"బ్రహ్మాండంగా వుంది. నీవు చెప్పిన చెప్పిన కథ నాకూ నచ్చింది" అన్నాడు రామ్ సింగు.
"పోలీసువాడు ఎప్పుడూ తెలివితక్కువ వాడిలాగా వుండడు. తెలివిగలవాడు పోలీసు అవుతాడు. అతి తెలివితేటలు కలవాడు కూడా పోలీసు అవుతాడు. కొండొకచో ఆమ్యామ్యా పెట్టేవాడు కూడా పోలీసు అవుతాడు వర్ధనరావు ఇన్ స్పెక్టర్ అయ్యాడూ అంటే కేవలం తెలివితేటల వల్లకాదు. అతి తెలివితేటలవల్ల అయినా అయుంటుంది. ఆమ్యామ్యా కేసయినా అయుంటుంది. ఏది ఎలా అయినా దొంగవాడి చేతిలో కత్తికన్నా పోలీసువాడి లాఠీకే బలం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది" ఎంతో దూరం ఆలోచించిన నేను అప్పటికప్పుడే రామ్ సింగ్ తో కలిసి మాటల దగ్గరనుంచీ డేట్ లతో సహా పకడ్బందీగా పథకం వేశాను.
దీనివల్ల__
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు మమ్మల్ని విడివిడిగా పిలిచి ప్రశ్నించినా మా ఇద్దరినీ ఒకే మాటలు అవుతాయి. మేము చెప్పే మాటలుగానీ, ఆ ఘటనలు గానీ తేదీలుగాని వేటిలోనూ పొరపాటు రాదు.
"మనం ఇక్కడినుంచీ క్షేమంగా బయటపడతామంటావా?" రామ్ సింగు అడిగాడు.
"పడతాం! కాకపోతే అది ఎప్పుడు? ఎలా? అన్నదే నాకూ తెలియదు. పెద్దలు వెయిట్ అండ్ సీ అన్నారు. చూద్దాం మనంకూడా" అన్నాను నేను.
రామ్ సింగు ఆలోచిస్తూ కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆటోచిస్తూ వుండిపోయాను.
"బాస్ వున్నాడో, వూడాడో? నువ్వేమన్నా చెప్పగలవా భాయ్" రామ్ సింగు అడిగాడు.
"ఉంటే లాభం, వూడితే ప్రమాదం" ముక్తసరిగా అన్నాను.
"అదేంటి?"
"అదంతే!"
"అదంతే అంటే! నాకర్థంకాలేదు భాయ్! విడమరచి చెప్పు అన్నాడు రామ్ సింగు.
"పోలీసు రైడింగులో యాక్సిడెంటల్ గా బాస్ మరణించాడు. ఆ రహస్యం వాడితోనే అంతమయిపోయింది. అలాకాక వాడు పోయాడనుకో ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు మన చేతికి చిక్కకపోడు."
"అంటే, కోటీ...!"
టకీమని రామ్ సింగు నోరు మూసేశాను. కోటీ యాభై లక్షల మాట పూర్తి చెయ్యకముందే కోటి దగ్గరే నేను రామ్ సింగు నోటు ముయ్యటం మంచిదయింది. కానిస్టేబుల్ చెవిటి కనకలింగం మా దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"మీ ఇద్దరిలో ఎవరు ఇప్పుడు "కోటి" అన్నది?" కుడి చెవి మా వేపు పెట్టి నిల్చొని అడిగాడు.
ఆ ప్రశ్న విని రామ్ సింగు గతుక్కుమన్నాడు. నావేపు ఇదేదో నీవే చూడమన్నట్లు చూశాడు.
"ఏంటి సార్?" వినయంగా అడిగాను.
"మీ ఇద్దరిలో కోటి అన్నది ఎవరు?"
"నేనే!"
"కోటి అని ఎందుకన్నావ్?"
"ఎందుకు ఏమిటి సార్! కోటి గురించే మాట్లాడుకుంటున్నాము సార్!"
"కోటి గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు?" ఆత్రుతగా అడిగాడు కానిస్టేబుల్ కనకలింగం.
"వున్నదంతా కోఠీలోనే కదండీ! మేము విడుదల అయిన తరువాత, హైదరాబాద్ వెళ్ళి కోఠీలో ఏదన్నా బిజినెస్ చేద్దామనుకుంటున్నాము. కోఠీ అంటే బిజినెస్ సెంటర్ అని మీకు తెలుసుకదా!" చాలా నమ్మకంగా పలికాను.
కానిస్టేబుల్ కనకలింగం నోరు తెరుచుకుని నా మాటలు వింటున్నవాడు కాస్తా టకీమని నోరు మూసుకుని, మళ్ళీ అంతలోనే నోరు తెరిచి, కోటీ గురించా మీరు మాట్లాడుకున్నది?" అన్నాడు.
"కోఠీ గురించి కాకపోతే, కోట్ల గురించి మాట్లాడుకుంటాముటండీ! అయినా అదేంటి మీరు కోఠీ అనంగానే అంత ఆత్రుత చూపించారు?" అడిగాను నేను.
కానిస్టేబుల్ కనకలింగం ఏదో చెప్పబోయి, మళ్ళీ అంతలోనే మాట విరమించుకుని "ఏం లేదులే!" అని అవతలకి వెళ్ళిపోయాడు.
"ఏమిటి?" అన్నట్లుగా కనుబొమ్మలు ఎగురవేశాడు రామ్ సింగ్.
"ఇష్!" అని నేను ఆలోచనలో పడ్డాను.
