Previous Page Next Page 
అమ్మా... నన్ను క్షమించొద్దు పేజి 15

 

    సౌమ్య వంటిల్లు సర్దివచ్చి చాపమీద నడుం వాల్చిందే గానీ నిద్ర రావటం లేదు.

నాన్న పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోంది. శీను బాగా చదువుకోవాలి. ఇంక ఇల్లు పొలం... శీనుని ప్రయోజకుణ్ణి చేయాలంటే.. ఇవే దిక్కు. వీటిని అమ్మేసి చదివించాల్సి వస్తుంది. నాన్నేమో ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అంటారు. అయినా ఆయన పిచ్చిగానీ కట్నం కోరని పెళ్ళికొడుకు ఎక్కడైనా ఉంటాడా! ఆయన రిటైరు అయినాక ఆ స్కూల్లోనే టీచరుగా చేరిన తనకి కొంత ఉపశమనం కల్గించేది ఆ పసివాళ్ళ సాంగత్యమే! అయినా తన తృప్తి కోసం వయోజన పాఠశాల నడపటం మరికొందరికి దీపం వెలిగించటమే! పెళ్ళి... అది ఒక ప్రశ్నార్ధకమే! తనలాంటి ఆడపిల్లలకి ఈ సమాజ శాపం అదేనేమో!
ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
తెల్లవారుతూనే రోజులాగే తమ్ముడ్ని స్కూలుకు తయారుచేసి పంపింది. తనూ బయలుదేరి చెప్పులు తొడుక్కుంటూ "జాగ్రత్తగా మందు వేసుకోండి... వేళకి తినేయండి" హడావుడిగా చెపుతూనే వెళ్తుంటే గేటు దగ్గర పేరిశాస్త్రి ఎదురయ్యాడు.
"ఏవమ్మా! స్కూలుకేనా" పళ్ళకిలించాడు.
"నమస్కార మండి... స్కూలుకే!" వడి వడిగా అడుగులేసింది.
పేరిశాస్త్రి తండ్రిని కలిశాక ఇద్దరి మధ్య జరగబోయే సంభాషణ ఆమె మనసులో ముందుగానే మెదలుతోంది.
"ఓ... శాస్త్రిగారా! రండి... ఎన్నాళ్ళకి మా మీద దయకలిగింది... దాహం పుచ్చుకుంటారా" వెంకట్రామయ్య మాస్టారు మర్యాద చేశారు.
"వద్దండీ బాబూ! మీకో శుభవార్త" ఊరించాడు శాస్త్రి.
"సంబంధం ఏదైనా..."
"మెల్లిగా అంటారేమిటండీ... మన రామాపురం రాజారావుగారు..."
"ఆయన ఆ మధ్య రెండో పెళ్ళి చేసుకున్నట్లు..." సగంలో ఆగిపోయాడు మాష్టారు.
"నీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఆయనక్కాదయ్యా! ఆయన కొడుకు రవివర్మకు".
"రవివర్మా..." ఆలోచనలోపడ్డారు మాస్టారు.
"ఆ! ఇతగాడు పెద్దకొడుకు, అంటే రాజారావు మొదటి భార్య కొడుకన్నమాట!"
"ఏం చదువుకున్నాడు" పితృహృదయం ఆరాతీసింది.
"మొత్తానికి మాస్టారి బుద్ధి పోనిచ్చుకున్నావు గాదు. కుర్రాడు అందగాడు. ఆస్తి ఉంది, అగ్రికల్చర్ డిగ్రీ చదివి పల్లెలోనే స్వంత భూమి-పుట్రా చూసుకుంటున్నాడు".
"అంత ఉన్నవాళ్ళ సంబంధం"
"పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా పట్నాల కెగబడుతుంటే వాళ్ళకి పల్లెలోనే ఉండే కోడలు కావాలిట, రవివర్మకి పల్లెలో ఉండటమే ఇష్టంట".
'అయినా... మా సౌమ్య' నసిగాడు మాస్టారు.
'సౌమ్య కేమయ్యా! బంగారుబొమ్మ. అసలు సౌమ్యని రవివర్మ ఎక్కడోచూసి మనసు పారేసుకోబట్టే, ధనలక్ష్మి నా...రూపంలో నీ దగ్గరికి వచ్చిందనుకో" శాస్త్రి పొట్ట కదిలిపోయేలా నవ్వాడు.
"మరి కట్నం..."
"అదే చెప్పబోతున్నాను. ఇదేమన్నా మామూలు సంబంధమా! నీపేరనున్న ఆ అయిదెకరాలు, ఈ ఇల్లు రాసిస్తే చాలు. నేనే ఎలాగో సర్ది... ఈ మాత్రానికే... ఇంత పెద్ద సంబంధం వప్పించాను." భారం డింపుకున్నాడు శాస్త్రి.
ఇల్లు, పొలం, కట్నం కిందపోతే... తనూ శీనూ... అసలు కట్నం అంటేనే మండిపడే సౌమ్య ఈ సంబంధానికి ఒప్పుకుంటుందా! ఒప్పుకోదు. కానీ ఇంత మంచి సంబంధం వదులుకుంటే సౌమ్య జీవితం ఇంక స్థిరపడదు. ఆలోచనలతో సతమతమయ్యాడు మాస్టారు.
"ఇంకా ఆలోచిస్తావేమిటయ్యా! కట్నం మాట పిల్లకు చెప్పకు. రాతకోతలన్నీ రహస్యంగా నేను జరిపిస్తాను. పెళ్ళయ్యాక తెల్సినా ఏంచేస్తుంది. పెళ్ళి గ్రాండ్ గా జరిపించాలి కాబట్టి ఉభయ ఖర్చులు భరించి వాళ్ళ ఊళ్ళో ఏర్పాటు చేస్తారు... బాగా ఆలోచించుకో! నేను మళ్ళీ రేపు వస్తాను" మనసునిండా సరిపడేంత ఆలోచన రేకెత్తించి పేరిశాస్త్రి వెళ్ళిపోయాడు.
వెంకట్రామయ్య మాస్టారికి ఆలోచించటానికి ఆ రోజంతా సరిపోలేదు.
ఆరాత్రి కూతురు దగ్గర కట్నం మాటతప్ప మిగతా వివరాలన్నీ చెప్పి ఒప్పించటానికి ప్రయత్నించారు.
'రేపు ఆలోచిద్దాంలే నాన్నా! పడుకోండి' అంటూ చాప మీద ఒరిగిపోయిన సౌమ్య కళ్ళముందు సమ్మోహనకరమైన నవ్వుతో రవివర్మ కన్పించాడు.
ఆ నవ్వు తనలో ఎంత అలజడి రేపిందో, ఆ అలజడిని కంట్రోల్ చేసుకోటానికి, తన్ను తాను ఎంత కట్టుబాటు చేసుకుందో నాన్నకేం తెల్సుపాపం. చివరికి రవివర్మ ఇలా కబురు పంపాడన్నమాట. ఉభయఖర్చులు వాళ్ళే భరించి చేసుకోవటం. అసలు ఈ రోజుల్లో కట్నం తీసుకోని వాళ్ళెక్కడున్నారు. రవివర్మ తండ్రి చాలా డబ్బు మనిషిగా తనువింది. మరి కొడుకు కోసం దిగివచ్చాడా! ఏదైనా... శీను జీవితాన్ని తీర్చిదిద్దాలంటే... పొలం, ఇల్లు అమ్మకూడదు. ఒంటరిపోరాటం చేస్తున్న తనకి ఓతోడు దొరకటం అదృష్టమే! రవివర్మ సంస్కారం గురించి తను విన్నది. అతను తనను కావాలనుకున్నాడు. తనుమాత్రం... భగవంతుడీ రూపంలో ఆదుకుంటున్నాడా! పెద్దలోగిలి కోడలైతే తన ఆదర్శాలు జీవన విధానం మారిపోతాయా! ఊహలు, వాస్తవాల సందిగ్ధంలో నిద్రాదేవత ఒడిలోకి పసిపిల్లలా జారుకుంది సౌమ్య.
స్వర్ణోత్సవాల స్వాతంత్ర్య కిరణం సోకని రామాపురంలో ఈనాటికి రాజారావుదే రాజ్యం! ఊరంతకీ ఎత్తైన చోట బెత్తంలా కన్పించేదే ఆయన భవనం. దేశానికి స్వతంత్ర్యం వచ్చిందంటే ఆవూళ్ళో చాలామంది నమ్మరు. అసలు స్వతంత్రం అన్న శబ్దం వాళ్ళకి తెలీని మాట. వాళ్ళకి తెలివి రాకూడదని రాజారావు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళు అక్షరానికి ఆమడ దూరంగా బతికినన్నాళ్ళూ తనకి ఢోకా లేదని రాజారావుకి తెల్సుగాబట్టే దాన్ని హాన ఇంట్లోనే బందీగా మార్చుకొన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS