Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 24


    కోటి అనంగానే కానిస్టేబుల్ కనకలింగం ఎందుకు పరిగెత్తుకు వచ్చాడు. కోటీ యాభై లక్షల సంగతి వీళ్ళకి తెలుసా? తెలియటానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ముందు రామ్ సింగుకి తెలుసు. ఆ తరువాత నాకు. ఆ తరువాత బాస్ కి. మా ముగ్గురికే తెలుసు కోటీ యాభై లక్షల విలువచేసే ఆ వజ్రాల సంగతి. కొంపదీసి ఈ విషయం ఇంకా కొందరి వ్యక్తులకి తెలుసా? నా ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి.


    కానీ, అర్జంటుగా నేను తెలుసుకోవలసినది ఒకటంటే ఒక్కటి వుంది.


    అది,


    "బాస్ గాడు వున్నాడా? వూడాడా?" అని.


    రామ్ సింగ్ కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు వున్నాడు. కాస్త మౌనంగా వున్నాడు.


    ఎవరి దోవన వాళ్ళం అలా ఆలోచిస్తూ వుండిపోయాము.


                                        11


    రామ్ సింగ్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.


    రామ్ సింగ్ ని అరగంట క్రితం, ఇంటరాగేషన్ చేయటానికి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు పిలిపించాడు. కానిస్టేబుల్ ఏడేడు కొండలుని మంచి చేసుకోవటం వల్ల, "మీ ఇద్దరినీ ఒకే సెల్ లో బందీలుగా వుంచి ఇంటరాగేషన్ మాత్రం విడివడిగా చేయదలచుకున్నారు. అందువల్ల ముందు రామ్ సింగ్ ని ఇన్ స్పెక్టర్ గారి దగ్గరకి తీసుకువెళ్ళటం జరిగింది" అని అతను చెప్పబట్టీ నాకు విషయం అర్థమయింది.


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఏమి అడుగుతాడో? రామ్ సింగ్ ఏమి జవాబు చెబుతాడో అని, నా గుండెలు ఒక ప్రక్క పీచు పీచు మంటున్నాయి. నేనొకటి చెప్పి, రామ్ సింగ్ మరొకటి చెబితే ఇన్ స్పెక్టర్ మా ఇద్దరినీ అనుమానించి చెరో సెల్లోకి తోస్తాడు. అందువల్లనే ముందు జాగ్రత్తగా ఒకేమాట అనుకున్నాము. ఎంత ముందు జాగ్రత్త పడ్డా ఒక్కోసారి పప్పులో కాలేయవచ్చు. నేనొక మాటని కవర్ చేసినంత తొందరగా రామ్ సింగ్ చేయలేడు. పైగా తడబడతాడు...


    నేను రామ్ సింగుని గురించి అలా ఆలోచిస్తూ వుండగానే, రామ్ సింగుని తీసుకువచ్చి సెల్ లో వదిలిపోయాడు కానిస్టేబుల్ కనకలింగం.


    నాకు ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిగాయి.


    ఎప్పుడూ కూడా ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ప్రశ్నించటం పూర్తయిన తరువాత, ఆ వ్యక్తిని రెండో వ్యక్తినీ కలుసుకోనివ్వరు. వెంటనే కాని, ఆ తరువాత గానీ ఆ రెండో వ్యక్తిని ఇంటరాగేట్ చేస్తారు. సహజంగా జరిగేది ఇదే. ఇక్కడ ఈ విషయం తారుమారు అయ్యింది.


    స్వరం బాగా తగ్గించి. "అక్కడేం జరిగింది? నిన్ను ఏం ప్రశ్నలు వేశారు?" అని రామ్ సింగుని అడిగాను.


    "నన్ను అక్కడికి తీసుకు వెళ్ళంగానే, ఇన్ స్పెక్టర్ గారు అర్థం లేని ప్రశ్నలు ఏవో రెండు మూడు వేశారు. ఆయనకి సరీగా హిందీ రాదు, నాకు సరీగా తెలుగు రాదు. ఆయన వచ్చీరాని హిందీలో ప్రశ్నలు వేస్తూంటే నేను తెలుగు, హిందీకాక ఉర్దూ కూడా కలిపి, నువ్వు చెబుతూ వుంటావు చూడు కంగాళీ భాష అని అలా సమాధానం చెప్పాను. నీ పేరు రామ్ సింగే కదూ!" అని అడిగాడు ఆయన. "నయ్! నయ్ సాబ్! అసలూ కీకా నామ్ రామ్ కీ సింగూ హై! కానీ, అరె! సాబ్! ఈ ప్రజలూ ఉన్నారూ చూస్తూంట్రి, రామూకి సింహాన్ని రామ్ సింగ్ కా నామ్ సే బోల్ తే హై!" అని ముందు నా పేరు విషయంలోనే తిక మకగా చెప్పాను. నా మొదటి జవాబుకే ఆయన బుర్ర గిర్రున తిరిగినట్లుంది. టోపీని గట్టిగా సవరించుకుని పెట్టుకున్నాడు. రెండో ప్రశ్న ఏమిటంటే, "తెలుగుదేశంలో తెలుగు రాకపోవటమేమిటయ్యా! సిగ్గుచేటు" అన్నాడు. పోనీ అక్కడితో వూరుకోవచ్చా తన హిందీ ప్రావీణ్యం వరగపెడుతూ "షర్ మాతీ నహీ!" అన్నాడు. అన్నాడు. వెంటనే నేను "షర్ మా కౌన్ సాబ్? శాస్త్రీకా ఛోటా భాయీహై! వోహై నయ్ కో మాలూమ్!" అలా ఎగును దిగుడు హిందీ మాట్లాడేసరికి ఆయన బుర్ర మరోసారి గిర్రున తిరిగింది. ప్రక్కనున్న కానిస్టేబుల్ తో "వీడెక్కడ మిడిమేళమయ్యా మన ప్రాణానికి" అన్నాడు.


    నేను వెంటనే "నయ్! నయ్! మిడి. యదీ హై పాంటు" అని నా పాంటు చూపెట్టాను. ఆయన నా పాండిత్యానికి మూర్ఛపోవటం ఒక్కటే తక్కువ. సరీగా అప్పుడే ఇంటినుంచి ఫోన్ వచ్చింది. బహుశా పెళ్ళాం ఫోన్ చేసినట్లుంది ఇంటినుంచీ. ఫోన్ లో కంగారుపడుతూ నత్తి నత్తిగా ఏదో మాట్లాడాడు. ఆ తరువాత ఈయన మాట్లాడింది లేదు. పావుగంటసేపు అవతలవాళ్ళు మాట్లాడుతూ వుంటే "అలాగే! వూ! ఆ!" అన్న ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. కానిస్టేబుల్స్ అటు తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటే, ఇన్ స్పెక్టర్ గారి భార్య ఫోన్ చేసి వుంటుంది అనుకున్నాను.


    ఫోన్ ప్రహసనం ముగిసిన తరువాత ఆయనకి ఎక్కడలేని నీరసం వచ్చింది. ఈసురోమని కుర్చీలో కూలబడ్డాడు. ఫ్యాన్ ఫుల్ గా పెట్టమన్నాడు. "వీడికి భాష సరిగా వచ్చిచావదు. వీడికన్నా ఆ రెండోవాడు నయం. వీడిని తీసుకువెళ్ళి అక్కడ వదిలేసిరండి" అని చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS