఇప్పించారు_ పర్మినెంట్ అప్పాయింటుమెంటుగా, చారుమతి నియామకం కేవలం తాత్కాలికం అయినందున, హెడ్ మిస్ట్రెస్ ప్రతికూలమైన ఒక రిపోర్టు రాసిచ్చింది_చారుమతి ఇన్ సబార్డినేట్, బాధ్యతారహితంగా అశ్రద్ధగా పిల్లలతో క్రూరంగా ప్రవర్తిస్తుందని.
యివన్నీ తెలుసుకున్న మీదట_ఇంత గ్రంథం జరపగలిగిన వాళ్ళని మనమేం చెయ్యగలం! మనకింతే ప్రాప్తి వుంది_అనుకున్నారు నలుగురూ సమిష్టిగా.
ఆ రెండో రోజున చారుమతి తండ్రి భానుమూర్తి అన్నాడు కూతురితో__
"చారుతల్లీ ఓ పని చేసి చూడు. డి.సి.ఐ. నాగిరెడ్డిగారని బహు యోగ్యుడని అన్నారు అందరూ. డబ్బుకీ దేనికీ కక్కుర్తిపడని లొంగని మనిషి అనీ, రూల్స్ ననుసరించి పోతాడనీ, తన దృష్టికి ఏదైనా అన్యాయం వస్తే దాన్ని సరిచేస్తాడనీ, అవసరం అయితే దోషుల్ని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడనీ చెప్పారు. పోనీ ఒకసారి వారిని చూడు. నీ అదృష్టం యెలా వుందో__" అని అడ్రసు కాగితం యిచ్చాడు.
"ఇంటికెళ్తే మాట్లాడరేమో?" అంది చారుమతి.
"యిటువంటి సందర్భాల్లో ఆఫీసులో అనుకూలంగా వుండదు. వివరించడానికి కూడా. ఫరవాలేదు యింటికే వెళ్ళిచూడు" అన్నాడు భానుమూర్తి.
మరుసటిరోజు మూడింటికి వెళ్ళింది.
ఆఫీసు కెళ్ళినట్లూ, నాలుగింటికి వస్తారనీ చెప్పాడు పనిమనిషి.
నాగిరెడ్డి వచ్చేసరికి ఐదు అయింది.
ఐదున్నరకి చారుమతి కూర్చున్న గదిలోకి వచ్చిన మనిషిని చూసి అతనే నాగిరెడ్డి అని భావించుకుని, అమాంతం లేచి నమస్కారం చేసింది.
యేమిటి? అన్నట్లుగా చూశాడు నాగిరెడ్డి.
"సార్. నా పేరు చారుమతి. సెన్స్ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ని. ఫస్ట్ క్లాస్ వచ్చింది. నాకు క్రితం అక్టోబరులో టీచరు వుద్యోగం ఇచ్చారు. మొన్న రీఓపెనింగ్ రోజున వూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు" అంది.
"10-A. టెంపరరీ పోస్టింగా" అన్నాడు.
"అవును సార్. కానీ క్లియర్ వేకెన్సీ"
"యెక్కడ?"
చెప్పింది.
"మరెందుకు తీసేశారు?"
ఆ విషయాలన్నీ వివరించింది.
"మరి అది ఆధారంగా తీసేసి వుంటారు 10-A పోస్టింగ్ కి కారణాలు చూపక్కర్లేదు" అన్నాడు.
"అవన్నీ పచ్చి అబద్ధాలు సార్" అంది.
"మరి యెందుకు తీసేసినట్లు?"
"అవన్నీ చెప్తే పితూరీ చెప్పాననుకుంటారేమో"
"నేను యెట్లా అనుకున్నా__ నువ్వు చెప్పాల్సిన వివరాలు చెప్పాలిగా చెప్పు" అన్నాడు నాగిరెడ్డి.
"యీ వివరాలన్నీ మా నాన్నగారూ అన్నయ్యా తెలుసుకుంటే తెలిశాయి. మరొకామెకి యెందుకు ఏవిధంగా ఇచ్చారో" అని ఆ వివరాలు చెప్పింది.
