ఆ తరువాత నా గొంతు పెగల్లేదు. అంతవరకూ చెప్పి ఆగిపోయాను.
రామ్ సింగ్ కళ్ళు మెరిశాయి. నా భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా తట్టాడు. "నీ అందమయిన రూపానికి తగ్గపేరు. నీ పేరులో రాజ్యమూ వుంది. విజయమూ వుంది. నీవు నీ గతాన్ని సమాధి కట్టలేదు. అలాంటప్పుడు "గుండేరావ్" లాంటి పిచ్చి పేరు తగిలించుకోవటం ఎందుకు? నేను మటుకు గుండేరావ్ పేరుతో పిలవను. నీ అసలు పేరుతోనే పిలుస్తాను. నీ జీవితాంతం నీకు నేను చేదోడువాదోడుగా వుంటాను. మనిద్దరం జీవితంలో దెబ్బతిన్న పక్షులమే. ఇరువురం ఒకేమాట మీద వుండి, కలిసి ముందుకు సాగుదాం" ఆవేశంగా పట్టుదలగా అన్నాడు.
నా కళ్ళు చెమ్మగిల్లాయ్.
నా మనస్సులో మాట ఇంతవరకూ ఎవరికీ చెప్పలేడు. అలాంటిది ఒక్కరోజులో మేమిద్దరం ఇంత దగ్గర ఎలా అయ్యాం? కనురెప్పపాటు కాలంలో వూహించనివి జరుగుతూ వుంటాయి. మనుష్యులు దగ్గర కావటానికి గానీ, దూరం కావటానికిగానీ, ఒక్క సంఘటన చాలు. నాకో తోడు దొరికాడు. ఈ మాట వక్కటే ప్రస్తుతానికి నాకు తృప్తినీ, ఆనందాన్ని కలుగజేస్తున్నాయి.
"నీ కథ మొత్తం ఏదో ఒకనాడు అక్షరం పొల్లుపోకుండా నాకు వినిపించాలి" రామ్ సింగ్ అన్నాడు.
"అలాగే" అన్నట్లు తలవూపాను.
కొద్దిసేపు ఇరువురం మౌనంగా వుండిపోయాం.
వున్నట్లుండి రామ్ సింగ్ తన లావుపాటి పొట్టను నిమురుకుంటూ "కడుపులో పేగుల్ని ఎలుకలు కొరుకుతున్నాయి భాయ్" అన్నాడు.
జాలిగా చూశాను అతనివైపు.
రామ్ సింగ్ పొట్టను చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది అతను భోజన ప్రియుడని. భోజన ప్రియులు ఆకలికి తాళలేరు.
"నీకు ఆకలి కావటంలేదా?" రామ్ సింగ్ అడిగాడు.
"నేనూ మనిషినే!" ముక్తసరిగా జవాబు ఇచ్చాను.
"ఈరోజు మనకోటా అరగ్లాసు మంచినీళ్ళు. అవికూడా తెచ్చి చావలేదు" రామ్ సింగ్ నాలికతో పెదవులు తడుపుకుంటూ అన్నాడు.
బాస్ గాడు మంచినీళ్ళు తీసుకురాకపోవచ్చు! అనిపించింది నా మనస్సుకు. కానీ ఆ మాట నేను పైకి చెప్పలేడు. ఎందుకంటే రామ్ సింగ్ నామాట విని, దాహంతో మరింత బాధపడతాడని.
"ఎడారిలో ఒయాసిస్ గుర్తుతెచ్చుకో! కాస్తయినా దాహం తీరి మనస్సుకి ఊరట కలుగుతుంది" నెమ్మదిగా అన్నాను.
"నీళ్ళూ నిప్పులూ లేకుండా, తిండీ తిప్పలూ లేకుండా, ఈ గదిలో ఇలాగే నీలుక్కుపోయి సజీవసమాధి అవం కదా!" రామ్ సింగ్ భయంతో అన్నాడు.
"ముందుకువచ్చే మృత్యువుని ఎవరూ ఆపలేరు. ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలివుంటే వాళ్ళనెవరూ చంపలేరు. కాబట్టి మరణం గురించి ఆలోచిస్తూ భయపడకు" ధైర్య వచనాలు పలికాను.
దాహం ఆపుకోలేని రామ్ సింగ్ "పై జన్మంటూ వుంటే బావిలో కప్పనై పుడతాను" అన్నాడు.
"నువ్వు బావిలో కప్పగా పుట్టు. నేను చెరువులో చేపగా పుడతాను" అన్నాను నవ్వుతూ.
6
"కోటీ యాభై లక్షలు' నువ్వెప్పుడైనా చూశావా?"
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అలా అడగంగానే కానిస్టేబుల్ అహోబిలం ఒకసారి నెత్తిమీద టోపీ తీసి బుర్ర గోక్కుని, ఆలోచనలో పడ్డాడు.
"నా ప్రశ్న వినపడిందా? లేదా?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అడిగాడు.
"వినపడింది సార్!"
"మరి మాట్లాడవేమి? ప్రశ్నవిని చెవిటివాడిలాగా వినపడనట్లు వూరుకున్నావేమిటి?"
"చెవుడు నాక్కాదు సార్! ఈ ప్రశ్న ఆలోచింపచేసేదిగా వుంటేను, ఆలోచిస్తున్నాను. చెవుడు వుంది కానిస్టేబుల్ కనకలింగానికి."
"ఏమిటి సార్! పిలిచారా!" అంటూ కానిస్టేబుల్ కనకలింగం పరిగెత్తుకుంటూ వచ్చాడు.
వర్ధనరావుకి వళ్ళుమండింది.
"పిలిచినప్పుడు పలకవ్! పిలవనపుడు పిలిచారా అంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. వెళ్ళి గుమ్మం అవతల నిలబడు" చిరాకుగా అన్నాడు.
ఎడమచెవి వగ్గి "ఆ!" అన్నాడు కనకలింగం.
