Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 22


    పారిపోయింది ఆ నలుగురు దొంగలూ. పారిపోవటానికి కారణం ఆ కానిస్టేబుల్ కనకలింగం. మధ్యలో అక్షింతలు మాత్రం మా అందరికీ చల్లబడ్డాయి. అసలు విషయం ఆయన అడగటం, ఈయన చెప్పటం ఇక్కడ చెవిటివాళ్ళ ఫార్సు జరుగుతున్నది. మీరు ఆ దొంగల ముఠాలోని వాళ్ళు కాకపోయినా దొంగల ముఠా స్థావరంలో చిక్కినవాళ్ళేకదా. మీ కేసుని ఇంకా విహారించటం జరగలేదు. మీరు కూడా పారిపోతారేమో అని ఆ ప్రక్కన గట్టి సెల్ ఇంకోటి వుంటే, దాంట్లోకి మిమ్మల్నిద్దర్నీ మార్చమని ఇన్ స్పెక్టర్ గారు చెప్పారు. ఆయన ఏం చెపితే అది చేయాలి కదా!" అంటూ ఏటూ జెడ్ చెప్పుకొచ్చాడు కానిస్టేబుల్.


    "ఒక్కళ్ళు తప్పుచేస్తే మరొకరికి అక్షింతలా, చ్చొచ్చొ! ఇది అన్యాయం సార్! అన్యాయమో, న్యాయమో మీ డ్యూటీ మీరు చేయక తప్పదు కదా! చేయండి" అని సానుభూతిగా పలికి "మీ పేరేమిటి సార్" అని వినయంగా అడిగాను.


    "నా పేరు ఏడేడు కొండలు" కానిస్టేబుల్ ఏడేడు కొండలు చెప్పాడు.


    "ఎంత మంచిపేరు సార్! దివ్యమైన నామం. తెల్లారి లేచి పేరు తలుచుకుంటే చాలు. సర్వపాపాలూ తుడిచిపెట్టుకు పోతాయి. భక్తిగా కళ్ళు అరమూతలు వేసుకుని అన్నాను.


    కానిస్టేబుల్ ఏడేడు కొండలు ముఖం వికసించింది. 'నా పేరు విని మెచ్చుకుంది నువ్వొక్కడివే. మా ఇన్ స్పెక్టర్ గారయితే ఏడేడు కొండలు ఏమిటయ్యా! శుభ్రంగా ఏడుకొండలు అని పెట్టుకోక అంటూ ముఖానే నవ్వుతాడు. అందుకనే నేను అందరికీ నా పేరు ఏడుకొండలు అనే చెపుతాను" అంటూ తన పేరు కథా కమామిషు చెప్పాడు.


    నేను మరి రెండు మూడు మాటలు అతనితో మరింత స్నేహ పూరితంగా మాట్లాడాను.


    ఆ తరువాత నన్నూ, రామ్ సింగ్ ని వేరే సెల్ లోకి మార్చటం జరిగింది.


    ఇప్పుడు మేమున్న సెల్ లో ఇన్ స్పెక్టర్ గారు కూర్చున్న కుర్చీకి ఆనుకుని ఆయనకి మేము కనిపించేలాగా వున్నాము.


    "వచ్చీ వచ్చీ ఇక్కడ పడ్డామేమిటి భాయ్?" దిగులుగా అన్నాడు రామ్ సింగ్.


    ఈ ఏర్పాట్లు నాకూ నచ్చలేదు. అలా అని రామ్ సింగ్ ని నిరాశపర్చదలుచుకోలేదు. "అంతా మనమంచికే బ్రదర్! ఏం జరగనున్నదో కానీ!" అన్నాడు చిరునవ్వుతో.


    రామ్ సింగ్ చాతకాని నవ్వొకటి నవ్వి ఊరుకున్నాడు.


                                         10


    రాత్రి పదిగంటలు అయ్యుంటుంది.


    ఏదో కేసు నిమిత్తం ఇన్ స్పెక్టర్ వర్ధనరావు తన మందీమార్బలంతో బయటికెళ్ళాడు.


    స్టేషన్ లో అక్కడక్కడా కొద్దిమంది మాత్రమే కానిస్టేబుల్స్ వున్నారు.


    మా సెల్ లో నేనూ, రామ్ సింగ్ తప్ప మరో వ్యక్తి లేడు. అది ఒక్కటే కొంతలో కొంత మా అదృష్టం. ఇద్దరం గోడకి చేరగిలాపడి కబుర్లు మొదలుపెట్టాము.


    "ఇన్ స్పెక్టర్ ఇంకా మనల్నేమీ ప్రశ్నించలేదు. ఏమన్నా అడిగితే ఏం చెప్పాలి?" రామ్ సింగ్ అడిగాడు.


    "గుడ్డిలో మెల్ల అన్నట్లు "దిగ్రేట్" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు మనం చెప్పింది కొంతలో కొంత నమ్మాడు. లేక నమ్మినట్లు నటించాడు. అని అయినా అనుకుందాము. చాలా బిజీగా వుండి, ఇంకా మనల్ని ప్రశ్నించలేదు.


    ప్రశ్నించడం అంటూ జరిగినప్పుడు మనం ఆయన నమ్మే విధముగా ఒకే కథ చెబుదాం" అన్నాను.


    "ఏం కథ చెబుదాం?" రామ్ సింగు అన్నాడు.    


    "నాకెలాగూ ఈ ఊళ్ళో ఒక రూమ్, ఆ రూమ్ లో నాకు సంబంధించిన సామాన్లు. నేను చిన్న కంపెనీలో సేల్స్ మన్ అని, ఇరుగూ పొరుగుకి ఏనాడో తెలుసు. బాస్ ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేయబట్టి నాకు అంటూ ఒక రూమ్ వుంది. కాబట్టి నేను అదే అడ్రస్ ఇస్తాను. అదే కథ చెపుతాను. అప్పుడు నామీద అనుమానం రాదు"


    "మరి నా సంగతేమిటి భాయ్?" ఆత్రుతగా అడిగాడు రామ్ సింగు.


    "నువ్వు మా నాన్నగారి స్నేహితుడి కొడుకువని, నిన్న మొన్నటిదాకా రంగూన్ లో వుండేవాడివని, ఓ యాక్సిడెంట్ లో నీ వాళ్ళంతా మరణించగా నీవు ఇక్కడికి రావటం, నన్ను కలుసుకోవటం జరిగిందని నీకోసం నేను ఏదో చిన్న జాబ్ వెదుకుతుండగా ఇదుగో ఇలా అనుకోని చిక్కులలో ఇరుక్కోవటం జరిగిందని ఓ కథ కల్పించి చెప్పేసెయ్! మనిద్దరం ఒకే కథ చెబుతాం కాబట్టి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చచ్చినట్లు నమ్మి తీరుతాడు. నా ఐడియా ఎలా వుంది బ్రదర్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS