అటువంటి రాజారావు మేడ మెట్లపై నుంచి పరమానందంతో దిగి వస్తున్న పేరిశాస్త్రిని చూస్తే ఆయన వచ్చిన పని అయిపోయినట్లు మొహంలోని కళే చెప్తోంది.
* * *
మంగళవాయిద్యాలు మధురంగా మోగుతున్నాయి. సౌమ్యని పెళ్ళికూతుర్ని చేశారు. ఆ రాత్రికే ముహూర్తం. ఆమె తరపు పెద్దగా బంధువులెవరూ లేరు. తలచెడిన మేనత్త, తండ్రి, తమ్ముడే ఆమె తరపున బంధువులు. పక్కింటి పిన్నిగారు, చిన్నప్పటి ఫ్రెండ్ లత రాక ఆమెకి కొంత ఊరటనిచ్చింది.
రామాపురంలో వాళ్ళ కోసం రాజారావు ఏర్పాటు చేసిన విడిదిలో అంతా సౌకర్యంగానే ఉంది. కానీ సౌమ్యకే లోలోపల ఏదో తెలీని అసౌకర్యం, అశాంతి కల్గుతోంది.
ఇంతదూరం వచ్చాక కూడా తను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో ఆమె తేల్చుకోలేకపోతోంది.
సాయంత్రపు పిల్లగాలికి తేలివచ్చే మల్లెపూల పరిమళం ఆఘ్రాణిస్తూ ఆలోచనల్లో తేలిపోతున్న సౌమ్య ఉన్నట్లుండి నిటారుగా అయింది. ఆమాటలు... పక్కగదిలోంచి విన్పిస్తున్నాయి. అవును అది లత గొంతే!
"అయితే పిన్నీ! పాపం సౌమ్యకీసంగతి తెలీదా?"
"లేదమ్మా! తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా! వాళ్ళనాన్న కూడా ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు" సౌమ్య కళ్ళలో రక్తజీరలు పొంగాయి.
"మరి ఇల్లు, పొలం రాజారావు పేరరాస్తే ఇక సౌమ్యపెళ్ళి కాగానే శీను... మాస్టారు... ఎక్కెడికోపోయి.." లత మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.
"అలా ఎన్నటికీ జరగదు..." దృడంగా విన్పించిన సౌమ్య స్వరాన్ని విని ఉలిక్కి పడ్డారిద్దరూ.
"నువ్వా! సౌమ్యా! రామ్మా..." పిన్నిగారి గొంతులో తొట్రుపాటు దాగలేదు.
"మీ మాటలన్నీ విన్నాను పిన్నీ! అందరూ నన్నెందుకింత మోసం చేస్తున్నారు" సౌమ్య గొంతు బాధగా వణికింది.
"మీ నాన్నే..." ఆర్దోక్తిలో ఆగిందావిడ.
"నాన్ననే అడుగుతాను" మధ్యలోనే మాట తుంచేసి విసురుగా వెళ్ళిపోతున్న సౌమ్యకేసి జాలిగా చూసి ఆ అమ్మాయి మనసు తెలిసినట్లు తల పంకించింది.
కూతురి మొహంలోని తీక్షణత్వం చూడగానే మాస్టారి వదనం పాలిపోయింది.
"నేను విన్నది నిజమేనా! ఎందుకు నాన్నా! నన్నింత పరాయిదాన్ని చేశారు" ఇక ఆపుకోలేకపోయింది. తండ్రి గుండెలమీద వాలి వెక్కివెక్కి రోదించసాగింది. కూతురి బాధను అర్ధం చేసుకున్నట్లు ఆమె తలపై చేయి వేసి నిమురుతూ అనునయిస్తున్నారాయన!
"రవివర్మ నిన్ను కోరి చేసుకుంటున్నాడమ్మా! అతను ఎలాంటి వాడయితేనేం. ఏ స్త్రీకయినా కోరే భర్త దొరకటం అదృష్టం కాదూ! అమ్మ ఉంటే నీకు ఇంకా బాగా నచ్చజెప్పి ఉండేది." కళ్ళు వత్తుకున్నారాయన.
"హు..భర్త.. మీకు నిలువనీడ కూడా లేకుండా చేసే పెళ్ళి నాకు అవసరం లేదు. నా నిర్ణయం ఏనాడో మీకు చెప్పేశాను. మీరంతా నన్ను మోసం చేశారు. నేనిప్పుడే చెప్పేస్తాను వీళ్ళకి". రాజారావుగారింట్లోకి దూసుకు వస్తున్న పెళ్ళి కూతుర్ని... ఆయనే కాదు ఎవ్వరూ ఆపలేకపోయారు. అంతా చూస్తూ ఆశ్చర్య చకితులవుతున్నారు.
రాజారావుకి ఆమె అలా రావటం నచ్చలేదు. అయినా గాంభీర్యాన్ని చెదరనీకుండా! "కూర్చోమ్మా! ఏమైనా అవసరం అయితే కబురు చేయకపోయావా" తెచ్చిపెట్టుకున్న శాంతస్వరంతో అన్నాడు.
"నేను కూర్చోటానికి రాలేదు."
సౌమ్య విసురుకు ఆయన భ్రుకుటి ముడిపడింది.
"మరి దేనికి" ఆ గొంతులో తీవ్రత దాగటం లేదు. ఇంతవరకు ఇలా ఆయనకి ఎదుట నిలిచి జవాబు చెప్పిన అమ్మాయిలు ఆ పరగణాలో లేరు. ఇప్పుడీ పిల్ల... అందునా స్వయానా కాబోయే కోడలు ఇలా జవాబివ్వటం కొరుకుడు పడటం లేదు. దీన్ని సాహిస్తే తన పరువు ఏమవుతుంది?
"నా పెళ్ళికి కట్నం కింద ఇల్లు, పొలం రాయించుకున్నారుట. నిజం అయితే ఈ పెళ్ళి జరగదు, జరగనీయను".
సౌమ్య మొండి ధోరణి ఆయనకి వింతగా ఉంది.
"మీరు ఒప్పుకొన్నదే! ఇప్పుడీ తిరకాసు ఏమిటి. పైగా కుదిరిన పెళ్ళి ఆపితే నీ సంగతేమోగానీ ఈ రాజారావు వంశప్రతిష్టకే అవమానం!" మీసాలు మెలేశాడు ఠీవిగా.
"మీ ప్రతిష్ట కోసం నా జీవితాన్ని బలిపెట్టలేను! క్షమించండి, మేమిక వెళ్ళి వస్తాం" వెనుదిరిగింది సౌమ్య దృడంగా.
"చూడమ్మాయ్! నీకేం చూసుకుని ఇంత పొగరో నాకు తెలీటం లేదు. నా పర్మిషన్ లేకుండా మీరీ గ్రామంలోకి రాలేరు. అలాగే వెళ్ళలేరు కూడా! తెలుసా."
"మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, ఈ పెళ్ళి మాత్రం జరగదు," అడుగు ముందుకేసింది.
"హు! అలా చూస్తాంరేంరా! గాడిదకొడుకుల్లారా! దీన్ని కాళ్ళు చేతులు కట్టి బంధించండి, ఈ రాజారావు సత్తా చూపిస్తాను. పెళ్ళి చేసుకోదుట, అంతా దీనిష్టమే" శివమెత్తినట్లు ఊగిపోతున్నాడు రాజారావు. కోపం పగ్గాలు తెంచుకొన్నట్లు చేతిలోని బలమైన లాఠీ విసిరాడు.
"ఆగండి!" అంటూ వచ్చిన రాజారావు భార్య లాఠీ తగిలి ఆర్తనాదం చేసి కూలబడిపోయింది.
వెనుదిరిగిన సౌమ్య నిశ్చేష్టురాలయి పోయింది. ఒక్కంగలో వెనక్కి వచ్చి ఆమెను ఒళ్ళోకి తీసుకుంది.
"సుమి! నువ్వా!"
"నేనే!" బలహీనంగా నవ్వింది సుమిత్ర.
"కాలేజి తర్వాత నిన్నిలా చూడటం" బావురుమంది సౌమ్య.
"నీకేం కాదు, నువ్వు భయపడకు" సుమిత్ర సౌమ్యకు చెప్పింది.
రాజారావుకి ఏమీ అర్ధంకావటం లేదు, ఏదో సినిమాలో చూసిన దృశ్యంలా ఉంది.
"ముందు డాక్టర్ కి చూపించాలి" సౌమ్య మాటలకు అప్పుడే ప్రవేశిస్తున్న రవివర్మ గబగబా డాక్టర్ కోసం వెళ్ళాడు .రాజారావు దగ్గరికి పిల్చి చేయిపట్టుకుని మెల్లగా చెప్తోంది సుమిత్ర.
"ఈ సౌమ్య కాలేజిలో నా క్లాస్ మేట్, కట్నం తీసుకునే వాడిని పెళ్ళాడకూడదన్నది మా ఇద్దరి కోరిక. నేను కాలానికి లొంగి ఆదర్శంపేర మభ్యపెట్టుకొని మిమ్మల్ని కట్నం లేకుండా చేసుకుని నా ఆదర్శం నిలుపుకున్నాను. సౌమ్య ఈ ఇంటికి కోడలుగా వచ్చినా నాకు కొంత ఊరట అనుకున్నాను. కానీ ఇలా.." అబ్బా! అంటూ తల పట్టుకుంది సుమిత్ర.
సౌమ్య చప్పున ఫస్ట్ ఎయిడ్ కి ఉపక్రమించింది, సుమిత్ర తలకు కట్టుకట్టింది.
ఆమెని పడుకోబెట్టి వేడివేడి పాలు తాగించింది.
సుమిత్రనూ, సౌమ్యనూ అలా చూస్తూ ఆలోచనలో పడిపోయారు రాజారావు, రవివర్మ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
సుమత్రను పరీక్షించిన డాక్టర్ సౌమ్యకేసి అభినందనగా చూశాడు.
"మీ ఫస్ట్ ఎయిడ్ వల్ల ఆమెకి రక్తం ఎక్కువ పోలేదు. ఈ మందులు వాడండి. గాయం మానిపోతుంది" ప్రిస్కిప్షన్ మౌనంగా అందుకుంది సౌమ్య.
పదినిమిషాలకు సుమిత్ర అలసటగా నిద్రపోయింది.
"నేనింక వెళ్తానండీ" సౌమ్య లేచింది. ప్రిస్కిప్షన్ రవివర్మకు అందించింది.
"సారీ సౌమ్యా! నాకు తెలీకుండా నా ప్రమేయం లేకుండా చాలా జరిగాయి. నీకు బాధ కలిగించాను. నేను ఏ కట్నకానుకలు ఆశించకుండానే నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నాను, నన్ను క్షమించు."
సౌమ్య కళ్ళెత్తి ఓసారి రవివర్మ కేసి చూసి కళ్ళతోనే వారించింది. గడప దాటుతుంటే వెనకనుంచి రాజారావు గంభీరస్వరం విన్పించింది.
"సౌమ్యా! ఆగమ్మా! సుమిత్రను నువ్వు ఆదుకున్న తీరు, నాలో మానవత్వాన్ని నిద్రలేపింది. మనిషికి కావలసింది డబ్బు కాదనీ తోటి మనిషి పట్ల ప్రేమ, మమకారాలని. ఇందర్ని దూరం చేసుకొని నేను మాత్రం ఈ ఆస్తి ఏం చేసుకుంటాను, నువ్వు మరో సుమిత్రవు కావటానికి వీల్లేదు", అంటూ దస్తావేజు కాగితాలు ఆమె కళ్ళముందే నిలువునా చింపేశాడాయన.
ఆ రెండు కుటుంబాల మధ్య పడిన ఇనుపతెర కరిగినట్లయింది.
"ఇంత జరిగాక.. ఇంక......" ఏదో అనబోతున్న సౌమ్య చేయి పట్టుకొని సున్నితంగా వారించాడు రవివర్మ.
"ఇంకేం మాట్లాడకు సౌమ్యా! నువ్వు నాకు.. నీకు నేను.. మన అవసరం ఈ గ్రామాలకు ఉంది." అతని కళ్ళలో ఉప్పొంగే అనురాగాన్ని తోసి వేయలేకపోయింది. మరోసారి మధురమైన నవ్వు నవ్వాడు రవివర్మ. మంగళ వాయిద్యాలు శ్రుతి పక్వంగా మోగాయి.
"ఏమైనా మాస్టారూ! మా కోడలు పేరుకు సౌమ్యే అయినా మాకు మాత్రం సూర్యకిరణం లాంటిదే!" మీసం మరోసారి మెలేశాడు రాజారావు.
"మీ కోడలా!" ఆశ్చర్యంగా చూసి ఇంతలోనే చిరునవ్వు నవ్వారు మాస్టారు.
సుమిత్ర సంతృప్తిగా స్నేహితురాలిపై అక్షింతలు వేసింది.
మాస్టారు కళ్ళలో ఇప్పుడు కొండంత తృప్తి.
శీను గుండెల్లో ఆకాశమంత ఆనందం.
నింగీ నేలని కలిపే క్షితిజం సూర్యుడ్ని భూమికి అందించటం సృష్టికి కొత్తకాదు.
సౌమ్య నేటి తరానికి ప్రతినిధిగా రవివర్మ సహచర్యంతో పల్లెబాటలో అడుగులు వేయటాన్ని ఆ గ్రామమంతా అక్షరాల అక్షింతలతో ఆశీర్వదించింది.
(అభినందన, కథాసంకలనం, 2000)
* * *
