Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 21


    "ఏం జరిగివుంటుంది భాయ్?" రామ్ సింగ్ నెమ్మదిగా అడిగాడు.


    "ఖైదీలు పారిపోయారు. ఆ విషయం మీద ఏదో అరుచుకుంటున్నారు. నాకు అసలు విషయం కన్నా కొసరు విషయం ఒకటి అర్థమయింది" అన్నాను.


    "కొసరు విషయమా!" కొసరు విషయమేమిటో తెలియక రామ్ సింగ్ తెల్లబోయాడు.


    "కొసరు విషయం అంటే మరేంలేదు. ఇక్కడి నుంచీ తేలికగా పారిపోవచ్చు అని. ఇన్ స్పెక్టర్ చూడబోతే వుత్త వెర్రివెంగళప్ప లాగా వున్నాడు. అదృష్టం కలిసివచ్చన్నా అతను ఇన్ స్పెక్టర్ అయివుంటాడు. ఆమ్యామ్యా పెట్టయినా ఇన్ స్పెక్టర్ అయివుంటాడు. తనకితానే దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ అని చెప్పుకొనే ఇన్ స్పెక్టర్ ఏమి ఇన్ స్పెక్టర్? పాపం ఆయనకి తగ్గవాళ్ళే ఆయన అసిస్టెంట్లు కూడా. ఆయనకి తలతిక్క. వీళ్ళకి తిక్క వెరసి తిక్కన్నర" అంటూ నవ్వాను.


    "మనం ఎట్లా ఇక్కడినుంచీ బయటపడతామో? లక్షలు ఎలాగూ మట్టిగొట్టుకు పోయాయి. లక్షణంగా ఇక్కడనుండీ బ్రతికి బయటపడితే, పదికోట్ల ఫలితం" అన్నాడు రామ్ సింగ్.


    "మనం చచ్చిపోవటం ఖాయం అని కాళ్ళు బారజాపి నేలకి అంటుకుపోయాము. అనంతవాయువుల్లో మన ప్రాణం కలిసేవేళ ఆపద్భాందవుల్లాగా వీళ్ళు వచ్చి, మనల్ని రక్షించారు. దీనినిబట్టి ఏమని తెలుస్తూన్నదంటే, మనకి ఇంకా ఈ భూమ్మీద నూకలు వున్నాయని. నూకలంటూ వున్నాయి.కాబట్టి నూకలు సంపాదించడం అంతకష్టం కాదనుకుంటాను. ఏం జరుగుతుందో వేచిచూద్దాం!" అన్నాను.


    మేమలా మాట్లాడుకుంటూ వుండగా, మా దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. "మరికాసేపట్లో మిమ్మల్ని ఈ సెల్ లోంచి మారుస్తున్నాము" అన్నాడు.


    "అయ్యో! ఇది మాకు బాగానే వుందండీ! అనవసరంగా మార్చటం ఎందుకు?" ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగాను.


    "మీకు బానేవుంటుందయ్యా! కడుపునిండా తింటారు. కదలకుండా కూర్చుంటారు. మీ ప్రాణానికి ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ అయితే మా ప్రాణానికిది ఒక జైలు. వెనకటికి నీలాంటి ప్రబుద్దుడ్ని నాలాంటివాడు మంచిగా పలకరించి, "ఎందుకురా మాటిమాటికీ నేరాలు చెయ్యటం? ఇలా జైలుకి రావటమూనూ!" అని అడిగితే, వాడున్నాడుట "నాకేమిటి సార్! మధ్య మధ్య అత్తారింటికి వెడుతున్నట్లు హాయిగా మధ్య మధ్య ఇక్కడికి వచ్చివెడుతున్నాను. మీ బ్రతుకు అలా కాదే. జన్మంతా ఇలాగే మాలాంటివాళ్ళకి కాపలా కాస్తూ ఈ జైలు మధ్యనే జీవితం గడపాలి. మీకన్నా మేము బెటర్" అన్నాడుట. ఇప్పుడు మా పని అలానే వుంది." విచారంగా అన్నాడు కానిస్టేబుల్.


    ఈ పాత జోకు ఇప్పటికి పదిసార్లు విన్నాను, అని అంటే ఆ కానిస్టేబుల్ ఎక్కడ ఏడ్చిపోతాడో అని, ఆయన మొహాన ఒక నవ్వు నవ్వేసి, "మీరు చాలా బాగా మాట్లాడుతారు సార్! మీరు మాట్లాడుతూ వుంటే వినబుద్దేస్తున్నది" అన్నాను.


    పొగడ్తకి లొంగనివాడు వుండడేమో, నా మాటలకి కాస్త వుబ్బిపోయినట్లే కనిపించాడు. "ఈ మాటలు నువ్వు కాదు అనవలసింది ఆయన."


    "ఆయనెవరు సార్?" ఆత్రుత నటిస్తూ అడిగాను.


    "మా ఇన్ స్పెక్టరుగారు!" కోపంగా అన్నాడు కానిస్టేబుల్.


    "అదేమిటి సార్ అలా అంటున్నారు. మిమ్మల్ని చూడగానే నీతి నిజాయితీ కలవారిలాగా కనిపిస్తునారు. ప్చ్! అయినా ఈ కాలంలో నీతి నిజాయితీ ఏమిటిలేండి? పోలీసు డిపార్టుమెంటులో ఒకళ్ళకి వుండీ, ఒకళ్ళకి లేకపోయినా కష్టంగానే వుంది."


    "గాలిలో ఒక బాణం వేశాను. అది గురితప్పకుండా వెళ్ళి గుచ్చుకుంది.


    "రాత్రి మీతోపాటు నలుగురు దొంగలని పట్టుకొచ్చాంకదా! ఆ నలుగురూ పారిపోయారు. నిన్ను పట్టుకొచ్చామో లేదో, తెల్లారేసరికి ఈ పూట పారిపోయారు. వాళ్ళు పారిపోవటానికి కారణం ఒకళ్ళయితే మధ్యలో చీవాట్లు మా అందరికీ!"


    "అదెలాగ జరిగింది సార్! మీరక్కడ కాపలా లేరా? మీరు వుంటే జరిగేది కాదేమో!" తెలుసుకోవాలని ఆదుర్దాగా వున్నా, ఆదుర్దా వ్యక్త పరచకుండా, విషయం తెలుసుకునే తీరున అడిగాను.


    "ఎవరయినా అంతే. మన విషయం తెలుసుకుందామని ఆ విషయమ్మీద కుతూహలం చూపి అడిగితే, ఓ పట్టాన చెప్పరు. మామూలుగా అడిగితే వాళ్లకి చెప్పాలని ఉంటే మాత్రం మనసులో వున్నదంతా కక్కేసినట్లు చెప్పేస్తారు. ఇప్పుడూ అలానే జరిగింది.


    'కానిస్టేబుల్ కనకలింగమని ఒక మహానుభావుడు ఇక్కడున్నాడు. అతగాడికి ఎడంచెవి అసలు వినిపించదు. కుడిచెవి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. రకరకాల చెవిటివాళ్ళను చూశానుకాని ఈ రకం చెవిటివాళ్ళణు మాత్రం నేనెక్కడా చూడలేదు. ఎడంచెవి దగ్గర ఫిరంగి పేల్చినా వినబడదు. కుడిచెవి దగ్గర మాత్రం సూది క్రిందపడినా వినిపిస్తుంది. కాకి చపులాగా ఒక చెవితోనే పనిచేస్తాడు. మనం ఎదురుగుండా నిల్చుని మాట్లాడామనుకో సగం మాటలు వినిపించీ, సగం వినబడవట. దాంతో సగం వినిపించీ, సగం వినిపించక అన్నీ అవకతవక పనులే చేస్తుంటాడు. ఆయనగారికి ఎడంచెవి చెముడో, కుడిచెవి చెముడో గుర్తుండిచావక మేము ఎప్పుడన్నా ఎడంచెవివేపు నిలుచుని మాట్లాడితే అరిచి, గీపెట్టేది, చచ్చేది వినిపించుకోడు. కుడిచెవి వేపు నిలుచుని మాట్లాడితే 'ఎందుకలా గొంతుకు చించుకుని మాట్లాడతారు? చిన్నగా మాట్లాడలేరా అని మనమీదనే అరుస్తాడు. రాత్రి డ్యూటీలో కనకలింగం వున్నాడు. ఇన్ స్పెక్టర్ గారు చెప్పారో, ఈ చెవిటి మేళం ఏమి వినిపించుకున్నాడో, లేక ఆ నలుగురు దొంగలు ఈయనగారి అవలక్షణం చూసి ఏదన్నా ట్రిక్ చేశారో మొత్తానికి వాళ్ళు పారిపోవటం జరిగింది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS