ఆమె కళ్ళలో నీళ్ళు.
ఆ కన్నీళ్ళు, బాధ కన్నీళ్ళు.
చూసి, "దేనికి?" అన్నాడు.
"ఏడ్వలేక, నవ్వలేక." అని, భారంగా రెప్పలు వాల్చింది, గంగి.
81
క్రితం నెలలో శ్రీపతి ఓ ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్ తో హోటల్లో కూచుని మాట్లాడుతుండగా, "నేను యు.పి. వెళ్ళాలనుకుంటున్నాను వచ్చేవారం. రిపోర్టింగ్ అనుభవానికి యిప్పుడు అక్కడ చాలా బాగుంటుంది. అందుకని ఇవ్వాళ సినిమా చూద్దాం కలిసి" అన్నాడు హిందీలో అతను జర్నలిజం డిపార్ట్ మెంటులో అదివరకు చదివాడు. అలా పరిచయం.
హోటలు బయటికొచ్చాక, "మీరూ రాకూడదూ?" అన్నాడు అతను.
"వస్తున్నాగా" అన్నాడు శ్రీపతి.
"సిన్మాకి కాదు. యు.పి. కి" అన్నాడు అతను.
"యింకాస్త ముదిరాక వస్తాలే మిమ్మల్ని చూడటానికైనా" అన్నాడు శ్రీపతి.
"ఆఫీసులో రెండు నిమిషాలు పనుంది. ఫిలింకి యింకా టైం వుందిగా. వెళ్ళేసి వద్దాం__దారిలోనే." అన్నాడు.
"సరే" అన్నాడు శ్రీపతి.
"మీరూ రండి మా ఎడిటర్ ని చూద్దురు" అన్నాడు.
వెళ్ళాడు. పరిచయం చేశాడు.
శ్రీపతిని, "మీరేం చేస్తున్నారు?" అన్నాడు ఎడిటర్.
"యేమీ చెయ్యటం లేదు. జర్నలిజం చదువుతున్నాను." అన్నాడు శ్రీపతి.
"పూరి అయిపోయింది" అని అందించాడు శ్రీపతి మిత్రుడు.
"మంచి నేర్పుగల జర్నలిస్ట్ అవటానికి జర్నలిజం చదవక్కర్లేదు" అన్నాడు శ్రీపతి.
ఆ ఎడిటర్ కి వుత్త గ్రాడ్యుయేషన్ డిగ్రీకూడా లేదు. కానీ మంచి సమర్ధత వున్న ఎడిటర్.
"మా శ్రీపతిగారికి యిప్పటికి నాలుగైదు ఫస్ట్ క్లాస్ యం.ఏ.డిగ్రీలున్నాయ్" అన్నాడు అతను హిందీలో.
"వెరీ ఇంటరెస్టింగ్" అని శ్రీపతితో కబుర్లు ప్రారంభించాడు ఎడిటర్.
పావుగంట కబుర్లు.
"మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలనిపిస్తోంది. ఎప్పుడన్నా ఏం తోచనప్పుడు రండి" అన్నాడు ఎడిటర్. అతనికి యాభయ్యేళ్ళుంటాయి.
సినిమాకి ఆలస్యం అయిపోతుందేమోనని ఇదవుతున్న శ్రీపతిమిత్రుడు కదలదీశాడు.
ఆ మిత్రుడు ఉత్తరప్రదేశ్ వెడుతున్నప్పుడు ఆ ఎడిటర్ శ్రీపతికి కబురుపెట్టాడు_ఆ పోస్ట్ లో అతను చేస్తాడేమో చెప్పమని.
అడిగితే, "చూద్దాం నాలుగు రోజులు" అని ఆ మిత్రుడితో అని వెళ్ళి చేరాడు.
జర్నలిజం టెక్నికాలిటీస్ అన్నీ చదువులో నేర్చుకున్నవే. అందుకని శ్రీపతికి ప్రత్యేకం చెప్పాల్సినవి యేమీలేవు. అనుభవంలో తెలుసుకోవాల్సినవి తప్ప. అవి చెప్పేవికావు.
శ్రీపతి రాసే ఇంగ్లీషు, రిపోర్టింగు, అవగాహనా, నేర్పు, వివిధ విషయాల పరిజ్ఞానమూ చూసి, "సబ్ ఎడిటర్ పోస్టు వచ్చినప్పుడు మీకిస్తాను" అన్నాడు ఎడిటర్.
"సంతోషం. కృతజ్ఞతలు. కానీ నన్ను నమ్ముకుని ఇంకొకర్ని వదులుకున్నాననే స్థితి వద్దు." అన్నాడు శ్రీపతి.
వెంటనే అర్థంకాక, క్షణకాలం అలాచూసి అర్ధమయ్యి, పకపకా నవ్వాడు ఎడిటర్.
ఆ పని వుద్యోగంలా కాక, అదో వ్యాపకంలా చేస్తున్నాడు శ్రీపతి.
ఈ జూన్ నెల మొదటి ఆదివారం సాయంత్రం__టివోలీలో సినిమా చూద్దామని అబిడ్స్ లో బస్సెక్కాడు. రద్దీగా వుంది. నుంచున్నాడు.
కాస్త అవతలగా రద్దీలో నుంచుని స్వప్నరాగలీన.
ఆశ్చర్యంగా చూసి జనాన్ని తప్పించుకుని దగ్గిరికి వెళ్ళి "స్వప్నా" అన్నాడు శ్రీపతి.
సంతోషంగా చూస్తూ, "మీరా!" అంది.
"మీరు యిలా బస్సు రద్దీలో...."
"నాకుమాత్రం కారెక్కడిది! బస్సులే" అంది.
"అతి వినయం."
"మీరు ఆమాట అనేట్లయితే వెంటనే బస్సుదిగిపోయి మా బాబాయికి ఫోన్ చెయ్యాల్సివస్తుంది. సొంత కారు గ్యారేజ్ లో వుంది ప్రభుత్వవాహనం పంపించడు. అంచేత టాక్సీలో బిక్కుబిక్కుమంటూ వెళ్ళాలి" అంది.
"మీ పుణ్యం అంతపని చెయ్యకండి. యీ మహా తోపుడు రద్దీలో కులాసాగా ప్రయాణించండి" అని చిన్నగా నవ్వాడు.
"ఎందుకా?" అంది.
"మాంటీస్. లేదూ, క్లాక్ టవర్."
"మీరు?"
"క్లాక్ టవర్" అంది.
సీట్లు ఖాళీ అవుతున్నా వీళ్ళకి దొరక్కుండానే బస్సు ప్యారడైజ్ థియేటర్ మలుపు తిరిగింది.
మాంటీస్ దాటింది. క్లాక్ టవర్. ఇద్దరూ దిగారు.
"యెటు" అంది.
"టివోలీలో సినిమా కని"
"యింకా కనలేదుగా!" అంది.
నవ్వి, "అవును, కనలేదు. కనటానికి" అని "మీరు?" అన్నాడు.
"మారెడ్ పల్లిలో ఓ మిత్రురాలి బర్త్ డేకి."
"నా సినిమాకి మీ మిత్రురాలి బర్త్ డేకీ కలవదు" అని నవ్వాడు.
"అది పొద్దుట పూట పుట్టింది పుట్టటం ఐపోయింది. అంచేత దాని పుట్టినరోజు రేప్పొద్దుటి దాకా వుంటుంది. కాగా ఆ పార్టీ గుంపు అంతా నాకు అంతగా నచ్చదు. కాస్త ఆలస్యంగా వెళతాను. పదండి. ప్రశాంతంగా వుండే చక్కటి ఈ రోడ్డు వెంట టివోలీ దాకా వస్తాను" అంది.
"ఓ షరతు. మళ్ళీ నేను మిమ్మల్ని యిక్కడిదాకా తీసుకొచ్చి దిగబెడతాను. యీ రోడ్డు మరీ నిర్జన ప్రదేశం" అన్నాడు.
"యింతకే! కాగా అంతలో మీ సినిమావేళ అయిపోతుంది" అంది.
"సినిమాకి వెళ్తే ఏముంది? యెక్కడి నుంచి యెక్కడి వరకు యెటు నుంచి యెటు చూసినా ఒకటే" అన్నాడు.
"అర్థం అవుతుందా?" అంది.
"వుంటేగా!" అన్నాడు.
నవ్వింది. అదే సవ్వడి, స్వప్నరాగలీన నవ్వు సవ్వడి; స్వప్నరాగ లీన నవ్వు సవ్వడి.
టివోలీ మలుపుకి యివతలగా వున్న పార్కులోకి దారితీశాడు శ్రీపతి.
పచ్చికమీద కూర్చున్నారు.
గచ్చకాయరంగు చీర. చందనం పరిమళం.
"పత్రికలో పనిచేస్తున్నారటగా?" అంది.
"యెవరు చెప్పారు?"
"మీవంటి ప్రసిద్దుల గురించి యెవరొకరు చెబుతూనే వుంటారు." అంది.
"అర్ధం చేసుకుంటే అన్యాయం మాట. అపార్థం చేసుకుంటే డేమేజింగ్ మాట" అన్నాడు.
"పత్రికలో ఏం చేస్తారు?" అంది.
"పత్రిక పని"
"అబ్బ మీతో యిదే చావు. ఏంపని అంటే_ మీరేం పని చేస్తారని"
"నేనూ పత్రిక పనే!"
"మీరేమీ మారలేదు."
"యెక్కడో నూటికీ కోటికీ ఒకరికి జెండర్ మారిపోతుంది" అని నవ్వాడు.
నవ్వి, "మీరు నూటికి కోటికీ ఒకరిలో వారేగాని జండర్ బ్లండర్ విషయానికి కాదు" అంది.
"మనం కలుసుకుని కొన్ని నెలలవుతుందనుకుంటాను?" అన్నాడు.
"మీరు గమనించటం విశేషం!"
"అంత మొద్దునా!"
