Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 11

బస్ వేగంగా ముందుకు వెళ్ళిపోయింది.
మరోసారి అయితే కండక్టర్ కి తగిన సమాధానం చెప్పేవాడే శివరావు. ఇప్పుడు అతనున్న పరిస్థితి చాలా దయనీయమైనది. పోట్లాడే శక్తి కూడా లేదు. తన తలరాతను నిందించుకుంటూ వెనక్కి వచ్చి నిలబడ్డాడు.

మరో పదినిముషాల తరువాత వీళ్ళు ఎక్కవలసిన బస్సు అటుగా వచ్చింది. అయితే హారన్ మ్రోగించక పోవటంతో శివరావు గమనించలేదు. అదృష్ట దేవతకోసం నిరీక్షిస్తున్న దానిలా పార్వతి అటే చూస్తూ నుంచుని వుండటం వల్ల, ఆమె కళ్ళకి దూరంగా వస్తున్న బస్సు కానవచ్చింది.

"బస్సు వస్తున్నదండీ!" అంటూ ఒక్క వెర్రికేక పెట్టింది ఆనందంతో పార్వతి.

శివరావు కూడా అప్రయత్నంగా తల ఎత్తి అటుకేసి చూశాడు. బస్సు దగ్గరకి వచ్చేస్తున్నది.

బస్సుని చూస్తూనే పార్వతి చెయ్యి పుచ్చుకుని శివరావు రోడ్డుకి అడ్డంగా పరుగు తీశాడు.

అల్లంత దూరానే వీళ్ళ పరుగును చూసిన బస్సు డ్రైవరు, బస్సుని బాగా దగ్గరకి రానీకుండానే కొద్ది దూరంగా వుండగానే ఆపేశాడు.

పార్వతి, శివరావు అలా చెయ్యీ చెయ్యీ పుచ్చుకునే బస్సు వైపుకి దూసుకు వెళ్ళారు.

బస్సు డ్రైవరూ, కండక్టరూ క్రిందికి దిగి వచ్చారు.

"రోడ్డుకి అడ్డంగా ఈ పరుగు ఏమిటయ్యా?" డ్రైవర్ కోపంగా అడిగాడు.

"ఇద్దరూ కలిసి జాయింట్ గా చావదలచుకున్నారా?" కండక్టర్ అడిగాడు.

వాళ్ళేమంటున్నారో శివరావుకి అర్థం కాలేదు.

కంగారులో సరీగ వినిపించుకోను కూడా లేదు.

"మేము బస్సు ఎక్కాలి, చాలా అర్జెంట్ గా వెళ్ళాలి." ఆదుర్దాగా అన్నాడు శివరావు.

"బస్సు ఎక్కాలంటే ఇదా పద్ధతి" డ్రైవరు విసుక్కుంటూ అన్నాడు.

"ఉత్త పల్లెటూరి బైతులు" కండక్టరు లోలోపల గొణుక్కున్నాడు.

"ఊ... తొందరగా బస్సు ఎక్కండి!" అంటూ డ్రైవరు తన సీటు వైపుకి వెళ్ళబోయాడు.

"కాస్త తొందరగా పోవీ బామే!" అంటూ శివరావు డోర్ వైపు వెళ్ళాడు.

"సరీగ అప్పుడే చిన్న హాండ్ బాగ్ బ్రీఫ్ కేసును పుచ్చుకుని బస్ లోంచి దిగాడు మోహన్ రావు.

"అరె! మోహన్! నువ్వా!" మోహన్ రావుని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు.

"ఏమిటి? మామయ్యా!" అన్న మోహనరావు ప్రక్కనే వున్న పార్వతిని చూస్తూ" అరె! అత్తయ్య కూడా వచ్చింది ఏమిటి? ఇప్పుడు ఎక్కడకి వెళుతున్నారు?" అడిగాడు.

"నువ్వు మా యింటికేనా వచ్చేది?" అడిగాడు శివరావు.

"అవును!" అన్నాడు మోహనరావు.

"నువ్వు కూడా మాతోపాటు బస్ ఎక్కు. నీతో అర్జంట్ విషయం మాట్లాడాలి" అంటూ మోహన్ రావు రెక్కపుచ్చుకున్నాడు.

"ఏమయ్యా! మీరెక్కేదేమన్నా వుందా, బస్సును పోనీమంటారా?" కండక్టరు అరిచాడు.

ముగ్గురూ ఆదరాబాదరాగా బస్సు ఎక్కారు.

వాళ్ళెకంగానే "రైట్, రైట్" అన్నాడు కండక్టర్.

బస్సు శరవేగంతో ముందుకు సాగింది.
                                          7

 బస్సు సగం ఖాళీగానే వుంది.

వెనుక సీటులోకి వెళ్ళి ముగ్గురూ కూర్చున్నారు.

"ఏం జరిగింది మామయ్యా!" మోహనరావు అడిగాడు.

శివరావు చెప్పటానికి నోరు తెరిచాడో లేదో కండక్టర్ వీళ్ళు కూర్చున్న సీటు దగ్గరకి వచ్చాడు.

టికెట్స్ కి జేబులోంచి డబ్బు తీసి ఇస్తూ "బాబ్బాబు! మీకేదన్నా ఎక్కువ ఇచ్చుకుంటాను. బస్సు వేగంగా తీసుకెళ్ళటానికి వీలవుతుందా?" అడిగాడు శివరావు.

"వేగంగా తీసుకెళ్ళటానికి కుదురుతుంది గాని, మధ్యలో ఏ ఇన్ స్పెక్టరో, లేక మా పై అధికారో పట్టుకుంటే, మా ఉద్యోగాలు హుళక్కి అవుతాయి. అది జరిగే పనికాదు." అంటూ టికెట్స్ కోసి ఇచ్చాడు కండక్టర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS